ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే ఒక కొత్త పోకడ త్వరలోనే అమల్లోకి రానుంది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వమే విక్రయించనుంది. ప్రేక్షకులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం అని ప్రభుత్వం అంటోంది.
ప్రజలకు మేలు కలిగే ఎలాంటి సలహాను సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చినప్పటికీ.. వాటిని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందనేది పెద్దలు చెబుతున్న మాట. చక్కెర పూత లాగా ఈ మాట బాగానే ఉన్నది గానీ.. ప్రత్యేక సందర్భాల్లో కోట్లకు కోట్ల రూపాయల దోపిడీకి తెరతీసే సినిమా వారి విషసంస్కృతికి ఈ విధానం చెక్ పెడుతుందా లేదా? ఆ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించుకోవచ్చునని.. సినిమా పరిశ్రమ వారికి లాకులు ఎత్తేస్తుందా? అనేదే స్పష్టత రావడం లేదు.
‘సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారు?’ అని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తాం.. అని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సినిమా పెద్దలతో సమావేశం తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్ని మాత్రమే థియేటర్లు అమలు చేయాలి.. అనేది కొత్త పద్ధతి కాదు. కానీ.. దానికి ఆన్ లైన్ విధానం పెట్టడం కొత్త విషయం.
అయితే అసలు దోపిడీ ఉండేది బెనిఫిట్ షోల సమయంలోనే. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు అని పేరు పెట్టి.. ఒక్కో టికెట్ కు వేల రూపాయల ధర నిర్ణయించి.. దోచుకోవడం అనేది సినిమా రంగానికి చాలా మామూలు పరిణామం అయిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా.. పెద్ద హీరోలు చేస్తున్న కొన్ని సినిమాలకు.. విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్ సృష్టించడం ఆ క్రేజ్ ను వాడుకుంటూ.. సిని మా అభిమానులు జేబులు మొదటి నాలుగైదురోజుల్లోనే కొల్లగొట్టేయడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. బెనిఫిట్ షో పేరు పెట్టి.. ఒక సినిమా టికెట్ ను అయిదు వేల రూపాయల వంతున అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వంతో టర్మ్స్ బాగుండి, పైరవీలు చేసుకోగలిగిన సినిమా పరిశ్రమ పెద్దల సంగతి చెప్పక్కర్లేదు. తమ సినిమాకు విడుదలైన కొన్ని రోజుల పాటు అధికధరలు పెట్టి అమ్ముకోడానికి వారు ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకుని.. ఎడాపెడా కోట్లు దండుకుంటారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ టికెట్ విక్రయాల వ్యవస్థను తెచ్చినంత మాత్రాన బెనిఫిట్ షోల దోపిడీ తగ్గుతుందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
మంత్రి పేర్నినాని మాత్రం.. బెనిఫిట్ షోల గురించి సమావేశంలో సినీ పెద్దలు ఎవ్వరూ అడగ లేదని అంటున్నారు. కానీ.. సమావేశం అనంతరం బయట మీడియాతో మాట్లాడిన నిర్మాత సి.కల్యాణ్ మాత్రం.. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకోసం అర్జీ పెడితే.. ప్రభుత్వం తప్పకుండా ఒప్పుకుంటుందని అంటున్నారు.
ఇదీ చదవండి :
Good Morning : తెలివైన, చెడ్డవాడితో స్నేహం చేయాలా? వద్దా?
ఫిరాయింపుకోసం గాల్లో ఎగురుతున్న టీడీపీ తుర్రుపిట్ట!
Pawan Trivikram వాహ్! సినీజీవులా? సాహితీమూర్తులా?
ఈ ‘బెనిఫిట్ షో’ ముసుగులో సాగే దోపిడీ గురించి అటు ప్రభుత్వం- ఇటు పరిశ్రమ చెబుతున్న మాటల్లోని వైరుధ్యం అనుమానాస్పదంగా ఉంది. బెనిఫిట్ షోల రూపంలో కోట్ల రూపాయల దోపిడీ కూడా ఉండకుండా కట్టడి చేస్తే తప్ప.. ఆన్‌లైన్ అనే పద్ధతి ద్వారా.. ప్రభుత్వం ప్రేక్షకులకు, సినిమా పరిశ్రమకు మేలు చేసినట్టు కాదు.
.

Discussion about this post