ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అలాగే తమ విలువను కూడా కాపాడుకోవాలి. వ్యక్తిత్వం పలచబడినా, విలువ లుప్తమైనా.. ఇబ్బందే. మరి వీటిని కాపాడుకోవడం ఎలాగ? అందుకు ఏమైనా నిర్దిష్ట మార్గాలు, దారులు, ఉపాయాలు ఉంటాయా?
ప్రతి ఒక్కరూ కూడా తాము కాపాడుకుంటున్నాం అనే అనుకుంటారు. తమ తమ స్వానుభవాల్లోంచి.. తమ వ్యక్తిత్వాన్ని, విలువను కాపాడుకోవడానికి భిన్న మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అనుభవాలు నేర్పడానికంటె గాఢమైన పాఠాలు ఉండవు. అయినా సరే కొన్ని సందర్భాల్లో ఇతరుల అనుభవాల్లోంచి ఒకటి రెండు అంశాలను పాఠాలుగా నేర్చుకుంటే.. మన పని సులువు అవుతుంది. అలాంటి భిన్న, చేదు అనుభవాలు మనకూ ఎదురయ్యేదాకా అందుకోసం వేచిఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది.
అలాంటివే సుభాషితాలు కూడా. సుభాషితం అనేది ఇతరుల అనుభవజ్ఞుల స్వానుభవాల సారంలోంచి చిక్కబడి.. మనవరకూ అందే సూత్రీకరణ. దీనిని తెలుసుకోవడం వల్ల, మన ఆచరణలో మార్పు రావచ్చు. కనీసం.. మన వ్యవహారంలో ఆయా అంశాలను సరైన దృక్కోణంలో పరిశీలించవచ్చు. ఇంతకూ మన వ్యక్తిత్వాన్ని, విలువను కాపాడుకోవడం గురించి ఒక సుభాషితం ఏం చెబుతుందో చూద్దాం.
అనాహూతః ప్రవిశతి, అపృష్టో బహు భాషతే ।
అవిశ్వస్తే విశ్వసితి, మూఢచేతా నరాథమాః ॥
ఆహ్వానం లేకుండానే ప్రవేశించేవాడు.. అడగకపోయినా సరే ఎక్కువ మాట్లాడేవాడు.. నమ్మడానికి యోగ్యులు కాని వారిని నమ్మవాడు.. వీళ్లు తమ తమ మూర్ఖత్వం చేత.. విడిచిపెట్టదగిన మనుషులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అంటే తమ విలువను కోల్పోతారు.. అని ఈ సుభాషితం చెబుతుంది.
మనం విలువను కాపాడుకోవడానికి సాధన చేయాల్సిన మూడు లక్షణాలను చెబుతోందీ సుభాషితం. ఇవి మూడూ మనకు తెలిసినవే. కానీ, కొన్ని సందర్భాలలో మనం అనుసరించడంలో విఫలమయ్యేవి. ఒక్కటొక్కటిగా చూద్దాం..
1
‘పిలవని పేరంటానికి వెళ్లద్దు’ అనేది అనాదిగా పెద్దల ద్వారా మనకు అందుతూ ఉన్న మాట. ఇలాంటి పిలవని పేరంటానికి వెళ్లడం అనేది అవమానాల పాల్జేస్తుందనేది సాధారణ అభిప్రాయం. ఎంతటి గొప్ప వారయినా సరే.. ఇలా పిలవకుండా వెళ్లినప్పుడు, దారుణ పరాభవానికి గురవుతారనే నీతిని మనకు తెలియజెప్పడానికే బహుశా దేవుళ్లకే అలాంటి అవమానాన్ని పులిమి మన పెద్దలు కథ తయారుచేసి ఉంటారు.
స్వయంగా తన తండ్రే గనుక.. పిలవకపోయినంత మాత్రాన వెరపు ఎందుకని.. పార్వతి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్లి.. తొలుత అవమానాగ్ని దహించేయగా.. పిదప భస్మాగ్ని కీలలలో ఎలా కడతేరిపోయిందో మనందరికీ తెలుసు. ఆ రకంగా పిలవని పేరంటానికి వెళ్లడం అనేది.. పరాభవాన్ని ఓర్వలేని పరమశివుడి ప్రళయ తాండవానికి ఏ విధంగా దారితీసిందో కూడా మనకు తెలుసు! అష్టాదశ శక్తిపీఠాల రూపేణా ఆ విలయాన్ని, ప్రళయాన్ని, పరాభవాన్ని, పిలవకుండా వెళ్లడం వలన కలిగే పర్యవసానాన్ని మనం గుర్తుచేసుకుంటూనే ఉన్నాం.
ఇవి కూడా చదవండి
అరెస్టుల భయాన్ని నిలువరించే రక్షణకవచం సెక్షన్ 41(ఎ)
దేవీప్రసాద్ ఒబ్బు షార్ట్‌ఫిలి ‘అనుసరణ’
సినిమా రివ్యూ : లవ్ స్టోరీ సినిమా దారి తప్పిందా?
