బుద్ధి ప్రసాదమాయుశ్చ సంగీతాత్ సంప్రజాయతే

బాబాయ్ ని చూసి చాలారోజులయింది. చూడాలనిపించిందాయన్ని. బయల్దేరాను. సన్నగా చినుకుపడుతున్నది. ఎన్నడో చదవమని బాబాయ్ ఇచ్చిన ‘పేదరాశి పెద్దమ్మకథల’ పుస్తకాన్ని, తలతడవకుండా అడ్డంపెట్టుకుని, పరుగుదీశాను. బాబాయ్ ఇంటికి ఇట్టే చేరుకున్నాను.
‘‘బాబాయ్’’ అని పిలిచాను. ఆయనరూంకేసి నడిచాను. బెడ్ మీద బోర్లాపడుకుని బాబాయ్ పుస్తకం ఏదో చదువుతున్నాడు. పరిశీలనగా చూశాను దాన్ని.. కలెక్ట్ డ్ స్టోరీస్ ఆఫ్ మార్క్వెజ్.
పుస్తకంలో లీనమై ఉన్నాడు బాబాయ్.
‘‘బాబాయ్’’ అన్నాను మళ్లీ. గట్టిగా పిలిచాను.
‘‘ఏంట్రా’’ అన్నాడు బాబాయ్. చూపుమరల్చాడు. నన్ను చూశాడు. ఆసరికి చినుకుపుంజుకున్నది. వానయింది.
‘‘ఈ వానలో ఎవడయినా వేడివేడి మిర్చీబజ్జీలు తింటాడు. నువ్వేంటి బాబాయ్, ఏదో పుస్తకం పట్టుకుని…’’ అన్నాను.
‘‘అదేదో సినిమాలో చెప్పినట్టు వర్షంలో మిర్చీబజ్జీలు ఏ వెధవైనా తింటాడు. వర్షంలో పుస్తకం చదివేవాడే గొప్పవాడు. నీకు తెలియదనుకుంటానుగాని, వర్షంలో పుస్తకం చదువుతూ ఉంటే ఉంటుందిరా…ఆ వేడీ, ఆ మజానే వేరు.’’ అన్నాడు బాబాయ్. తానే పేజీ దగ్గర ఉన్నాడో ఓసారి చూసుకుని, చేతిలోని పుస్తకాన్ని మూశాడు బాబాయ్. పక్కనపెట్టాడు.
‘‘ఏంటిలా వచ్చావు?’’ అడిగాడు.
‘‘నిన్ను చూడాలనిపించింది, వచ్చాను.’’
‘‘ఇంకోమాట చెప్పు.’’
‘‘అయితే…బిబ్లియోథెరపీ అంటే ఏమిటి బాబాయ్? ఈ మధ్య ఈ మాట బాగా వినిపిస్తోంది.’’
‘‘అలా అడిగావు, బాగుంది.’’ అని నవ్వాడు బాబాయ్.
‘‘అలా కూర్చో’’ అన్నాడు. కూర్చున్నాను.
వర్షం ‘పింక్ నాయిస్’ వినసొంపుగా ఉంది. కళ్లు మూసుకుని వినసాగాను. చెప్పడానికి అయి ఉంటుంది, గొంతు సవరించుకున్నాడు బాబాయ్. కళ్లు తెరచిచూశాను.
‘‘బిబ్లియోథెరపీ అన్నది గ్రీకుపదం. ‘బిబిలియన్’ అంటే పుస్తకం, ‘థెరపియా’ అంటే వైద్యం లేదా చికిత్స. ఈ రెంటినీ కలిపి ’బిబ్లియోథెరపీ’ గా పేర్కొన్నారు. ఈ మాటను 1916లో శామ్యూల్ క్రోథర్స్ మొదటిసారిగా ఉపయోగించాడు. చికిత్సకోసం పుస్తకాల్ని ఉపయోగించడం చాలా కాలం నుంచి వాడుకలో ఉంది. ప్రాచీనగ్రీకు గ్రంథాలయాల మీద ‘ఆత్మకు ఔషధశాల’ అని రాసి ఉండేది. పుస్తకపఠనం మనసుకు శాంతినీ, స్వస్థతనూ చేకూరుస్తుందన్నది ఏనాడో ఋజువయింది.
కథ, నవల, కవితలాంటి సాహిత్యప్రక్రియలను ఉపయోగించి, మనిషి మానసిక భావోద్వేగాలను మెరుగుపరచడాన్నే బిబ్లియోథెరపీ అంటున్నారు.’’ చెప్పాడు బాబాయ్.
‘‘పుస్తకాలే టాబ్లెట్లు, పుస్తకాలే కాప్స్యూల్స్, పుస్తకాలే సిరప్ లు, పుస్తకాలే ఇంజక్షన్లయితే. బాగుందిదో.’’ అన్నాను.
