ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టుల నుంచి ఇప్పటిదాకా అనేక విషయాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రతి విషయంలోనూ వారు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ.. ఈసారి తగిలిన ఎదురుదెబ్బ మామూల్ది కాదు. రాష్ట్రంలో మాత్రమే కాదు.. దేశంలో కూడా ప్రభుత్వం పరువు పోయేటువంటి దెబ్బ!
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి నియామకంలో ప్రభుత్వం ఎంత అత్యుత్సాహంతో వ్యవహరించిందో అందరూ చూశారు. సభ్యుల సంఖ్యను గతంలోనే 24 కు పెంచిన జగన్ ప్రభుత్వం, ఈ దఫా బోర్డుతో పాటూ.. ఏకంగా యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. వీరికి బోర్డు నిర్ణయాల్లో ఓటింగ్ అధికారం ఉండదు గానీ.. సభ్యుల హోదాలోనే ప్రోటోకాల్ ప్రకారం దర్శనాలకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. అందరూ విస్తుపోయేలా చేసిన ఈ నియామకాల గొడవ కోర్టు గడప తొక్కింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలకు సంబంధించిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది.
టిటిడి ధర్మకర్తల మండలి.. ఆలయ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఈ మండలిలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని సేవకు దక్కిన ప్రత్యక్ష అవకాశం లాగా భావిస్తారు. తిరుమల దర్శనాలు, ఆలయ మర్యాదల విషయంలో బోర్డు సభ్యులందరికీ చాలా ప్రత్యేకతలు, విశేషాధికారాలు ఉంటాయి.
కాలక్రమంలో.. టీటీడీ బోర్డు సభ్యులుగా పదవిలో ఉండడం అనేది అనేకానేక రాజకీయ, వ్యాపార పైరవీలు సునాయాసంగా చక్కబెట్టుకోవడానికి ఒక అద్భుతమైన అడ్డదారిగా తయారైంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కవ ప్రయోజనకరమైన పదవిగా తయారైంది. దాంతో ఎమ్మెల్యే అవకాశం మిస్సయిన వాళ్లు, ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి పదవి మిస్సయిన వాళ్లు అందరూ టీటీడీ పదవి కోసం ఎగబడడం ప్రారంభించారు.
రాజకీయ పైరవీలతో బోర్డు సభ్యత్వ పదవి పొందడం సులువైన మార్గం కావడంతో.. జాతీయ స్థాయిలో అనేకానేక మంది ప్రముఖుల సిఫారసులతో పదవి దక్కించుకునే ప్రయత్నాలూ పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. అడగని వారిదే పాపం అన్నట్టుగా.. ఈసారి అతిపెద్ద జంబో బోర్డును వేసేసింది. జంబో టీటీడీ బోర్డు.. వారి అధికారంలోకి వచ్చిన తొలిసారి కూడా వేశారు గానీ.. ఈసారి ఏకంగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమించారు.
పైగా వీరి నియామకాల్లో విచ్చలవిడిగా పైరవీలకే పెద్దపీట వేశారనే ప్రచారం బాగా జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిఫారసు ఉత్తరం మీద ఒక వ్యక్తికి పదవి ఇచ్చారని లేఖ సహా లీక్ కావడంతో.. కిషన్ రెడ్డి ఖండించారు. దర్యాప్తు జరిపించాలని ఏపీ సీఎంకు లేఖ రాశారు.
నకిలీ సిఫారసు, దాని మీద విచారణ సంగతి తరువాత.. అచ్చంగా.. ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలన్నీ.. పైరవీలకు అనుగుణంగా ప్రాప్తించినవే అనే ప్రచారం ఊపందుకుంది. ఈలోగా ఈ నియామకాలు కోర్టుకు వెళ్లాయి. తాజాగా ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది.
.