పిలవని చోటకు వెళ్లకూడదు. అది ఖచ్చితంగా పరాభవాన్నే ఇస్తుంది. అయితే మనం మనుషులం. కొన్ని బంధాలు, కొన్ని ఆలోచనలు కొన్నిసార్లు ఈ నియమానికి దాటేందుకు ప్రేరేపిస్తుంటాయి. మనకు ఎంతో ఆప్తుల విషయంలో పిలవకపోయినా వెళ్లాలనిపిస్తుంది. వారు పొరబాటున పిలవడం ‘మిస్’ అయిఉంటారే తప్ప.. మరొకటి కాదని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. అది నిజమే కావొచ్చు. అక్కడ అవమానాలు జరగకపోవచ్చు. కానీ.. అలాంటి సందర్భాల్లో వెళ్లవలసి వచ్చినా సరే.. ఒకవేళ పరాభవమే జరిగితే గనుక.. పరితాపానికి గురికాకుండా, కుంగిపోకుండా ఉండే తెగువ ఉంటేనే వెళ్లాలి. అలాంటప్పుడు ఇక ఇబ్బంది ఉండదు.
2
రెండో అంశానికి వద్దాం. ‘అపృష్టో బహుభాషతే’! ఇది చిత్రమైనది. అతిగా మాట్లాడడం కొందరికి ఉండే దురలవాటు. దాన్ని కూడా సహించవచ్చు. కానీ.. అడగకపోయినా అతిగా మాట్లాడడం అనేది అసహ్యం! ఏమాత్రం భరించలేనిది. ‘అడగనిచోట సలహా ఇవ్వవద్దు’ అనేది పెద్దలు చెప్పే మాట. కేవలం సలహా గురించి మాత్రమే చెప్పిన మాట ఇది. సలహా సంగతి తర్వాత.. అసలు అడగకపోయినా సరే.. ఎందుకూ కొరగాని పనికిరాని మాటలతో అతిగా వ్యవహరించే వారిని ఏమనాలి?
చాలా సందర్భాల్లో.. ఇలాంటి అతి మాటల వదరుబోతు ధోరణి మనకు చికాకు కలిగిస్తుంది. ఆ చికాకు నుంచి మనం తెలుసుకోదగింది ఒక్కటే. మనం అలా అతిగా మాట్లాడకుండా, మనల్ని అడగని సందర్భాల్లో అసలు నోరు మెదపకుండా.. చంచలమైన జిహ్వమీద, ప్రవాహసదృశమైన మాట మీద అదుపు కలిగి ఉండాలి. నోరు జారితే ఆబోరు పోతుంది. అంటే మన పరువు పోతుంది.
3
ఇక మూడో విషయం.. ఇది ఇంకా చిత్రమైనది. ‘అవిశ్వస్తే విశ్వసితి’ నమ్మడానికి యోగ్యులు కాని వారిని నమ్మడం. ఇది పెద్ద ప్రహేళిక- పజిల్. నమ్మరాని వ్యక్తులు ఎవరో.. ముందే ఎలా తెలుస్తుంది. వారు మంచివారో, చెడ్డవారో నమ్మిన తర్వాతే కద మనకు అర్థమయ్యేది! అలాంటప్పుడు నమ్మరాని వ్యక్తులను నమ్మడం మూర్ఖత్వపు మూడు కీలక లక్షణాలలో ఒకటిగా చెప్పేస్తే ఎలా అనే అనుమానం మనకు కలుగుతుంది.
నిజమే. సాధారణంగా, మోసపోయిన తర్వాత గానీ.. నమ్మజాలని వారి జాడ మనం కనిపెట్టలేం. ఇలాంటి సందర్భాల్లోనే మనలోని విచక్షణ పనిచేయాలి. మనిషింలో మంచిచెడుల తూకం అర్థమయ్యేదాకా.. విశ్వసించే వరకూ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే మన అనుభవాలతో గ్రహించేంత వరకు ఆగకుండా, ఇతరులకు ఎదురవుతున్న అనుభవాలను బట్టి విశ్వసనీయతను బేరీజు వేసుకోవాలి. నమ్మకూడని వ్యక్తులను నమ్మడం అనేది.. పిలవని చోటికి వెళ్లడం కంటె, అడగని వాటికి అతిగా చెప్పడం కంటె కూడా మనకు చాలా పెద్ద చేటు చేస్తుంది.
ఒకరి విలువ, వ్యక్తిత్వం పలచబడిపోయేలా చేసే మూర్ఖత్వపు లక్షణాలు అనేకం ఉంటాయి. స్వానుభవంలో మనకు ఇలాంటివి ఎన్నో ఎదురవుతుంటాయి. అయితే.. అలాంటి వాటిలో మూడు ముఖ్యమైన లక్షణాలనే ఈ సుభాషితం మనకు చెబుతుంది. ఇవి ఖచ్చితంగా పాటిస్తే.. కొంత మేలు. ఇంకా బోలెడు విషయాలు మనంతట మనకే బోధపడతాయి.
.

Discussion about this post