తొలినుంచి సహకరిస్తూనే ఉన్నారు కద

226

రాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాలుగాను సహకరిస్తున్నాం అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. బహుశా ఇది కరోనా విషయంలో కావొచ్చు. కానీ నిజానికి తొలినుంచి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితికి సహకరిస్తూనే ఉన్నది కదా.. అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో ప్రజలకు రుచించని నిర్ణయాలతో ముందకు సాగుతున్నప్పటికీ ప్రజాస్పందనను సరిగ్గా ప్రతిబింబించడంలో ప్రతిపక్షం విఫలం అవుతూనే ఉంది. దాంతో తెరాసకు ఎదురులేకుండా పోతున్నది. 

కాంగ్రెస్ పార్టీ… సాంప్రదాయంగా ఉన్న ముఠా కుమ్మలాటల సంస్కృతితోనే, ఈ కష్టకాలంలో మరింత కిందకు దిగజారుతోంది. సాధారణంగా ఒక రాజకీయపార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్గతంగా కీచులాటలు అధికంగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాలకపక్షంతో పోరాడే పనిలో నాయకులందరూ ఐకమత్యంగా ఉంటారు. నిజానికి అలా ఉండాలి. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ రూటే సెపరేటు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెరాస చేతిలో చావుదెబ్బ తినప్పటికీ.. కాంగ్రెస్ కు స్థానికంగా తెలివిడి రాలేదు. ఐక్యంగా ఉండి పార్టీ నిర్మాణం గురించి శ్రద్ధ పెట్టలేదు. పార్టీ ప్రజావత్యిరేక నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో సమష్టిగా పోరాడడం కూడా మరచిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ పీసీసీ స్థానం తనకు భారంగా తయారైందని అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారా అనే వాదనలూ ఉన్నాయి. కాగా, ఆ పీసీసీ స్థానంకోసం ఇతర నాయకులు కుమ్ములాడుకోవడమూ జరుగుతోంది. ఉత్తమ్ మీద ఆరోపణలు చేసేవారు, తమలో తాము ఒకరి అవకాశాలకు ఎర్త్ పెట్టాలని మరొకరు ప్రయత్నించుకోవడమూ ఇలాంటి అనేక ముఠా తగాదాలు నడుస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాడడం అనేది తెలంగాణ కాంగ్రెస్ మరచిపోయినట్లుంది. 

ఫేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ .. ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనాపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అయితే ఒక్క కరోనా విషయంలోనే ఏమిటి.. వారంతా చాలా కాలంగా అదే పనిచేస్తున్నారు కదా అని రాజకీయవర్గాల్లో జోకులు పేలుతున్నాయి.

Facebook Comments