‘ఏయన్నార్ గురించి మాకో పుస్తకం రాస్తారా?’ అనడిగారు విజేత కాంపిటీషన్స్ అధినేత బండ్ల సాయిబాబు. ఆయనతో మూడు దశాబ్దాలకుపైగా స్నేహం ఉంది. కాదనేది ఏముంది, ఓకే అన్నాను.
అక్కినేని నాగేశ్వరావు కన్నుమూశాక ఆయనపై సమగ్రంగా ఒక పుస్తకం ప్రచురించాలని భావించారు సాయిబాబు. చాలా కాలంగా తను సేకరించి పెట్టిన సమాచారాన్ని పుస్తకాలను కూడా తెచ్చిపెట్టారు. దీంతో నాపని సులువయింది.
అక్కినేని నాగేశ్వరరావు జీవితం నుంచి ఇతరులు నేర్చుకోదగిన పాఠాలు ఏమిటి? ఏయే ప్రతికూల పరిస్థితులనుంచి తెలుగు సినిమా రంగంలో అగ్రనటుడిగా ఎదిగి 74 ఏళ్లపాటు కొనసాగగలిగారు? వంటి అంశాలతో వ్యక్తిత్వ వికాస గ్రంథం రాస్తే బావుంటుందని సాయిబాబు సూచించారు. ఆయన ఆకాంక్షకు తగ్గట్లుగానే ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టి ఆరేడు నెలల్లో పూర్తి చేయగలిగాను.
వృత్తిపరంగా నేను సినిమా జర్నలిస్టును కాను. అయితే పన్నెండేళ్లపాటు ఫిల్మ్ సెన్సార్ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది. వివిధ సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరరావును కలుసుకుని ఆయన ద్వారానే జీవిత విశేషాలను తెలుసుకుని ఉన్న అనుభవం ఉంది. అన్నిటికీ మించి ఏఎన్నార్, ఎన్టీఆర్ ల సినిమాలు చూస్తూ పెరిగిన తరానికి చెందినవాడిని. కీలకమైన సినిమా రంగంపై ఏమీ రాయలేదన్న లోటును ఈ పుస్తకం భర్తీ చేసింది.
అక్కినేని నాగేశ్వరరావు జీవితమూ, సినిమాలకు సంబంధించి విభిన్న కోణాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ‘నేనూ- నా జీవితం’ శీర్షికన తన జీవితానుభవాలను అక్కినేని గ్రంథస్థం చేశారు. 1963లోనే ‘కథానాయకుడి కథ’ పేరుతో ముళ్లపూడి వెంకటరమణ చక్కటి పుస్తకం రాశారు. తన ప్రస్థానం భావితరాలకు చేరాలన్న సంకల్పంతో జీవిత విశేషాలను వివిధ రూపాల్లో రికార్డు చేయాటానికి అక్కినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాను పరిస్థితుల ప్రాబల్యంతో చదువు కొనసాగించలేకున్నా, అక్షరానికి ఉన్న విలువ ఆయనకు బాగా తెలుసు. ఇలా వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్న విషయాలను అధ్యయనం చేసి వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ పుస్తకాన్ని సర్వ సమగ్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను.
2015లో విజేత కాంపిటీషన్స్ వారి పర్సనాలిటీ డెవలప్ మెంట్ సిరీస్ కింద ఈ పుస్తకం వెలువడింది. మల్టీకలర్ ఫోటోలతో 33 అధ్యాయాల్లో 600 పేజీలతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది.