‘‘పుస్తకం గొప్పమంత్రదండంరా! దాని గొప్పతనం అంతుచిక్కదు.’’ అన్నాడు బాబాయ్.
‘‘క్లినికల్ బిబ్లియోథెరపీ, డెవలప్ మెంటల్ బిబ్లియోథెరపీ, సెల్స్ హెల్స్ బిబ్లియోథెరపీ అంటూ ఈ బిబ్లియోథెరపీలో చాలారకాలు ఉన్నాయి.’’ అన్నాడు.
‘‘అవన్నీ నాకనవసరంగాని, ముందు ఈ సంగతి చెప్పు? ఓ వ్యక్తి ఓ పుస్తకం చదివాడనుకుందాం. అతని మీద బిబ్లియోథెరపీ పనిచేస్తుందా?’’ అడిగాను.
‘‘ఎందుకుచెయ్యదు? నిక్షేపంగా పనిచేస్తుంది. తనసమస్యలను పోలిన పరిస్థితులతో ఉన్న పాత్రలను పుస్తకంలో చదివినప్పుడు పాఠకుడు ఆ పాత్రలను మనసుకు దగ్గరగా తీసుకుంటాడు. వాటితో మమేకం అవుతాడు. మమేకం అయి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు. ఒకొక్కప్పుడు సమస్యను అర్థంచేసుకుని, దానికి పరిష్కార మార్గాన్ని కూడా తెలుసుకుంటాడు.’’ చెప్పాడు బాబాయ్.
‘‘ఆందోళన, దుఃఖం, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు మనిషికి పుస్తకాన్ని మించిన మంచిమందులేదురా! చేతిలో పుస్తకం ఉంటే…డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉన్నట్టే.’’ అన్నాడు.
‘‘సరే! నేను ‘అమరావతికథలు’ చదువుతున్నాను. ఆ కథలతో బిబ్లియోథెరపీ జరిగి, నేను మునుపటికంటే బాగుండే అవకాశం ఉందా?’’ అడిగాను బాబాయ్ ని.
‘‘ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏమిటి?’’ అడిగాడు బాబాయ్.
‘‘కష్టంలేదు, ఉందనుకుందాం, ఉంటే…నా మీద బిబ్లియోథెరపీ వర్కవుట్ అవుతుందా?’’
‘‘ఎందుకు కాదు? ఆధునికజీవితంలోని వేగాన్నీ, ఒంటరితనాన్నీ, మూలాలనుండి దూరమైన బాధనీ అనుభవించే
నీకు అమరావతికథలు నదినీటిగలగలల్నీ, మానవసంబంధాలనీ, నీ చిన్నతనాన్నీ గుర్తుచేస్తాయి. అమ్మతలనిమిరినట్టుగా నీ తలనిమిరి, నిన్ను చల్లనిగాలిలో, వెన్నెలరేయిలో ఊరేగిస్తాయి. దీనినే ‘నాస్టాల్జిక్ బిబ్లియోథెరపీ’ అంటారు.’’ అన్నాడు బాబాయ్.
‘‘అమరావతి ప్రజల అనుబంధాలూ, ఆత్మీయతలూ, కష్టసుఖాలూ చదువుతూ నిన్ను నువ్వు వారిలో వెదుక్కుంటావు. సపోజ్! ఫర్ సపోజ్! ఏదేనిబాధలో నువ్వు ఉన్నావనుకో! అదే బాధ కథలో పాత్రకూడా అనుభవిస్తున్నదనుకో! అప్పుడు నీకేమనిపిస్తుంది? ‘ఈ బాధ నాకొక్కడికే కాదు, ముందు చాలామంది అనుభవించారు,’ అనిపిస్తుంది. మనసు తేలికపడుతుంది. ఒంటరితనం ఫీలవ్వవు. దీనినే బిబ్లియోథెరపీలో ‘యూనివర్సలైజేషన్’ అంటారు. అసలా కథల శైలే గొప్పదిరా! ఆ శైలిలో భావోద్వేగాలను అదుపులో ఉంచే ఓ మహత్తు ఉంది. దానినే ‘కథార్సిస్ వితౌట్ ట్రామా’ అంటారు.’’ చెప్పాడు బాబాయ్.
‘‘అమరావతికథల్లోని మానవత్వం, పరోపకారం, దయా, దాక్షిణ్యం, కరుణా, జాలీ…ఇంకా అనేకవిలువలు ఇప్పటిసమాజంలో నిన్ను వెదుక్కొనేలా చేస్తాయి. వాటిని పునరుద్ధరించమని నిన్ను ప్రేరేపిస్తాయి. దీనినే ‘వేల్యూ రీ-అఫర్మేషన్’ అంటారు. దీనికి మరోపేరే ‘డవలప్ మెంట్ బిబ్లియోథెరపీ’’ అని ఊపిరి తీసుకున్నాడు బాబాయ్.
