తమ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఎన్నికలలో విజయం సాధిస్తే- ఆ రూపేణా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీర్తి దక్కుతుంది! అంతేతప్ప ఎన్నికలలో పోటీ జరిగే అవకాశమే లేకుండా చేయడానికి, పోటీ తప్పించుకోవడానికి కుయుక్తులు ప్రయోగిస్తే పరువు పోతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం కలకడ మండలం నవాబుపేట పంచాయతీ ఎన్నిక విషయంలో అచ్చంగా అదే జరిగింది.
నవాబుపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. పైగా అక్కడ ఆ పార్టీ మద్దతుతో సర్పంచిగా నిలబడిన అభ్యర్థి గుర్రం శివ ప్రసాద్ నాయుడుకు ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. అయితే రాష్ట్రంలో చాలాచోట్ల చేసిన ప్రయోగాల మాదిరిగానే నవాబుపేట లో కూడా తమకు ఆధిక్యం వున్నట్లుగా చూపించుకోవాలని, విజయాన్ని నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరాటపడింది. కలగనింది. ఆ కలను నిజం చేసుకోవడానికి వారు ప్రజల్లో ఆదరణ పొందే ఏదైనా ఇతర ప్రయత్నాలు చేసి ఉంటే భేషుగ్గా ఉండేది. అలా కాకుండా ప్రత్యర్థిని పోటీలో లేకుండా చేయడానికి వక్రమార్గాలు అనుసరించి ఇప్పుడు పరువు పోగొట్టుకున్నారు.
తెలుగుదేశం తరఫున పోటీ చేసిన గుర్రం శివప్రసాద్ నాయుడును పోటీ నుంచి తప్పుకోవాలని ముందుగానే బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. నామినేషన్ల తర్వాత కూడా, ఉపసంహరించుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు. ఈలోగా ఆయన మీద అక్రమంగా మద్యం తరలిస్తున్న కేసు నమోదు అయింది.
వైకాపా నాయకుల ప్రేరేపణతోనే ఇలా కేసు నమోదు అయినట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం ఎన్నిక జరగబోతున్నదనగా గురువారం రాత్రి శివప్రసాద్ నాయుడుపై మద్యం కేసు నమోదు అయింది. అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలపై శివ ప్రసాద్ నాయుడును, మరో ఇద్దరు ఆయన అనుచరులను అరెస్టు చేశారు. వారిని పీలేరు సబ్ జైలుకు పంపారు.
ఆ రకంగా అభ్యర్థిని ఊర్లో లేకుండా చేయగలిగారు వైకాపా నాయకులు. శనివారం పోలింగ్ సమయానికి గుర్రం శివ ప్రసాద్ నాయుడు- పీలేరు సబ్ జైలు నుంచి పోలీస్ ల ఎస్కార్టుతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవాబుపేట ఎన్నిక విషయంలో ఇంత హైడ్రామా నడిచింది. తీరా ఫలితాలు వెలువడే సరికి వైకాపా నాయకులకు షాక్ తప్పలేదు ఏకంగా 56 ఓట్ల మెజారిటీతో శివ ప్రసాద్ నాయుడు విజయం సాధించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా సరే తమకు విజయం దక్కలేదని వైకాపా నాయకులు కుమిలిపోతున్నారు. అరెస్టు చేయించినా సరే తమ పార్టీ కార్యకర్త సర్పంచిగా గెలిచిన మీసం మెలేసారంటూ.. ఇదే విషయంపై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.