‘ఒకప్పటి థగ్స్ కు, దారి దోపిడీ చేసేవాళ్ళకీ, మావోయిస్టులకీ తేడా ఏముంది?’ అని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికార్ల సంఘం అధ్యక్షుడు యేదుల గోపిరెడ్డి ప్రశ్నించారు. బీజాపూర్- సుక్మా సమీపంలో మావోయిస్టు దళాలు పోలీసు జవాన్లను అత్యంత కిరాతకంగా హతమార్చిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికార్ల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి స్పందించారు.
‘ఎక్కడైనా ఒక మావోయిస్టు ఎన్ కౌంటర్లో చనిపోతే కొందరికి వెంటనే వాళ్ళ మానవ హక్కులు గుర్తొస్తాయి. ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాలనీ గౌరవించనప్పుడు, ఈ రాజ్యాంగమే ఇచ్చే మానవ హక్కులు అడిగే హక్కు ఎక్కడిది?’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. ‘రాజ్యాంగం ప్రకారమే, ఈ చట్టాల ప్రకారమే ఉద్యోగం చేసే జవాన్లు చనిపోతే మాత్రం మానవ హక్కులు గుర్తుకు రావు. అప్పటి బలిమెలనో, ఈరోజు బీజాపూర్ జిల్లా టెర్రామ్ సంఘటనో వాళ్ళ దృష్టిలో ఘన విజయం’ అంటూ గోపిరెడ్డి నిరసించారు.
‘మనుషులను చంపడమే గొప్ప అని భావించేది కూడా ఒక సిద్ధాంతమేనా? తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం ఇప్పుడు సాధ్యమా? ఈ మానవ నిర్మూలనా కార్యక్రమాలను మానుకొని, ప్రజల్లోకి వచ్చి, మారిన ఈ సమాజాన్ని చూసి, మీరూ మారండి. మా జవాన్ల ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఏదో ఒక రోజుకి రక్తపాత రహిత సమాజానికి పాటుపడతాం’ అంటూ గోపిరెడ్డి మావోయిస్టులకు పిలుపు ఇచ్చారు.
ఈ రాజ్యాంగం ద్వారా అందరి మానవ హక్కులకు అండగా ఉంటామంటూ, ఆ క్రమంలోనే అసువులు బాసిన వీర జవాన్లకు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. గోపిరెడ్డి అశ్రు నివాళులు అర్పించారు.
.

Discussion about this post