టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించాలని జేఈవో సదా భార్గవి ఆదేశించారు.
టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆమె పంచగవ్య ఉత్పత్తులపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తుల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం కోసం ఎస్వీ బీసి , ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు, నాణ్యత ప్రమాణాలు , భక్తులకు అవి అందుతున్న విధానంపై ఆమె ఆశీర్వాద కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ ప్రముఖ ఆలయాల వద్ద గత ఏడాది, ఈ ఏడాది, గత నెల, ఈ నెల విక్రయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో విక్రయాల కౌంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు ఒకటి, చేతులు శుభ్రం చేసుకోవడానికి మరొక లిక్విడ్ ను 20 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విక్రయాల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ తయారు చేయాలని ఐ.టి.జి.ఎం ను జేఈవో ఆదేశించారు. నమామి గోవింద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. నమామి గోవింద ఉత్పత్తుల తయారీ కేంద్రం లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్వీ బీసి సిఈవో షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, పిఆర్‌ఓ డాక్టర్ రవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఐ.టి.జి.ఎం సందీప్ పాల్గొన్నారు.
Discussion about this post