అత్యుత్తమ ఆటతీరుతో రాజసంగా సెమీస్ చేరిన టీమిండియా, మూడో ప్రపంచ కప్ ముద్దాడడానికి రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఈ రెండూ లీగ్ మ్యాచ్‌లు కావు. అలసత్వానికి తావులేని చావోరేవో మ్యాచ్‌లు… భీకర పోరాటాలను తలపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టోర్నీ ఆసాంతం చక్కని ప్రదర్శన చేసినా… కీలక సెమీఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను రెండు అంశాలు కలవరపరుస్తున్నాయి. ఒకటి, సందర్భానికి తగినట్లు సొంత జట్టులోని మేటి ఆటగాళ్ల సామర్థ్యం బయటకి రాకపోవడం, గాయాల సమస్యతో కీలక ఆటగాళ్లు దూరమవడమైతే.. రెండవది భీకర ఫామ్‌తో దడపుట్టిస్తున్న ఆ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లను అడ్డుకోవడం ఎలా అనేది. ఆ ద్వయం… వరుస శతకాలతో రికార్డులను తిరగరాస్తున్న బ్యాటింగ్ సంచలనం రోహిత్ శర్మ, యార్కర్లతో మేటి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్న బూమ్.. బూమ్.. బుమ్రా!
ప్రస్తుత భారత జట్టును వర్ణించడానికి విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు ఎన్నో విశేషణాలను వాడుతున్నారు. ఎవరెలా చెప్పినా అధికుల ఆంతర్యం నేటి భారత జట్టు దుర్భేద్యమైనదని, 1970-80ల నాటి విండీస్‌ను తలపిస్తోందని. నాటి కరీబియన్ జట్టులో బ్యాట్స్‌మెన్ చెలరేగి కఠిన లక్ష్యాలను నిర్దేశిస్తే, నిప్పులను కురిపించే బంతులతో బౌలర్లు ప్రత్యర్థి బ్యాటింగ్‌ను చాపలా చుట్టేసేవారు. ఇప్పుడు టీమిండియా చేస్తున్నదీ ఇదే. టీమిండియాను ఈ స్థాయికి చేర్చిన ఘనత కెప్టెన్లుగా ధోని, కోహ్లిలకే దక్కుతుంది. కానీ ఆ ఇద్దరూ ప్రోగించిన అస్త్రాలు ఒకటే. ఓపెనింగ్ ద్వయం రోహిత్-ధావన్. గాయంతో ధావన్ టోర్నీకి దూరమైనా తన అసాధారణ ఇన్నింగ్స్‌తో రోహిత్.. జట్టుకు రక్షణ కవచంలా మారాడు. ఇపుడు ప్రత్యేకించి రోహిత్ ఆటతీరును, శైలిని విశ్లేషించాల్సిన పనిలేదు. మేటి బౌలర్లు సైతం అతని ముందు తేలిపోతున్నారు. అతని కాచ్‌లను వదిలేస్తే మ్యాచ్‌ను వదిలేసినట్లేనన్నది ప్రత్యర్థి జట్లకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. తన లక్ష్యం రికార్డులు కాదని, వరుస శతకాలతో తాను తృప్తిపడనని, ప్రపంచకప్ సాధనే లక్ష్యమని చెప్పిన హిట్‌మ్యాన్ దృక్పథం.. ఇపుడు ప్రత్యర్థి జట్లను కలవరపరుస్తోంది. కోహ్లితో పోలిస్తే కాస్త బొద్దుగా కనిపించినా, పరుగుల వరద పారించడంలో దీటుగా నిలవడానికి కారణం అతని దృక్పథంతో పాటు టెక్నిక్ కూడా. అతనిలోని అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యం జట్టుకు కొండంత అండ. అన్నింటికి మించి రోహిత్ జట్టుకు చేస్తున్న గొప్ప మేలు పార్ట్‌నర్‌ను స్థిరపరచడం. చాలాకాలంగా మరో ఎండ్‌లో ఉత్తేజాన్నిస్తూ, తనతో పాటు జట్టు భారాన్ని మోస్తున్న ధావన్ వంటి కీలక ఆటగాడి గైర్హాజరీలో రోహిత్ పోషిస్తున్న పాత్ర ఎంతైనా ప్రశంసనీయం. తాత్కాలిక ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన రాహుల్ కుదురైన ఆటతీరుతో మంచి స్కోర్లు చేయడానికి బాటలు వేసింది రోహితే. తొలుత అర్ధశతకాలతో ఫరవాలేదనిపించిన రాహుల్ లంకతో మ్యాచ్‌లో సెంచరీ బాది జట్టుకు భరోసానివ్వడం వెనుక ఉన్నది హిట్‌మ్యాన్ అన్నది జట్టు మనోగతం కూడా. ఇప్పటికే ఐదు శతకాలతో రికార్డు సృష్టించి, భీకర ఫామ్ లో ఉన్న రోహిత్‌ను ఆపడం ఎలా అన్నది ప్రత్యర్థి జట్లకు ఓ భేతాళ ప్రశ్న! ఆసీస్, కివీస్ తదితర జట్లకు మరో తలనొప్పి వ్యవహారం… యార్కర్ల స్పెషలిస్టు జస్‌ప్రీత్ బుమ్రాను ఎలా అడ్డుకోవడం అన్నది. అతను ఏ స్పెల్‌లో