అలతి అలతి పదాలతో అనల్పమైన అక్షరాలు జోడించి జీవితతత్వాన్ని, జీవిత సత్యాలను, అనుభవాలను కాచి , వడపోసిన తెలుగు మహాకవులలో ప్రజాకవిగా వేమన నిలిచారని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా అధ్యక్షులు యువశ్రీ మురళి కొనియాడారు.
గురువారం ప్రజాకవి వేమన జయంతి సందర్భంగా మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన రాసిన వేమన శతకంలోని పద్యాలు వ్యక్తిత్వ వికాసానికి దర్పణాలని, మంచి చెడు, మానవ విలువలు, నీతి నియమాలు వంటివి ఎన్నో వేమన పద్యాల్లో కనపడతాయన్నారు.
పామరుల వద్దకు తన కవిత్వాన్ని చేర్చిన అసాధారణ కవి వేమనని, విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో విశ్వవ్యాపితమైన వేమన పద్యాలు ఎప్పుడు చదివినా కొత్తదనంగా ఇంకా చదవాలనే లా , తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుందన్నారు.
తెలుగు భాషకే స్వంతమైన పద్యాలు తెలుగు జాతికి మణిహారాలుగా నిలిచి, ఊరూరా,వాడ వాడ, పామరుల నోట నర్తిస్తున్నాయని.నిస్సందేహంగా ప్రపంచ కవులలో ఒకరుగా వేమన ప్రాతఃస్మరణీయులని కొనియాడారు.
ఈ సందర్భంగా 9 వి.తరగతి విద్యార్థిని రీష్మా వేమన పద్యాలను పఠించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయసుధ, వాణి, రామక్క, మాధవీలత, ఒబ్బు దేవీప్రసాద్, వేణుగోపాల్, నాదెండ్ల మురళి, సురేష్ బాబు, మోహన్ బాబు, దాసు మరియు విద్యా ర్థులు పాల్గొన్నారు.
Discussion about this post