వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కడపజిల్లానే వారికి పెట్టని కోట. అలాంటి చోట బద్వేలు ఎమ్మెల్యే స్థానం వారి సిటింగ్ సీటు. ఎమ్మెల్యే హఠాన్మరణంతో అదే కుటుంబానికి టికెట్ ఇవ్వడం వలన సానుభూతి కూడా జత అవుతోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఓట్ల వెల్లువను తెచ్చిపెడతాయనే నమ్మకం చాలా చాలా ఉంది.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బరిలో లేవు. అసలు విజయం కోసం ఏ కష్టమూ పడకపోయినా సరే.. విజయం తప్పదు అనేంత ధీమా ఉంది. అయినా సరే.. బద్వేలు ఉప ఎన్నికలో బయటిప్రాంతాల నుంచి వచ్చిన వారు.. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారంటే.. అది దేనికి సంకేతం.
బద్వేలు ఉపఎన్నిక విషయంలో అధికార పార్టీ ఎంత ధీమాగా ఉన్నదంటే.. తన సొంత జిల్లాలోని ఎన్నికే అయినప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. నిజానికి గెలుపుకోసం ముఖ్యమంత్రి స్వయంగా రావాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. అదే ధీమా ఉండడం కరక్టే.. కానీ వైసీపీ నాయకులు దొంగ ఓట్ల ప్రయత్నం చేయకుండా.. హుందాతనాన్ని కూడా కాపాడుకుని ఉంటే మరింత గౌరవంగా ఉండేది.
బద్వేలు ఉపఎన్నిక అనేది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నల్లేరుపై బండి నడక లాంటిది. లక్షఓట్ల మెజారిటీ అనే అంశాన్ని వారు చాలా చిన్నదిగానే పరిగణించారు. అలాగని ఎన్నికను ఆషామాషీగా మాత్రం తీసుకోలేదు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో అంతా తానే అయి చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నికలో కూడా కీలక భూమిక పోషించారు. పార్టీ ఎమ్మెల్యేలు అనేక మంది ఇక్కడ తిష్ట వేసి ప్రచార బాధ్యతలు చూశారు. అవసరానికి మించి కష్టపడ్డారు.
నిజానికి రాష్ట్రంలోనే ఏ మాత్రం బలం లేని బీజేపీ అక్కడ బరిలోకి దిగింది. అప్రకటిత సాంప్రదాయం పేరు చెప్పి.. తెలుగుదేశం, జనసేన ముందే పోటీనుంచి తప్పుకున్నాయి. తాము బరిలో లేకుండా, ప్రచారం చేయకుండా బీజేపీ తరఫు అభ్యర్థి బరిలో ఉంటే.. తమ ఓట్లు ఎంత వరకు అటువైపు మళ్లుతాయో.. మూడు పార్టీలు ఉమ్మడిగా ఎంత మేర ఓట్లు రాబట్టగలరో ఓ చెక్ చేసుకున్నారు.
నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు అందరితో ఫుల్ గా టచ్ లో ఉంటూ ఆ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఓటమి తథ్యం అని తెలిసినా బాగానే కష్టపడ్డారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అధికార పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కూడా కారణం అదే. బీజేపీ అభ్యర్థికి ఓ మోస్తరు ఓట్లు వచ్చినా.. ఆ మూడు పార్టీలు జట్టుగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాయనేది వైసీపీ భయం. అందువల్లనే.. విజయం తథ్యమని తెలిసిన ఎన్నికల్లో కూడా దొంగఓట్ల వంటి లోపాయికారీ పనులకు పాల్పడ్డారా అనే అభిప్రాయం కలుగుతోంది. వారి ఆలోచన ఏమైనా అయి ఉండొచ్చు గానీ.. దొంగ ఓట్ల రగడ వల్ల పరువు పోయింది.
.

Discussion about this post