ఎలా విరుచుకుపడతాడోనన్నది వారి అంచనాలకు అందని విషయం. పిచ్ కండిషన్స్, వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో అతనెంత ప్రమాదకరమో ఇప్పటికే అన్ని జట్లకూ అవగతమైంది. ప్రత్యేకించి మ్యాచ్‌కు ముగింపునిచ్చే చివరి ఓవర్లలో లక్ష్యానికి అవసరమైన పరుగులు రాబట్టడం సంగతలా ఉంచి, తన యార్కర్లను ఎలా కాచుకోవాలా అని బ్యా్ట్స్‌మెన్ ఆలోచించే పరిస్థితి కల్పించాడు బుమ్రా! బంగ్లాతో మ్యాచ్‌లో అతని నాలుగు వికెట్ల హాల్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటుంది. పదునైన యార్కర్లతో వరుస వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యేకించి ఈ ప్రపంచకప్‌లో అతని ఎకానమీ అద్భుతమనే చెప్పాలి. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 26 వికెట్లతో ముందున్నా.. 17 వికెట్లు తీసిన బుమ్రా కేవలం 4.48 ఎకానమీతో మిగతా బౌలర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు. అవలీలగా మూడొందలకు పైగా స్కోర్లు నమోదవుతున్న ఇంగ్లండ్ పిచ్‌లపై ఓవర్‌కు ఐదులోపు పరుగులు విశేషమే. పరుగులివ్వడంలో పిసినారితనం చూపే బుమ్రా ఇపుడు ప్రత్యర్థులకు కొరకరానికొయ్య. బౌలింగ్‌లో అతని కచ్చితత్వం, బంతి వేగాన్ని నియంత్రించుకునే నేర్పరితనం, పిచ్ పరిస్థితులను, బ్యాట్స్‌మెన్ ఆలోచనలను చదవగలిగే వ్యూహం… టీమిండియాకు గొప్ప బలం. అన్నింటికి మించి బ్యాట్స్‌మెన్‌కు తన బంతులను చదవగలిగే సమయం ఇవ్వకపోవడం. నడకలా ఆరంభమై క్రీజు దగ్గర అకస్మాత్తుగా విస్ఫోటనాన్ని సృష్టించే అతని బౌలింగ్ శైలి బ్యాట్స్‌మెన్‌కు దడ పుట్టిస్తోంది. స్లోడెలివరీలు సంధించడంలో, బౌన్సర్లు విసరడంలో అతనికతనే సాటి. మరో పేసర్ మహ్మద్ షమీ నుంచి వికెట్ల వేటలో చక్కని సహకారం అందుతున్న నేపథ్యంలో బుమ్రా మరింత ప్రమాదకారి అన్నది మాజీ ఆటగాళ్ల మాట. సెమీస్, ఫైనల్స్‌లో బుమ్రా ఇలాగే చెలరేగితే భారత్ మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనడంలో ఎవరికీ ఎంతమాత్రమూ సందేహం లేదు.
రోహిత్ శర్మ
మ్యాచ్‌లు : 8
పరుగులు : 647
శతకాలు : 5
అ.స్కోరు : 140
సగటు : 92.42
జస్‌ప్రీత్ బుమ్రా
మ్యాచ్‌లు : 8
వికెట్లు : 17
బె.బౌలింగ్ : 4/55
ఎకానమీ : 4.48
మెయిడెన్లు : 8
కీలక సెమీస్ ముందు భారత జట్టు సన్నద్ధత పకడ్బందీగా కనిపిస్తోంది. జట్టులో నిన్నటి దాకా వేధించిన సమస్యలు ఇప్పుడు లేవు. విఖ్యాత విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా చెప్పినట్లుగా విరాట్ కోహ్లికి, మిగతా బ్యాట్స్‌మెన్‌కు మధ్య అంతరం చాలా పెరిగింది. కోహ్లితో కూడిన భారత టాపార్డర్ అభేద్యంగా కనిపిస్తోంది. నాలుగో స్థానంలో పంత్ కుదురుకున్నట్లే. బంగ్లాతో మ్యాచ్‌లో వరుస వికెట్లు పడిన సందర్భంలో పంత్ హ్యాట్రిక్ ఫోర్లు సాధించిన తీరు అమోఘమనే చెప్పాలి. అతని దూకుడైన ఆటతీరుతో అప్పటిదాకా భారత్‌పై ఉన్న ఒత్తిడి కాస్తా బంగ్లా బౌలర్లపై పడింది. ధోనీ ఆటతీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఎవరూ పిచ్ కండిషన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. నిజానికి అతని అనుభవమే టీమిండియాకు గొప్ప వరం. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి బౌలింగ్‌లో స్పిన్నర్లూ సామర్థ్యానికి తగినట్లు మిడిల్ ఓవర్లలో సహకరిస్తే మిగతా పని కోహ్లి అండ్ కో చూసుకుంటుంది. అయితే ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక… రోహిత్ క్యాచ్ వదిలేస్తే మ్యాచ్, మ్యాచ్‌తో పాటు కప్పూ చేజార్చుకున్నట్లే!
Discussion about this post