2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రం గెలుచుకున్న జనసేన- ప్రస్తుత పరిస్థితి… రాజకీయ ప్రత్యర్థులకు- అధికార పార్టీకి భయం పుట్టిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ఎలా కలిసి వచ్చాయో ఇదమిత్థంగా తేల్చిచెప్పడం కష్టమే గానీ.. పవన్ కల్యాణ్ కు మాత్రం బాగా లాభించాయి. ఆయనకు, ఆయన పార్టీకి కొత్త జవసత్వాల్ని అందించాయి. భవిష్యత్తు మీద నమ్మకాన్ని ఇచ్చాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ.. వారు చేయగలిగిన సమస్త అధికార దుర్వినియోగం తరువాత.. 80 శాతం సీట్లు గెలుచుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదే సమయలో.. జనసేన పార్టీకి 27 శాతం ఓట్లు పంచాయతీ ఎన్నికల్లో లభించాయి. సార్వత్రిక ఎన్నికల్లో వారికి దక్కిన 7 శాతం ఓట్లతో పోలిస్తే.. ఈ ప్రజాబలం చాలా ఎక్కువ.
ఇదే సమయంలో మునిసిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరగబోతున్నాయి. సాధారణంగా పవన్ కల్యాణ్ కు సినిమా ప్యాన్స్ లోనూ, చదువరుల్లోనూ ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కేటగిరీల ఓటర్లు కూడా మునిసిపల్ పట్టణాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. తాను ఏ స్వచ్ఛమైన, నిష్కళంకమైన నిజాయితీగల రాజకీయాల్ని ప్రజలకు రుచిచూపిస్తానని అంటున్నాడో.. అలాంటి వ్యవహార సరళితో విద్యావంతులైన ఓటర్లలో గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. అలాంటి ఓటు బ్యాంకు నగరాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే.. మునిసిపాలిటీల్లో జనసేన బలం కూడా ఎక్కువగా ఉంటుందనేది పలువురి విశ్లేషణ.
Read Also
పవర్ స్టార్ ఫుల్ హేపీ.. ఎందుకంటే?
ఆ రకంగా చూసినప్పుడు.. పంచాయతీ ఎన్నికల్లోనే 27 శాతం ఓటుబ్యాంకు పవన్ సొంతం చేసుకోగలిగారు. మరి.. మునిసిపాలిటీల్లో.. ఓ ఓటు బ్యాంకును 40 శాతం వరకు తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతకాకపోయినా.. పంచాయతీలకంటె మెరుగైన ఓట్లను దక్కించుకున్నా.. వారికి దక్కే స్థానాలు బాగా పెరుగుతాయి.
ఈ భయమే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ను వెన్నాడుతోంది.
నిజానికి పవన్‌కు పెరుగుతున్న ప్రజల మద్దతు టీడీపీలో కూడా భయం పుట్టిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ కల్యాణ్ చీల్చుకుంటే గనుక.. తిరిగి వైసీపీ కి ఎడ్వాంటేజీ అవుతుందేమో.. పవన్ బలం పెరగడం వల్ల తాము బలహీన పడతామేమో అని టీడీపీ సంకోచిస్తోంది.
అయితే వైసీపీలోనే భయం ఎక్కువ అనడానికి కారణాలున్నాయి. పవన్ ఎఫెక్టు ఓటు బ్యాంకు మీద బాగా కనిపిస్తే గనుక.. ప్రభుత్వ వ్యతిరేకత బాగా తెలిసొస్తుంది. వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి ఎడ్వాంటేజీ కావొచ్చు. వారికి ఎక్కువ సీట్లు దక్కవచ్చు. కానీ.. ఓటు శాతం తగ్గితే.. వారికి అది మరణశాసనమే. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కలిసి యాభై శాతానికి మించి ఓట్లను కొల్లగొడితే గనుక.. వైసీపీ పాలనను ప్రజలు ఇష్టపడడం లేదని అర్థమవుతుంది. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 50 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో అంతకంటె ఏ కొంత శాతం ఓట్లు తగ్గినా సరే.. ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రజల్లోకి స్పష్టమైన సంకేతాలు వెళ్తాయి. అందుకే వైసీపీలో ఎక్కువ గాభరా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Discussion about this post