పన్నెండేళ్లను పుష్కరం అంటారు. మన దేశంలో నదులను ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పండుగ వస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే పన్నెండేళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కర స్నానాలు ఆచరిస్తే మనకు పుణ్యం వస్తుందని అనాది నుండి మన నమ్మకం. అంతేకాదు పుష్కర సమయంలో పుష్కర నదీతీరంలో మన పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భారతీయుల నమ్మకం. అందుకే పుష్కరాలు జరిగే నదీ తీరాల్లో పిండ ప్రదానాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అయితే అసలు ఈ పుష్కరాలు అంటే ఏమిటి…? వాటికి అంతటి ప్రాధాన్యత ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే…
జీవకోటి ఆవిర్భావం తర్వాత ఈ పంచభూతాల్లో భూమి, ఆకాశము, వాయువు, తర్వాత ప్రధానమైనది నీరు. సకల కోటికి నీరే ప్రాణాధారము. నీరు లేకుండా ప్రాణులు జీవించడం అసంభవం. అందుకే మనిషి పుట్టిన తర్వాత నీటి ఆవాసాలకు దగ్గరగా నివసిస్తూ వచ్చాడు. నీటినే ఆలంబనగా చేసుకుని ఎదుగుతూ వచ్చాడు. ఆ నీటినుండే ఇతర ప్రాంతాలకు పయనించడం నేర్చుకున్నాడు. ఇలా మనిషి అభివృద్ధికి నీరే ఆదరువుగా ఉంటూ వస్తోంది. దీంతో మనిషి నీటిని భక్తితో పూజించడం ప్రారంభించాడు. ఇలా అది పలు రూపాలు మారి పుష్కరాల రూపాన్ని సంతరించుకుంది.
తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి సకల ఔషధులు, వాటినుండి అన్నం, అన్నం నుండి జీవి పుట్టినదని చెబుతుంది. వీటన్నింటిలోకి నీరు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
మనదేశంలో 12 ప్రధానమైన నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మేషరాశి మొదలుగాగల పన్నెండు రాశులలో ప్రవేశించినపుడు పన్నెండు నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఒక ఏడాది పాటు ఒకే రాశిలో ఉంటాడు. అయితే అన్ని రోజులు కాకుండా బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులను ఆదిపుష్కరాలు అని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అని చెబుతారు. ఈ పుష్కరాల సమయంలో ఆయా నదులలో పుణ్యస్నానాలు చేసి, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు.