చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతలు కల్యాణం కోసం గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ పట్టు వస్తరాలు తీసుకువచ్చారు. పట్టు వస్త్రాలను తీసుకువచ్చిన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి దంపతులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
మణికంఠ ఆలయం వద్ద నుంచి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య వేడుకగా తీసుకెళ్లారు. అలంకార మండపంలో ఈ పట్టు వస్త్రాలను వేదపండితులకు శాస్త్రోక్తంగా అందజేశారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… టీటీడీ తరపున ఆది దంపతుల కల్యాణానికి పట్టు వస్త్రాలు మరోసారి సమర్పించే అవకాశం కావడం ఆనందంగా ఉందన్నారు.
ముక్కంటి ఆలయ అభివృద్ధికి టీటీడీ తనవంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
.

Discussion about this post