భాషా వికాసానికి సాహిత్య అకాడమీలు చేసే మేలు గణనీయంగానే ఉంటుంది. వ్యక్తి వికాసానికి తద్వారా సమాజ వికాసానికి భాష అవసరం కూడా చాలా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో.. భాష గురించి ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోకపోతే.. అంతిమంగా ఆ ప్రభావం సమాజం మీద, ప్రతి వ్యక్తి మీద కూడా పడుతుంది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తెరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాహిత్య అకాడమీని ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తాయా? అనేది ప్రశ్న.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనాథలా ఏర్పడిందని మనం అంతా అనుకుంటూ ఉంటాం. కనీసం రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం అని అందరికీ తెలుసు. రాజధాని ఏర్పాటుకు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. అదే క్రమంలో.. అదే విభజన కారణంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంత సాహిత్య అకాడమీ కూడా లేకుండా పోయింది. ఆ పరంగా కూడా రాష్ట్రం అనాథే అయింది. కానీ, విభజన తర్వాత ఏర్పడిన రెండు ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు.
ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం తమ రాష్ట్ర మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెబుతోంది. పూర్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, విభజన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీగా మారిపోయిన నేపథ్యంలో ఏపీలో కూడా ఒక సాహిత్య అకాడమీ అవసరం ఉంది. కానీ.. ప్రభుత్వాలు మాత్రం దృష్టి సారించడం లేదు.
తిరుపతి నగరంలో ఈనెల 23, 24 తేదీలలో అత్యంత వైభవంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రస్తుత సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో వస్తున్న మార్పులను, ప్రభుత్వాల విధానాలను విశ్లేషిస్తూ సమాజ శ్రేయస్సు కోరి అరసం ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. మహాసభల్లో ఆమోదించిన ఆ ఐదు తీర్మానాల సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ని స్థాపించింది. అయితే, 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత, అది తెలంగాణ సాహిత్య అకాడమీగా మారిపోయింది. ఆవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య అకాడమీ లేకుండా పోయింది. గత 12 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధిలో సాహిత్య అకాడమీ పాత్ర ఎంతో విలువైంది. కాబట్టి, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి తక్షణమే ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ని స్థాపించాలని అరసం డిమాండ్ చేస్తోంది.
విద్యారంగంలో చరిత్ర వక్రీకరణలను ఖండిద్దాం
ఆధునిక యుగానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక, చరిత్ర అంశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యారంగానికి ఉంది. అందుకు తగిన విధంగా పాఠ్యగ్రంథాలను రూపొందించాలి. కానీ గత దశాబ్దకాలంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తిరోగమన భావజాలాన్ని వివిధ రూపాల్లో ప్రవేశపెడుతోంది. ఉన్నత విద్యావ్యవస్థల్లో కాషాయ భావజాలంగల వ్యక్తులను నియమించడం ద్వారా విద్యా రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. పాఠ్యాంశాలలో తమ భావజాలానికి అనుగుణమైన అంశాలను చొప్పిస్తూ, అందులో భాగంగా చారిత్రక అంశాలను కూడా వక్రీకరిస్తున్నారు. ఇది పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ పాకింది. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన ఈ విధానాలను అరసం తీవ్రంగా ఖండిస్తూ, నిరసిసించింది.
పరిపాలన, బోధనా భాషగా తెలుగును అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మభాష తెలుగుకు రోజురోజుకూ ఆదరణ కరువవుతోంది. పాలనా, విద్యా వ్యవస్థల్లో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆధునిక ప్రపంచానికి ఆంగ్లం అనుసంధాన భాష అని, అందుకే దానిని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం పూర్తిగా అశాస్త్రీయ వాదం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పాఠశాల విద్య మాతృభాషలోనే కొనసాగుతుంది. ఆంగ్ల భాషను ఒక పాఠ్యాంశంగా నేర్పడానికి ఎవరూ కాదనరు. కానీ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాష నిర్లక్ష్యానికి గురైంది. ఈ విధానాలను అరసం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధనను కొనసాగించేందుకు ప్రభుత్వం పూనుకోవాలని, ఆంగ్ల భాషను ఒక ముఖ్యమైన బోధనా అంశంగా ప్రోత్సహించవచ్చని, అదేవిధంగా పరిపాలనా వ్యవస్థలు విధిగా కార్యకలాపాలను తెలుగులోనే నిర్వహించాలని అరసం డిమాండు చేసింది.
గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి
స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుండి తెలుగునాట గ్రంథాలయాలు నిర్వహించిన పాత్ర మహోన్నతమైనది. ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించడంలో, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయి. అయితే గత దశాబ్దకాలంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రమయ్యాక గ్రంథాలయాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. పుస్తకాల కొనుగోళ్లు నిలిచిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను తిరిగి భర్తీ చేయడం లేదు. ఫలితంగా పలు గ్రంథాలయాలు మూతపడుతున్నాయి.
స్థానిక సంస్థల నుండి కోట్లాది రూపాయల గ్రంథాలయ సెస్ ప్రతి ఏటా వసూలవుతున్నా, వాటిని గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించకుండా దారి మళ్లిస్తున్నారు. గత రెండేళ్లుగా అరసం నేతృత్వంలో ఇతర సంఘాలు, సాహిత్య సంస్థలు దీనిపై ఉద్యమించాయి. ఫలితంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, పూర్తిస్థాయిలో గ్రంథాలయాల నిర్వహణ తీరుతెన్నులను మెరుగుపరచాలి. నిధులు దారిమళ్లించకూడదని, ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అరసం డిమాండ్ చేసింది.
అధిక ధరలు, నిరుద్యోగం – ప్రభుత్వ విధానాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ఫలితంగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు మునుపెన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోతున్నాయి. అతికొద్దిమంది చేతుల్లో దేశ సంపదలో అత్యధిక భాగం కేంద్రీకృతమై పోతుండగా, దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. మరోవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే మార్కెట్ విధానాల వల్ల పంటలకు తగిన గిట్టుబాటు ధర లభించక రైతాంగం, దళారుల మాయాజాలంతో ఇటు వినియోగదారులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు.
మరోవైపు స్వదేశీ గుత్త పెట్టుబడిదారులను సృష్టించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేలాదిగా మూతపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో వేలాదిమంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంకోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. అధికారం లోకి రావడం కోసం అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయే గానీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే విధానాలు చేపట్టాలని, ఉపాధి కల్పన చర్యలు, ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టాలని అరసం డిమాండు చేసింది.
.
Discussion about this post