భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ ప్రకటనపై అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పక్క రాష్ట్రాల నేతలూ హేళన చేస్తున్నారు. సొంత పార్టీ నేతలూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం సోము వీర్రాజు ప్రకటనపై నోరు మెదపడం లేదు. ఆయన మౌనం అంగీకారమా..? లేక తిరస్కారమా..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలు ఎంతో కృషి చేస్తున్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నారు. వైసీపీపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, ఇందులో భాగంగానే ఇటీవల విజయవాడలో ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆ పార్టీ కేంద్ర నేతలు కూడా హాజరయ్యారు. వీరి సమక్షంలోనే సోమువీర్రాజు చీప్ లిక్కర్ గురించి మాట్లాడారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ తాగే వారు కోటి మంది వరకు ఉన్నారని… వచ్చే ఎన్నికల్లో వీరందరూ తమ పార్టీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చి…చీప్ లిక్కర్ రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ వివాదాస్పదమైంది.
ఓటర్లను తాగుబోతులుగా పోల్చడంతో పాటు.. రాష్ట్రంలో అనేక రకమైన సమస్యలుంటే.. చీప్ లిక్కర్ ధర తగ్గిస్తామని హామీ ఇవ్వడం చాలా వివాదమైంది. ఈ హామీపై బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఇంతవరకు నోరు మెదపలేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు మౌనం పాటిస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు ఏం అన్యాయం జరిగినా పాలకులను ప్రశ్నించడంలో పవన్ ముందు వరుసలో ఉంటారు. ప్రశ్నించడం కోసమే తాను రాజకీయాల్లోకి వఛ్చానని పదే పదే పవన్ చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన పాలకులను నిలదీస్తుంటారు.
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి పవన్ మద్దతు తెలిపారు. అక్కడ దీక్షల్లో పాల్గొనడంతో పాటు… విశాఖ ఉక్కును ప్రైవేటీకణ చేయకూడదని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతు ఉద్యమానికి ఒకపుడు బీజేపీ దూరంగా ఉన్నప్పటికీ.. పవన్ మాత్రం మద్దతు ప్రకటించారు. అంటే బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. ప్రజలకు సమస్యలు వచ్చినపుడు వారికి అండగా నిలబడుతూ ఆయన అందరి మన్ననలు పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను గురించి పట్టించుకోక పోవడంతో పవన్ స్వయంగా రోడ్ల మరమ్మతులకు దిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై రోడ్లకు మరమ్మతులు చేయించింది. అలాంటి పోరాట పటిమ… ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కల్యాణ్ నేడు సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై మాట్లాడటం లేదు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నందున ఈ ప్రకటనపై పవన్ నోరు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకవేళ పవన్ నోరు విప్పకపోతే.. వీర్రాజును సమర్థించినట్లే. ఆ చీప్బు లిక్కరు బురద జనసేనానికి కూడా అంటుకుంటుంది. భవిష్యత్తుపై ఈ ప్రభావం పడుతుంది. కాపు సామాజిక వర్గంతో పాటు.. రాష్ట్రంలో పవన్ ను అభిమానించే ప్రత్యేక వర్గం ఉంది. సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ ప్రకటన వీరందరినీ బాధిస్తోంది. వీరందరూ కూడా పవన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. జనసేనాని ఇకనైనా మౌనం వీడి పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.
.