జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది పదవది.
నేను కూర్చిన తెలుగు సామెతల పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. యూజర్ ఫ్రెండ్లీగా సంకలన పరిచిన పుస్తకమిది.
ఒకసారి జర్నలిజం కోర్సు ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రంలో వ్యవసాయ ప్రధానమైన అయిదు సామెతలు రాయండనే ప్రశ్నను అడిగాను. ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాలను ఎవరూ రాయలేకపోయారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సైతం అయిదు వ్యవసాయ సామెతలు రాయలేకపోవటం కొంత విచారం కలిగించింది.
ఎందుకు రాయలేకపోయారు? అనే ప్రశ్న వేసుకుంటే నాకు తట్టిన సమాధానం నుంచే ఈ పుస్తకం మొగ్గ తొడిగింది. ఇప్పటివరకూ అకారాది క్రమంలోనే సామెతలను పొందుపరుస్తూ వస్తున్నారు. ప్రజల అవసరాలకు ఈ క్రమం సరితూగటం లేదనిపించింది. అకారాది క్రమంలో వ్యవసాయ సంబంధ సామెతలు చూడాలంటే మొత్తం పుస్తకమంతా గాలించాల్సి వస్తుంది. రైతుతో మొదలయ్యే సామెతలు ‘ర’ కింద, అన్నదాతతో మొదలయ్యే సామెతలు ‘అ’ కింద మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఈ పద్ధతిని మార్చి మరింత ప్రయోజనదాయకంగా తెలుగు సామెతలను క్రోడీకరించాను.
మొత్తం 15 ప్రధాన అధ్యాయాల కింద 292 శీర్షికల్లో నాలుగు వేలకు పైగా సామెతలను కూర్చాను. నింగీనేల, నీరూనిప్పు, చెట్టూచేమ, పిల్లీపులి, కన్నూకాలు, ఊరూవాడ, బంధాలూ బంధుత్వాలు, గుడీబడీ, పాడిపంట, కాలంకార్తె, తిండీ తిప్పలు, సొమ్మూ సోకూ, రాజూపేద, రోగం రాగం, మనిషి మనసు అనే ప్రధాన అధ్యాయాలుగా విభజించుకుని ఆ శ్రేణిలోకి వచ్చే సామెతలను వివిధ శీర్షికల కింద పొందుపరిచాను.
ఉదాహరణకు పాడీపంట అధ్యాయంలో ఆవు, ఎద్దు, బండి, గేదె, గొడ్డు, బర్రె, పాడి, పాలు, పెరుగు, రైతు, ఎరువు వంటి 32 శీర్షికల్లో సామెతలు అందించాను.
భాష ఏదైనా ఆ భాషను జీవద్భాషగా చేసేవే సామెతలు, నుడికారాలు, సూక్తులు, సుభాషితాలు, నీతివాక్యాలు. వీటి మధ్య తేడాలు ఉన్నాయి. వివిధ వృత్తులు, సామాజిక నేపథ్యాల వారి అనుభవాల్లోంచి అలవోకగా రూపం తొడిగినవే సామెతలు.
భాషలు వేరయినా సామెతల్లో సారూప్యతలు అనేకం కనిపిస్తాయి. కొన్ని సామెతలు సంస్కృతం నుంచి తెలుగులోకి రూపాంతరం చెందాయి. మనం పిండి కొద్దీ రొట్టె అంటే ఇంగ్లీషు వాడు Cut the coat according to cloth అన్నాడు.
తెలుగులో చాలామంది సామెతలను సంకలనం చేశారు. తెలుగు అకాడమీ వారు కూడా సామెతలను ప్రసిద్ధులతో పరిష్కరింపజేసి ప్రచురించారు. ఇన్ని పుస్తకాలు ఉన్నా.. ఉపయుక్తంగా ఉండేలా సంకలన పరిస్తే తెలుగు వారికి ఎంతో కొంత సేవ చేసినట్లవుతుందని ఈ ప్రయత్నంలో ముందుకే సాగాను.
విజేత కాంపిటీషన్స్ అధినేత బండ్ల సాయిబాబు దగ్గర సామెతల పుస్తకాన్ని కూర్చుతున్న విషయాన్ని మాటల సందర్భంలో అన్నాను. తమ సంస్థ తరఫున ఈ పుస్తకాన్ని ప్రచురించటానికి ఆయన ముందుకువచ్చారు. 2014లో వెలువడిన 192 పేజీల ఈ పుస్తకం వెల రూ.59.
కవర్ డిజైన్ విషయంలో చొరవ తీసుకున్నాను. ముత్యపుచిప్ప, అందులో ముత్యం ఉన్న ఫోటోను ఎంపిక చేశాను. ముత్యపు చిప్పలో పడిన నీటి బిందువు ముత్యంగా రూపుదిద్దుకున్నట్లే, ప్రజల అనుభవాలనుంచి సామెతలు రూపుతొడిగి, తరంతరం మనకు అందుతూ వస్తున్నాయి. ఈ విషయాన్నే సింబాలిక్‌గా చెప్పాను. వెనక అట్ట కూడా సుసంపన్నం చేసేందుకు బాపు గీసిన రైతు కుటుంబాన్ని పొందుపరిచాను.
తెలుగుసామెతలపై పట్టు ఉంటే సందర్భానికి తగ్గట్టు వాటిని ఉపయోగిస్తూ మన రచనను మరింతగా హత్తుకుపోయేట్లు తీర్చిదిద్దవచ్చు. అన్ని వర్గాల వారితో పాటు జర్నలిస్టులకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందనే నా ఆశ.
.. గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం గురువు
Discussion about this post