తిరుమలేశుని అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో అయోధ్యకాండ పారాయణం గురువారం ప్రారంభమైంది. నవంబరు 16వ తేదీ వరకు 27 రోజుల పాటు ఈ పారాయణం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమని, వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పారు.
సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో సంచరించేటప్పుడు పితృవాక్య పరిపాలన, సీతమ్మవారు పతివ్రత ధర్మం, లక్ష్మణ స్వామివారు సోదర ధర్మం వంటి అనేక ధర్మాలకు నిర్వచనంగా నిలిచారు. కాబట్టి అయోధ్యకాండను ధర్మకాండ అని కూడా అంటారు. రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేసిన, విన్న ప్రతి ఒక్కరికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అందరికి ధనం, ధాన్యం, గోవులు, ఏనుగులు తదితర వాటిని దానం చేసినట్లు తెలిపారు.
అయోధ్యకాండలోని మొత్తం 119 సర్గల్లో 4,308 శ్లోకాలు ఉన్నాయన్నారు. మొదటి రోజైన గురువారం ఉదయం 1 నుండి 7వ సర్గ వరకు ఉన్న 291 శ్లోకాలను 16 మంది వేద పండితులు పారాయణం చేసినట్లు తెలిపారు.
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో..
మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది ఉపాసకులు ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటున్నారని వివరించారు.
.

Discussion about this post