తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం తిరుపతి ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించు కోవడానికి వీలుగా మెరుగైన సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈద్గా మైదానంలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. వారికి చాక్లెట్లు పంచిపెట్టి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తిరుపతిలో హిందూ, ముస్లిం కుటుంబాలన్నీ తరతరాలుగా అత్యంత ఆత్మీయ అనుబంధాలను ఏర్పరచుకున్నాయని తెలిపారు. సోదర, సోదరి భావనతో, అందరూ ఒక్కటే అనే భావనతో తిరుపతి పట్టణం ఉందన్నారు. బక్రీద్ కావచ్చు, రంజాన్ కావచ్చు ఏ పండుగైనా సరే…హిందువుల పండుగలైనా సరే కలిసి నిర్వహించుకోవడం ఇక్కడి ఆనవాయితీ అన్నారు. ఇచ్చిపుచ్చుకోవడం ఓ సంప్రదాయంగా కొనసాగుతోందని చెప్పారు. ముస్లిం సోదరులు అత్యద్భుతంగా నిర్వహించనున్న బక్రీద్ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయటానికి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని వివరించారు. గతానికి పూర్తి భిన్నంగా, ఎన్ని వేలమంది ముస్లిం సోదరులైనా సరే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకోవటానికి అణువుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
నగర పాలక సంస్థ నిధులను ఖర్చు చేస్తూ వాళ్లకు ఇక్కడ ఎండ తాకేడి లేకుండా చక్కటి చలువ పందిళ్లు వేయిస్తున్నామన్నారు. అవసరమైతే కూలర్స్ పెట్టిస్తామని తెలియజేశారు. పారిశుధ్య పనులు మెరుగ్గా నిర్వహించి, ఈధ్గా మైదానంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతామన్నారు.
ముస్లిం సోదరులకు మరో సారి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ కె బాబు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, కోటూరు ఆంజనేయులు, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే ఇమామ్, నాయకులు రఫీ, ఇమ్రాన్ మాలిక్, ఇస్మాయిల్, చాంద్ భాషా నగర పాలక సంస్థ డీఈ రవీంద్ర పాల్గొన్నారు.
Discussion about this post