మనదేశంలో పుట్టి మరెన్నో దేశాల్లోని ప్రజల చేత అనుసరించబడుతున్న గొప్ప మతం బౌద్ధమతం. కానీ పుట్టిల్లు అయిన మన దేశంలో మాత్రం దాని ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు గొప్ప గొప్ప బౌద్ధ ఆరామాలు, స్థూపాలు విలసిల్లిన మనదేశంలో ఇప్పుడు వాటి ఆనవాళ్లు అక్కడక్కడా మినుక్కుమినుక్కు మంటున్నాయి. అలాంటి వాటిలో కృష్ణాజిల్లాలోని ఘంటసాల బౌద్ధ స్థూపం.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన ఘంటసాల గ్రామం ఒకప్పుడు గొప్ప బౌద్ధ సంసృతి విలసిల్లి ప్రదేశం. అక్కడ ఒకప్పుడు రోమన్ దేశంతో వర్తకం విలసిల్లిన ప్రాంతం. అంతేకాదు… క్రీస్తుపూర్వం 2-3 శతాబ్ధంలో ఇక్కడ బౌద్ధస్థూపాలు నిర్మించబడినట్టు పురావస్థు పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆకాలం నాటి పాలరాతి శిల్పాలు, ఒక రాతిఇటుకమీద 12 నక్షత్ర మండలాలను చెక్కిన శిల్పలు మొదలగు స్థూపాలు ఉండేవి. ఇప్పుడు అవి ఫ్రాన్సు మ్యూజియంలో భద్రపరచబడి వున్నాయి. అంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ బౌద్ధ స్థూపం ఇప్పుడు ఆదరణ కరవై శిథిలావస్థకు చేరువవుతోంది.
ఈ స్థూపం వద్ద 2014న మహాచైత్ర పౌర్ణమి సందర్భంగా బౌద్ద భిక్షువు దమ్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో బుద్ధునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాంటి ఈ చైత్యం ఇప్పుడు ఒక నీటి వనరును తలపింపజేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్థూపం లోపల నీరు నిండి అది మరింతగా శిథిలమయ్యేట్టు కనికిస్తోంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుద్ధునికి ప్రత్యేక పూజలు చేయడానికి అక్కడికి వచ్చిన దమ్మతేజ థేరో బంతీజీ అక్కడి పరిస్థితి చూసి చేసేది లేక నిస్సహాయంగా స్థూపానికి దూరంగా బుద్ధునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము స్థూపం నీటిలో నానుతోందన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. ఇకనైనా అధికారులు మోటార్లను మరమ్మత్తు చేయించి అక్కడ నిల్వవున్న నీటిని తోడి బయటికి పంపేలా చేయాలని, స్థూపాన్ని సంరక్షించాలని ఆయన అన్నారు.
స్థూపం అనేది బౌద్ధ మతానికి చెందిన గురువులకు సంబంధించిన థాతువులమీద నిర్మించబడుతుంది. అది బౌద్ధ మతానికి చాలా పవిత్రమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇలా బుద్ధుడి అవశేషాలు, ఆయన వాడిని ఇతర వస్తువులను భూగర్భంలో ఉంచి వాటిపై చైత్యాన్ని నిర్మించేవారు. ఇలాంటి వాటిని స్థూపాలు అని కూడా అంటారు. ఇలాంటి స్థూపాలలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అమరావతి స్థూపం చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ స్థూపానికి అన్ని రకాలుగా ప్రచారం రావడంతో పురావస్థు పరిశోధక శాఖ ఈ స్థూపాన్ని స్వాధీనంలోకి తీసుకుని దాని బాగోగులు చూసుకుంటోంది(?)
అయితే ఇక్కడ ఒకవిషయం గమనించాల్సి వుంది. పురావస్థు శాఖ ఇలాంటి ప్రాచీన కట్టడాలను పరిరక్షించడం అనే నేపధ్యంలో పలు ప్రాచీన కట్టడాలను స్వధీనం చేసుకుంది, వాటిని సందర్శించాలంటే సందర్శకులకు ప్రత్యేక టిక్కెట్టు కొని మరీ సందర్శించే ఏర్పాటు చేసింది. మరి కొన్నింటి అయితే అవి మరీ పురాతనమైనవి అనే ఉద్దేశంతో వాటి ఛాయలకు కూడా సందర్శకులను అనుమతించకుండా వాటిని అలా వదిలేసింది. అవి పురావస్థు శాఖ అధీనంలోనే వున్నా కూడా అవి కూలిపోయే దశకు చేరినా కూడా వాటి గురించి శాఖ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
పురాతనమైనవి అనే సాకుతో కనీసం ప్రాచీన కట్టడాలలో సాలీడు గూళ్లను కూడా తీయకుండా అలా వదిలేస్తోంది. దాంతో కొన్ని కట్టడాలు పావురాలకు, గబ్బిలాలకు ఆలవాలమై మరింతగా పాడైపోతున్నాయి. పురావస్తుశాఖ ఇలాంగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా పురావస్థు సంపద కొంత కాలంలోనే మనకు కనుమరుగైపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇకనైనా అధికారులు, పురావస్థు శాఖ వారు కళ్లు తెరచి ఇలాంటి ప్రాచీన సంపద పరిరక్షణ విషయంలో తగు నిర్ణయాలు తీసుకుని, మన సంపదను మన తరవాతి తరాలవారికి అందించడానికి కృషి చేస్తే బాగుంటుంది!