తిరుపతి ఎంపీ సీటుకు జరగబోయే ఉపఎన్నిక విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గారా.. మొదట ఈ సీటు జనసేనకు ఇచ్చి తీరాల్సిందే అని ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించిన పవన్ కళ్యాణ్ ఇపుడు బీజేపీ పోటీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తిరుపతి బాగుకోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తే తిరుపతికి మేలు జరగదా..? అలా అని పవన్ అనుకుంటున్నారా..? అనే చర్చ వినిపిస్తోంది.
తిరుపతిలో జనసేన పోటీ చేసి తీరాల్సిందే అని గట్టిగా సంకల్పించిన పవన్ కళ్యాణ్ ఎందుకు పక్కకు తప్పుకున్నారో అర్ధం కావడం లేదు.
పవన్ ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది..
తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించాము. బి.జె.పి. జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలు జరిగిన చర్చల తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఎల్. సంతోష్ గార్లతో జరిపిన చర్చలలో తిరుపతి ఉప ఎన్నిక పై లోతైన చర్చ జరిగింది. ప్రముఖ పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని చేస్తామని గట్టిగా వారు చెప్పారు. తిరుపతి అభివృద్ధితో వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర ప్రగతికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి నగరం అభివృద్ధి ముఖ్యమని భావించాం. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్థానాన్ని బి.జె.పి.కి వదిలిపెడతామని ఆది నుంచి చెబుతూ వస్తున్నాం. బి.జె.పి. ప్రతిపాదించిన అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అంతే కాకుండా తిరుపతి లోక్ సభ స్థానాన్ని 1999లో బి.జె.పి. కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బి.జె.పి. తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం కూడా ఉంది. అంతేగాకుండా రాష్ట్రంలో ఆరాచక శక్తుల పీచమణచడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి. నాయకత్వం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర బి.జె.పి. అగ్ర నాయకులు పలుమార్లు జరిగిన ఉభయ పార్టీల సమావేశాలలో స్పష్టం చేశారు. వైయస్సార్సీపీ ఆగడాలకు ధీటైన సమాధానం చెబుతామని వారు చెబుతున్నారు.
జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా… జనసేన పార్టీ పక్షాన మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ, పార్టీతోపాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడడానికే అని జన సైనికులు గమనిస్తారని ఆశిస్తున్నాను. వై.ఎస్.ఆర్.సి.పి. అరాచకాలు నిన్నటి పంచాయితీ, నేటి మున్సిపల్ ఎన్నికలలో మనం చూస్తూనే వున్నాము. ఇటువంటి అరాచక శక్తులను ఎదుర్కోవడానికి బి.జె.పి.తో కలసి ముందుకు సాగుతున్నాము. తిరుపతిపై నిర్ణయాన్ని దూరదృష్టితో జనసేన శ్రేణులు ఆలోచిస్తాయని ఆశిస్తున్నాను. తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేద్దామని మీకు మనవి చేస్తున్నాను.
(పవన్ కల్యాణ్)
అద్యక్షులు, జనసేన
.

Discussion about this post