జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది ఎనిమిదవది.
జెన్ అనేది ఒక జీవన విధానం. వ్యక్తిత్వం, జీవనగమనానికి సంబంధించిన అనేక మంచి విషయాలు ఇందులో కథలుగా ఉంటాయి. జర్నలిస్టు యామిజాల జగదీశ్ వీటిని కథారూపంలో అందించగా.. రూపుదిద్దుకున్న పుస్తకం ‘జెన్ కథలు’.
‘‘జెన్ అంటే ధ్యానం. ప్రతి పనీ ధ్యానమే. జెన్ సహజం. ప్రకృతి సిద్ధం. జెన్‌కు నియమాలు లేవు. నిబంధనలు లేవు. జెన్ కు ఇష్టాఇష్టాలు ఉండవు. జెన్‌కు మంచీ చెడుల తేడాలు తెలీవు. జెన్ మతం కాదు. తత్వం కాదు. జెన్ ఒక జీవన విధానం.’’
జెన్ కథల పుస్తకం వెనక అట్టమీద జెన్ గురించిన పరిచయ వాక్యాలు ఇలా సాగుతాయి.
భారతదేశంలో ఆవిర్భవించిన బౌద్ధం చైనా వెళ్లి పేరు మార్చుకుని అభివృద్ధి చెంది జపాన్ లో జెన్‌గా రూపుదిద్దుకుందని అంటారు. మరోరకంగా భారతీయ బౌద్ధం, చైనాలోని తావోయిజం కలిసి జెన్ అవతరించిందని చెప్తారు.
2005 జనవరిలో 108 పేజీల జెన్ కథల పుస్తకాన్ని వెలువరించాను. జర్నలిస్టు మిత్రుడు, యామిజాల జగదీశ్ బుర్రలో మెరిసిన ఆలోచన ఇది. ఆయనే పూనుకుని జెన్ కథలు రాసి పట్టుకొచ్చారు ప్రచురించమని. కథలన్నీ చదివాను.
కథలు ఆసక్తిగా చదివిస్తున్నాయి. కొత్త ఆలోచనలు, సరికొత్త జీవన పథానికి బాట వేస్తున్నట్టు అనిపించాయి. తెలుగులో అప్పటివరకు ఇతరత్రా కథలు పుస్తకంగా వచ్చినా జెన్ కథలు మాత్రం రాలేదు. జగదీశ్ స్ర్కిప్టును ఒకటికి రెండుసార్లు తరచి చూడగా ఏదో చిన్నలోపం కనిపించింది. ఆలోపం కథన రీతికి సంబంధించినది. ఆ ఒక్కటీ సరిచేయగలిగితే మంచి పుస్తకాన్ని పాఠకులకు అందించిన వారమవుతామనిపించింది.
ఆ కథలన్నీ తిరగరాయించాలని అనుకున్నాను. జగదీశ్ ను సంప్రదించాను. మీ ఇష్టం. మీకు ఎలా బావుంటుందనిపిస్తే అలా చేయండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేనే రీరైట్ చేద్దామా అనుకున్నాను. పని ఒత్తిళ్లలో సాధ్యపడలేదు.
ఆత్మీయులు దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డిని సాయం పట్టమని అడిగాను. ఆయన ఆ బాధ్యత తీసుకుని కథలను చిత్రికపట్టి ఇచ్చారు.
కవర్ డిజైన్ కోసం మోహన్ దగ్గరకు వెళ్లాను. మోహన్ వెంటనే పుస్తకంతో కనెక్ట్ అయ్యారు. కవర్ తోపాటు లోపల కూడా బొమ్మలు వేసిస్తాను అన్నారు తనంతట తానే.
‘‘బానేవుంది. నువ్వు వేసి ఇస్తావు. కానీ బొమ్మకు హీనపక్షం 50 రూపాయల చొప్పున లెక్కగట్టినా మీరు వేసే బొమ్మలకు ఐదువేల రూపాయలన్నా ఇవ్వాలిగదా! కానీ ఈ చిన్ని పుస్తకం మీద అంత వెచ్చించే బడ్జెట్ నాదగ్గర లేదు’’ అని ఉన్న విషయాన్ని, నా నిస్సహాయతను మోహన్ ముందు పరిచాను.
‘‘మిమ్మల్ని డబ్బులెవరడిగారు. నేను నా ముచ్చట కోసం బొమ్మలు వేయాలనుకుంటున్నాను. చైనీస్ ఆర్ట్ బాణిలో చాలా కాలంగా బొమ్మ వెయ్యాలని ఉంది. కానీ ఇప్పటిదాకా కుదరలేదు. మీ పుస్తకంతో అది నెరవేరబోతోంది’’ అన్నాడు మోహన్.
అనటమే కాదు. చకాచకా బొమ్మలు వేసి ఇచ్చారు. కవర్ డిజైన్‌నూ చేసిచ్చారు. మోహన్ ఎంతో ఇష్టంగా వేసిచ్చిన ఆ బొమ్మలు ఏ ఒక్కటీ వదలకుండా కథలతోపాటు ప్రచురించారు.
ప్రతి పేజీలో మోహన్ బొమ్మలతో నాచురల్ పేజ్ పేపర్ పై ప్రచురించిన ఆ పుస్తకం కొన్ని సర్కిల్స్ నుంచి చక్కటి ఆదరణ పొందింది. మోహన్ ఈ పుస్తకానికి గీసిచ్చిన బొమ్మల్లో కొన్నింటిని కళాజ్యోతి ప్రింటర్స్ వారి రంగుల క్యాలెండర్‌లోనూ ఉపయోగించారు. మోహన్ బొమ్మలకు వెలకట్టలేనుగానీ, నా శక్తిమేరకు ఇచ్చాను. జెన్ కథలు పుస్తకానికి వేసిన ఈ బొమ్మల్లో కొన్నింటిని నేను 2020లో ప్రచురించిన రామోజీరావు – ఉన్నది ఉన్నట్టు పుస్తకంలో కూడా ముద్రించాను. మోహన్ బొమ్మలకున్న సార్వకాలీనతకు ఇదో రుజువు.
ఒక్కో కథ రెండు పేజీలకు మించదు. కొన్ని కథలు అర పేజీలోనే అందంగా ఇమిడి పోతాయి. కథలు ఆసక్తిగా చదివిస్తాయి. ఆలోచనలు రేకెత్తిస్తాయి. ‘ఓస్ ఇంతేనా’ అని పైకి కొన్ని కథలు కనిపించినా ఆలోచించిన కొద్దీ లోతులు తెలిసివస్తాయి.
జాతికి గొప్ప జీవిత మార్గాన్ని, ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని సమకూర్చే ఇలాంటి పుస్తకాలు లక్షల సంఖ్యలో ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగులో అది అడియాసే. గొప్ప జ్ఞాపకాలను, ఆలోచనలను మిగిల్చిన పుస్తకం జెన్ కథలు.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం గురువు
Discussion about this post