ఒకే జిల్లా. ఒకటే కులం. మంత్రి పదవికి ఒకరికి ఒకరు పోటీకాగల అవకాశం. అందుకే ఒకరిపట్ల ఒకరికి ద్వేషం. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వడం.. ఇలాంటి సహజాతిసహజమైన రాజకీయ పరిణామాలుక చిత్తూరుజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేదికగా మారుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య రణం ముదిరి పాకాన పడుతోంది.
రాజకీయ రంగంలో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర పడిన ఎమ్మెల్యే రోజాకు స్వపక్షంలోనే అసమ్మతి సెగ పుట్టించడంలో, మంత్రి పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారనే అంశం చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రోజా మంత్రి పదవి దాకా వచ్చే విషయం తర్వాత.. ఆమె సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీలోనే అసమ్మతి రాజేయడం ద్వారా.. మనశ్శాంతి లేకుండా చేయాలనే వ్యూహంతో రాజకీయాలు నడుస్తున్నాయి.
వైకాపా ప్రతిపక్షం పాత్ర పోషించేచే రోజుల్లో చంద్రబాబు నాయుడుపై ప్రధాన అస్త్రంగా రోజాను సంధించిన ఆ పార్టీ నాయకులు, ఆమె మాటల తూటాలకు కరతాళ ధ్వనులతో ప్రోత్సహించారు. తెదేపా పాలనలో వైకాపా ఉనికిని ప్రదర్శించడంలో ప్రధాన పాత్ర పోషించిన రోజా దూకుడు, చివరికి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యే స్థాయికి తీసుకెళ్లింది.
ఆ సమయంలో రాజకీయ విమర్శలు చేయడంలో ఫైర్‌బ్రాండ్ అనిపించుకున్న ఆమె, వైకాపా అధికారంలోకి వచ్చాక స్వపార్టీ నేతలకు మింగుడని పరిస్థితిగా మారింది. తెలుగు రాష్ట్రాలలో సినీ నటిగా గుర్తింపు కలిగిన రోజా, టీవీ షోలలో కనిపిస్తూ తనదైన శైలిలో రాణిస్తూంది. ఇదే సమయంలో రాజకీయంగా ప్రధాన పాత్ర పోషిస్తే ఆమె ఎదుగుదలకు అడ్డుండదనే భయం సొంతపార్టీ ప్రత్యర్థుల్లో సహజం.
అదే భావనతో చిత్తూరు జిల్లాలోనే ఆమెకు అసమ్మతి పోరు రోజు రోజుకూ పెరుగుతూంది. ఆమె స్వంత నియోజకవర్గమైన నగరిలో ఎంపీపీ ఎన్నికల్లో తిరుగుబాటు స్వరం తీవ్ర స్థాయిలో వినిపించింది. అయిదు మండలాల్లో నాలుగు మాత్రమే సజావుగా జరిగాయి, ఒక మండలంలో ఎమ్మెల్యే రోజాకు మరో వర్గానికి మధ్య పొత్తు కుదరలేదు. రోజాను ధిక్కరించి అడ్డుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీశైలం దేవాలయం ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఆర్. చక్రపాణి రెడ్డి ఆమెకు బహిరంగ సవాల్ విసురుతూ, ‘‘ రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతామా? ఎవరు గెలుస్తారో? ఎవరి సత్తా ఎంతో తెలుస్తుంది’’ అని పోటీకి పిలవడం జరిగింది. రోజాపై అసమ్మతి రాగం వినిపించడానికి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ప్రోత్సాహం ఉన్నట్లు వినిపిస్తూంది. రోజా నియోజకవర్గంలోని ఇద్దరు అసమ్మతి నాయకులకు పెద్దిరెడ్డి రాష్ట్ర స్థాయి పదవులు ఇప్పించడంతో వారు రోజాకు పదవి కింద కుంపటి లాగా తయారవుతున్నారని స్పష్టమవుతూంది.
మంత్రివర్గంలో మొదటి విడతలో రోజాకు స్థానం దక్కినట్లే దక్కి చేజారింది. ప్రస్తుతం రెండవ విడత విస్తరణలో అందరూ కొత్తవారికి అవకాశం కల్పిస్తే, అందులో ఆమెకు ప్రాధాన్యత ఉంటే, చిత్తూరు జిల్లా రాజకీయ చిత్రంలో రోజా బ్రాండ్ కనిపించకూడదనే రాజకీయ చదరంగంలో పెద్దిరెడ్డి ముందుగానే పావులు కదుపుతున్నారా? అనే చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి
అరెస్టుల భయాన్ని నిలువరించే రక్షణకవచం సెక్షన్ 41(ఎ)
దేవీప్రసాద్ ఒబ్బు షార్ట్ఫిలి ‘అనుసరణ’
సినిమా రివ్యూ : లవ్ స్టోరీ సినిమా దారి తప్పిందా?
good morning : మన విలువ కాపాడుకోడానికి మూడు సూత్రాలు
రెండవ విడత మంత్రి వర్గంలో అవకాశం రాకపోతే రోజా రాజకీయప్రస్థానం మరో మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో అణచివేత అనే పదం సర్వసాధారణమని తెలిసిన, పూర్తి అవగాహన ఉన్న రోజా కూడా ఒకవైపు కష్టనష్టాలను ఫేస్ చేస్తూ.. రాజకీయాల్లో రాణిస్తూనే, కష్టకాలంలో తనను ఆదుకున్న సినీ, బుల్లితెర జీవితాన్ని కొనసాగించడాన్ని నిర్లక్ష్యం చేయడంలేదు.
.

Discussion about this post