అసలే కరోనా సీజన్… ఆపై వర్క్ ఫ్రం హోం… ఇంకేముంది… చక్కగా తిన్నామా… వెళ్లి సిస్టం ముందు కూర్చున్నామా… ఏదో పని చేసుకున్నామా… ఇంట్లోనేగా ఉండేది… చక్కగా అమ్మ లేదా భార్య చేసి పెట్టే చిరుతిళ్లు తిన్నామా… పనిచేసుకున్నామా… అన్నచందంగా ఉంటొోంది ప్రస్తుతం అందరి పని… మగవారిపని ఇలా వుంటే.. ఆడవారికి చేసిపెట్టలేక పాపం చతికిలబడిపోతున్నారు. వర్కింగ్ వుమన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇటు వర్క్ ఫ్రం హోం… అటు హోం లోని వర్క్ మధ్య వాళ్లు అప్పడంలా నలిగిపోతున్నారు. అర్థం చేసుకునే హజ్బెండ్ వుంటే పరవాలేదు… అలాకాకుండా ‘మగాడు’ లాంటి మొగుడు వుంటే… ఇక అటు.. ఇటు చేసుకోలేక పాపం గిజగిజలాడిపోతున్నారు. కొన్ని కుటుంబాల్లో గొడవలు కూడా వస్తున్నాయంటే సందేహంలేదు.
అయితే ఇలా బాగా తిని ఇంట్లో కూర్చున్న వారికి ఆఫీసులకు వెళ్లే పని తప్పింది… పని తప్పలేదు… కానీ చక్కగా కూర్చుని తినడం వల్ల వాళ్లకు కొలెస్టరాల్ కూడా పెరుగుతోంది. అద్దం ముందు నిలబడితే… తమ రూపం తమకే ఎబ్బెట్టుగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎలాంటి శారీరక కష్టం లేకుండా కూర్చుని తినడం వల్ల తిన్న ఆహారం నుండి విడుదలైన కేలరీలు ఎలా ఖర్చు కావాలో తెలియకుండా చక్కగా పేరుకుపోతున్నాయి. ఫలితంగా ఊబకాయం తయారవుతోంది. దీన్ని తగ్గించుకోకుంటే మరింత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న పనులను చేసుకుంటూ మన అధిక కెలరీలను కరిగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అవేమీ పెద్ద బరువులు ఎత్తే పనికాదు… అలాగని జిమ్ కెళ్లి చేసే వ్యాయాయాలు కాదు… చక్కగా ఇంట్లోని చిన్న చిన్న పనులను చేస్తే చాలని నిపుణులు అంటున్నారు.
మీ భార్య, లేదా అమ్మ చేసే పనులలో కాస్త సాయం చేయండి. ఎలాగంటారా… గిన్నెలు కడగడం… ఎక్కువ భాగం నిలబడి చేసే ఈ పని వల్ల మన చేతుల కండరాలు, అాలాగే పిక్కలు గట్టిపడతాయి. అలాగే ఇల్లు ఊడ్చడం… ఈ పని ఇల్లు పెద్దదయితే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అంతేకాదు… కష్టం కూడా ఎక్కువే అవుతుంది. వంగి లేవడం వల్ల వీపు కండరాలు గట్టిపడతాయి. అలాగే ఇల్లు దులపండి. ఈ పనివల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు చక్కగా కదులుతాయి… ఇల్లు తుడవడం… ఇల్లు సర్దుకోవడం… ఇలాంటి పనులను చేయడం వల్ల మన శరీరానికి పని కల్పించినట్టవుతుంది… అటు అమ్మకైనా… లేదా భార్యకైనా కాస్త సాయం చేసినట్టు అవుతుంది. అంతేకాదు… మన పని మనం చేసుకోవడం వల్ల మనకు కాస్త సంతృప్తి ఉంటుంది.
విడిచిన బట్టలు ఎక్కడంటే అక్కడ వేసేవాళ్లు, అలాగే చెత్త ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వేసేవాళ్లు, తిన్న ప్లేటు కూడా తీయకుండా బద్దకంగా కూర్చునేవారు… ఈ పనులను చేస్తే అందులోని కష్టం వారికి కూడా తెలుస్తుంది. ఫలితంగా మరోసారి ఇలాంటి పనులను చేయడానికి సుముఖత చూపరు. మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుంది. కాబట్టి ఖాళీ సమయంలో కంప్యూటర్ లో గేమ్స్ ఆడుకోకుండా… అమ్మకు, లేదా భార్యకు ఇంటి పనులో సాయం చేయండి… ఆడుతు పాడుతు పనిచేస్తుంటే… అలుపు సొలుపేమున్నది… ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది… మనకు కొదవేమున్నది… అంటూ భార్యా భర్తలు పాడుకుంటూ పనిచేసుకోవచ్చు.. మరింకేం… చక్కగా కాస్త వదులుగా ఉండే బట్టలు వేసుకుని పనిలోకి దిగండి… అదనపు కేలరీలను కరిగించండి మరి…!
Discussion about this post