‘‘మనం ఎంత ఎక్కువగా పుస్తకాలు చదివితే అంత ఎక్కువగా మనుషుల్నీ, వారి అంతరంగాల్నీ తెలుసుకోగలుగుతాం. మనుషుల్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నా హాయిగా బతికేస్తావు, నీకెలాంటి ఇబ్బందులూ ఉండవు.’’ చెప్పాడు బాబాయ్.
‘‘పుస్తకాన్ని మించిన నమ్మకమైన స్నేహితుడూ, నమ్మకమైన ప్రేయసీ మరొకరు ఉండరు.’’ అని నవ్వాడు.
‘‘వేడివేడిగా టీ పెట్టనా?’’ అడిగాడు.
‘‘ఏలక్కాయ, దాల్చినచెక్క, లవంగంవేసిన వేడివేడి టీ ఈ వర్షంలో తాగితే ఉంటుందిరా…తాగి నువ్వే చెబుతావు చూడు.’’ అని టీ చేయడంలోపడ్డాడు బాబాయ్.
‘‘రాచకొండవిశ్వనాథశాస్త్రిగారి ‘అల్పజీవి’ నవల చదివాను. బిబ్లియోథెరపీపరంగా దానివల్ల నేనేం నేర్చుకుంటాను?’’ అడిగాను.
‘‘నిరంతరం భయంతోనూ, ఆత్మన్యూనతతోనూ గడిపే అల్పజీవి సుబ్బయ్యను చదివితే…ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మన్యూనతపై అవగాహన ఏర్పడుతుంది. మధ్యతరగతిప్రజలమీద కరుణకలుగుతుంది. సానుభూతి పెరుగుతుంది. సుబ్బయ్యేకాదు, చుట్టుపక్కలందరూ అల్పజీవులే అన్న ఎరుకకలిగి, ఎలా బతకాలో ఓ పాఠకుడుగా నువ్వు తెలుసుకుంటావు.’’ అన్నాడు బాబాయ్. వేడివేడి టీ అందజేశాడు.
బాగుంది టీ. గొప్పపుస్తకం ఏదో చేతికి దొరికినట్టనిపించింది.
‘‘నేనిందాక చెప్పినట్టుగానే పుస్తకాన్ని మించిన ఫ్రెండ్ లేడురా! పక్కనపెట్టినా, నీ కోసం పరితపిస్తాయవి. ప్రేమిస్తే ఇక చెప్పలేం, చిలకలు వాలినట్టుగా నీ మీద వాలిపోతాయి. నిన్ను చిలకలు వాలినచెట్టుని చేస్తాయి. ఇక చూస్కో! ఒకటే కలకలం.’’ అన్నాడు బాబాయ్.
‘‘అక్కడెక్కడో నిధులు ఉన్నాయి, పద, తెచ్చుకుందాం అంటే నేను పరిగెత్తను. చేతులెత్తి దండంపెట్టినా రాను. అదే అక్కడెక్కడో పుస్తకాలు ఉన్నాయనిచెప్పు, పరిగెడతాను. పుస్తకాల్లో లేని నిధులు ఏఁవున్నాయిరా?’’ ప్రశ్నించాడు బాబాయ్.
‘‘పుస్తకాలు మీద ఇంట్రస్ట్ లేదండీ అనేవాళ్లు చాలామంది కనిపిస్తారు. వారిని చూసి జాలిపడాలి. ఎందుకంటే…వారికి ఇంతవరకూ సరైన పుస్తకం దొరికి ఉండదు. దొరికి ఉంటే దాని మహాత్మ్యం చూపించేది.’’ అన్నాడు బాబాయ్.
‘‘మనల్ని ఏకాంతతీరాలకు చేర్చే పుస్తకాన్ని మించిన ప్రయాణసాధనం ఇంకొకటిలేదురా! పుస్తకం పుస్తకమే! తర్వాత ఇంకో మాట! చేతిలో పుస్తకంలేనివాడిని చచ్చినా నమ్మకూడదు.’’ అన్నాడు బాబాయ్.
నా అదృష్టం బాగుంది, చేతిలో పేదరాశిపెద్దమ్మకథల పుస్తకం ఉంది. బతికిపోయాననుకున్నాను.
‘‘చినుకూ చినుకూ కలిస్తే వాన ఎలా అవుతుందో అలాగే పదమూ పదమూ కలిస్తే గొప్పశక్తి పుడుతుంది. ఆ శక్తిని ఆవాహనచేసుకున్నవాడే అదృష్టవంతుడు.’’ అన్నాడు బాబాయ్. కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ నిల్చున్నాడు.
గాలి వీచింది. కిటికీలోంచి ఒలిపిరికొట్టింది. మంచమ్మీది మార్క్వెజ్ కథల మీద వానజల్లు కురిసింది.
-జగన్నాథశర్మ
.