‘నా గురించి నాకే తెలియని ఎన్నో విషయాలు తెలిసిన రమణ గారు’ అంటూ స్వయంగా నాగేశ్వరరావు నుంచే అభినందనలు అందుకున్న పురాణం వెంకటరమణతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూను అనుబంధంలో చేర్చాను. అక్కినేని నాగేశ్వరరావు కూతురు శ్రీమతి నాగసుశీల- ‘మన వెంటే వెన్నంటే’ శీర్షికతో పరిచయం రాస్తూ తండ్రితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో శ్రీమతి నాగసుశీల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
నాగార్జునతో కూడా ముందుమాట రాయిస్తే బావుంటుందని విశ్వప్రయత్నం చేసినా ఆయన మాకు అందుబాటులోకి రాలేదు. ఫోటోల ఎంపికలో, కవర్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు బండ్లసాయిబాబు. అక్కినేని ఫోటోతో ముద్రించిన కవర్ ప్రింటయి వచ్చాక సాయిబాబు సంతృప్తి చెందలేదు. ఆ కవర్ ను పక్కన పెట్టి, మరో ఫోటోతో కవర్ డిజైన్ చేయించి ప్రింటింగ్ కు వెళ్లారు.
అక్కినే‘నిజం’ అధ్యాయంతో ఈ పుస్తకం ఇలా మొదలవుతుంది –
‘‘అక్కినేని నాగేశ్వరరావుకు అమ్మ కడుపులో పడ్డప్పటినుంచే సమస్యలు సవాళ్లు విసిరాయి.
పుట్టబోయే బిడ్డ చుట్టూ నాగుపాము ముమ్మారు తిరిగినట్లు తల్లి పున్నమ్మకు కలవచ్చి ఏ ఆపద ముంచుకొస్తుందోనని కలవర పడింది.’’
నేను చెక్కిన వాక్యాల్లో నాకు నచ్చినవి కొన్ని ఇలా ఉన్నాయి :
కన్నమ్మ పున్నమ్మ అయినా, పెంచినమ్మ రంగస్థలమైంది. ఆ రంగస్థలమే పాఠాలు నేర్పే బడి అయింది. అభినయ కళే అక్షరమైంది. అమ్మ ఒడి అయింది.
ఫ్లాపుల ఓటములనుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. పొగడ్తలను అగడ్తలు దాటనివ్వలేదు. తెగడ్తలకే తొలి తాంబూలమిచ్చాడు.
—
ముందు తరాల్లో అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారిని మరొకరిని చూడలేమేమో!
ఆయన జీవితమే ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథం. అందులోని ప్రతి ఘట్టమూ ఓ జీవిత పాఠమే. ప్రతి మలుపూ అబ్బురపరిచే సంభ్రమమే.
—
సినిమాను తక్కువగా అంచనా వేయకండి. సినీ స్రష్టలు ఏదో ఒకనాడు మానవజాతికి శాసనకర్తలు అవుతారు. అంటూ సినిమా నటుల ప్రాముఖ్యాన్ని అలనాడెప్పుడో ఊహించి చెప్పగలిగాడు జార్జి బెర్నార్డ్ షా. ఆయన మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.
రచయితగా సంతృప్తినిచ్చిన పుస్తకం ఇది.
కొసమెరుపు :
హైదరాబాద్ లో 2021 డిసెంబర్ చివరలో జరిగిన పుస్తక ప్రదర్శన చివరి రోజున బండ్ల సాయిబాబు కన్పించాడు.
పాఠకుల అభిరుచులు, ఆసక్తులు నిశితంగా గమనిస్తూ వస్తున్న ఆయన ఒక మాట అన్నారు.
‘‘ఈరోజుల్లో ఎవరూ 200 పేజీలకు మించిన పుస్తకాలు చదవటానికి ముందుకు రావటంలేదు. అంతకు మించిన పేజీలున్న పుస్తకాలను ఆసక్తి ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు.
ఇప్పటి అభిరుచులను బట్టి అక్కినేని నాగేశ్వరరావు పుస్తకాన్ని రీప్రింట్ చేసేటపుడు పేజీలను కుదించటం మంచిది’’ అన్నారు.
ఆయన మాటలు కాదనలేని వాస్తవమే.
– డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయుడు, రచయిత
Discussion about this post