‘ఆదర్శిని చిత్రాలు’ నిర్మాణ సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా దేవీప్రసాద్ ఒబ్బు దర్శకత్వంలో ‘ఎటు..?’ అనే లఘుచిత్రం రూపొందింది. జులై 3న ఈ చిత్రం AdarsiniChitralu యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్ గా ఆదర్శిని భారతీకృష్ణ వ్యవహరించగా, ఎడిటింగ్ బాధ్యతలు కె. ఏ. ముని సురేష్ పిళ్లే చేశారు.
మనిషి అత్యాశకు పోతే ఎలాంటి దుష్పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో సందేశాత్మకంగా తెలియజెప్పే చిత్రంగా అనే అంశాన్ని చూపిస్తున్నారు.
మనిషిని ఆశే ముందుకు నడిపిస్తుంది. మనిషి దారితప్పేలా చేసేది కూడా అదే. సకలజీవ రాశులలో మనిషిని వేరుచేసి నిలబెట్టేది కూడా ఆ ఆశే! జీవితాన్ని ముందుకు నడిపిపంచే ఆశ దారి తప్పి.. పెడపోకడలు పోతే ఏమవుతుంది? మనిషిలో దురాశ కారణంగా.. దుర్మార్గాలు, అవినీతి, మోసాలు, వంచనలు మితిమీరి పెచ్చరిల్లితే వాటి పర్యవసానాలు ఏమవుతాయి? దారి తప్పిన వారిని కట్టడి చేసే మార్గమే ఉండదా?
సమాజంలో సదాలోచన కలిగించడమే లక్ష్యంగా.. విభిన్నమైన కథాంశంతో దేవీప్రసాద్ ఒబ్బు రూపొందించిన సినిమా ‘ఎటు..?’ ఈసినిమా ద్వారాచెప్పదలచుకున్న సందేశం ఇవాళ్టి సమాజంలో మొత్తం మనుషులందరికీ అవసరమైనదని దేవీప్రసాద్ అంటున్నారు. ఈ చిత్రంలో దారితప్పిన వ్యక్తులకు ఎలాంటి శిక్ష ఉంటుంది? శిక్ష వేసేది ఎవరు? అనేదే కీలకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దేవీప్రసాద్ అంటున్నారు.
జూన్ 28న రిలీజ్ అయిన ‘ఎటు..?’ లఘు చిత్రం ట్రైలర్, విడుదలైన కేవలం రెండురోజుల్లోనే వెయ్యి వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాదెండ్ల మురళి ప్రధానపాత్ర పోషించగా, పోలూరు జగన్నాధం, దేవీప్రసాద్ ఒబ్బు, పామల ప్రభు దాసు, గాండ్ల సురేష్ బాబు, కొంపల మురళీధర్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూలై 3న మీ ముందుకు వస్తోంది.
.