జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడిన్నరేళ్ళలో 40 వేల కోట్ల ఎర్రచందనం అక్రమంగా దేశ సరిహద్దులు దాటిందని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాయల సీమ జిల్లాలు ఎర్ర చందనం స్మగ్లర్లకు అడ్డాగా మారాయని తెలిపారు. శేషాచలం అడవుల్లో 5.2 లక్షల ఎకరాలలో వున్న ఎర్ర చందనం చెట్లు హరించి పోతున్నాయని చెప్పారు. స్మగ్లర్లు 30 ఏళ్ల కంటే ఎక్కవ వయస్సు ఉండి, చేవబారిన వాటినే దొంగతనంగా కొట్టి తరలిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో జైలుకు వెళ్లి వచ్చిన కొందరు ఎర్ర చందనం స్మగ్లర్లు ఇప్పుడు అధికార పార్టీ నేతలుగా చలామణి అవుతున్నారని చెప్పారు. వీరి జోక్యం వల్ల ఒకప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్లకు వణుకు పుట్టించిన యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు నామమాత్రంగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. అలాగే పోలీసులు, అటవీశాఖ అధికారులు, నిఘా విభాగం, చెక్ పోస్టుల సిబ్బంది చేష్టలుడిగి చూస్తున్నారని అన్నారు. కొంతమంది అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తమ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు కొందరు కూలీలను అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. అయితే చాలా సార్లు దొంగలను వదిలేసి ఎర్ర చందనం దుంగలను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారని హేళన చేశారు. అధికారులు అసలు స్మగ్లర్లను పట్టుకుని అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలమవుతున్నారని చెప్పారు. ఈ ఏడాది టాస్క్ ఫోర్స్ అధికారులు 180 కేసులు నమోదు చేసి 281 మందిని అరెస్టు చేశారని, 2,286 ఎర్ర చందనం దుంగలను, 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అలాగే 45 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, 73 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నామని అధికారులు తెలిపారని చెప్పారు. అయితే వీరి నుంచి ఆరా తీసి అసలు స్మగ్లర్లను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని నిలదీశారు. ప్రతి నిత్యం చంద్రగిరి, తిరుపతి, కోడూరు, రాజంపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంతాల నుంచి 100 టన్నుల ఎర్ర చందనం చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి పోతున్నదని చెప్పారు. లారీలు కార్లు, ప్రైవేట్ అంబులెన్సులు, పాల వ్యాన్లు, ఆర్టీసీ బస్సుల్లో దొంగ రవాణా జరుగుతున్నదని చెప్పారు. ఎక్కువగా రేణిగుంట, పుత్తూరు, నగరి, జి డి నెల్లూరు, కార్వేటినగరం, పీలేరు, పలమనేరు మదనపల్లి మార్గాలలో చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పారు. అక్కడి నుంచి చెన్నై, ముంబై, కోల్కతా ట్వుటికోరిన్ ఓడ రేవుల మీదుగా టిబెట్, నేపాల్ అక్కడినించి చైనా, జపాన్ దేశాలకు వెళుతున్నదని చెప్పారు. విదేశాలలో ఒక టన్ను ఎర్ర చందనం కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకు తుందని చెప్పారు. పదేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతున్న వారు, లారీ క్లీనర్లుగా పని చేసిన కొందరు ఎర్ర చందనం స్మగ్లింగ్ ద్వారా కోట్లు గడించి అధికార పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని తెలిపారు. కొందరు ఎర్ర చందనం స్మగ్లర్లు యువతను, తమిళ కూలీలను గంజాయి, మాదక ద్రవ్యాల బానిసలుగా మార్చి తమ అక్రమ రవాణాకు వాడుకుంటున్నారని చెప్పారు. జగన్ చిత్త శుద్ది ఉంటే శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం, అక్రమంగా తరలిపోతున్న దుంగలపై శ్వేత పత్రం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Discussion about this post