జల్లికట్టు తమిళులకు ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ క్రీడ. హింస మిళితమై ఉన్నదని, ఈ క్రీడలో భాగంగా పశువులను హింసిస్తున్నారనే ఆరోపణలతో ఆటపై నిషేధం విధించినా కూడా.. తమిళులందరూ పార్టీలకు, వర్గాలకు అతీతంగా తమ నిరసన తెలియజేసి కేంద్రం మెడలు వంచి మరీ అనుమతులు తెచ్చుకుని సాగిస్తున్న క్రీడ ఇది.
తమిళనాడు కాకపోయినప్పటికీ.. తమిళ ప్రభావం ఉండే చిత్తూరు జిల్లాలో కూడా సంక్రాంతి సీజన్లో ఈ క్రీడ జరుగుతూ ఉంటుంది. తమిళనాడు స్థాయిలో కాకపోయినా ఇక్కడి క్రీడకు కూడా బాగానే పాపులారిటీ ఉంది. వేల మంది జనం చూడడానికి తరలివస్తుంటారు. తెలుగునేలపై నిషేధాజ్ఞలు పుష్కలంగానే ఉన్నాయి గానీ.. పట్టించుకునేవారే లేరు. ప్రతి ఏటా యథావిధిగా జరుగుతూనే ఉంటుంది.
ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయానికి తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చి గడిపే నారా చంద్రబాబునాయుడు కూడా ఈ ఆటను వీక్షించడానికి వచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈ ఏడాది కూడా పల్లెల్లో అప్పుడే ఈ హడావుడి షురూ అయింది.

సంక్రాంతి సందడితో పాటుగానే..
సందడి మొదలైంది. పందెం రాయుళ్లు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. పండగ నేపథ్యంలో తమిళనాడు జల్లికట్టు తరహాలో చిత్తూరుజిల్లాలో జరిగే పశువుల పండుగ నిర్వహించేందుకు యువకులు సమాయత్తమవుతున్నారు. రెండు వారాల్లో పండుగ ఉందనగానే కొన్ని గ్రామాల్లో గుట్టచప్పుడు కాకుండా ఇప్పటినుంచే పోటీలు నిర్వహిస్తున్నారు.
also read : పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్.. వైసీపీకి పరువు నష్టం
పండుగ అందరికీ ఒకటే అయినా ఊరికో ప్రత్యేకత ఉంటుంది. ప్రాంతానికో రీతిలో పోటీ జరుగుతుంది. వందల ఏళ్ళనుంచి కొనసాగుతున్న పశువుల పండుగ సంప్రదాయ పోటీ చిత్తూరు జిల్లాకు ఓ ప్రత్యేకత. వ్యవసాయమే ప్రధానమైన చిత్తూరులో కనుమరోజున పశువుల పండగ జరుపుకోవడం ఆనవాయితీ. మాములుగా ఓ పండుగను ఒకరోజు, రెండురోజులు.. మహా అయితే మూడురోజులు జరుపుకుంటారు. కానీ చిత్తూరు ప్రజలు మాత్రం సంక్రాంతి పండుగను నెలరోజులకుపైగా జరుపుకుంటారు. అయితే వీళ్లు కాస్త భిన్నంగా కోళ్ల పందాలు కాకుండా పశువుల పండుగను నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం, చంద్రగిరి, పాకాల, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పులిచర్ల మండలాల్లో ఈ పండుగ వైభవంగా జరుగుతుంది.
తమిళ జల్లికట్టు శైలి..
తమిళనాడులో జల్లికట్టు ఫేమస్ కావడంతో దాని ప్రభావం చిత్తూరు జిల్లాపై కూడా ఉంది. సాధారణంగా చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమిళ సాంప్రదాయాలు, తమిళ భాషా ప్రభావం కూడా మెండుగా ఉంటుంది. ఆ క్రమంలోనే జల్లి కట్టు సాంప్రదాయం కూడా ఈ జిల్లాలో వేళ్లూనుకుంది. పశువుల పండుగ కాస్త జల్లికట్టుగా మారింది. అయితే తమిళనాడులో ఆంక్షలు లేకున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ ఆటపై ఆంక్షలున్నాయి. ఎన్ని ఆంక్షలు ఉన్నా సరే.. జిల్లాలో మాత్రం పోటీలు ఆగిన దాఖలాలు లేవు. ఇక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిషేధాజ్ఞలు పెట్టినా పందాలు మాత్రం ఆగడం లేదు.

ఏమిటీ ఆట?
జనం మధ్యలోకి వదిలిపెట్టిన ఎద్దులను వాటి వాడియైన కొమ్ములు పట్టుకుని నిలువరించడం ఈ క్రీడలో ప్రధానం. ఇందుకోసం వస్తాదుల్లాగా యువకులు పశువులకు అడ్డంగా నిలిచి కోడెగిత్తల మెడల వంచడం ఈ క్రీడ. అయితే ఈ ఆటలో కొందరికి గాయాలైతే కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అయినా అవన్నీ పట్టించుకోరు.
కోడెగిత్తల పొగరు అణిచేందుకు యువత గ్రూపులు కట్టి ఎద్దులను పట్టి పౌరుషాలను ప్రదర్శిస్తుంటారు. ఈ పందాలు ముఖ్యంగా గిత్తలకు, యువకులకు మధ్య జరిగే బుల్‌ఫైట్ అని చెప్పొచ్చు. గ్రూపుగా ఉన్న యువకులు గుంపులుగా వచ్చే ఎద్దులపై పడి వాటి కొమ్ములకు కట్టిన కానుకలను లాగేసుకుంటారు. అదే గెలుపుకు చిహ్నం. యువకుల వీరత్వానికి ప్రతీక. చిన్నపాటి ప్రచారం లేకున్నా ప్రజలు వేల సంఖ్యలో క్రీడలను చూడడానికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post