రాజకీయ ప్రత్యర్థుల మీద ఎవరో ఒకరు ఏదో ఒక మూల ఒక కేసు పెట్టడం.. ఆ వెంటనే పోలీసులు చురుగ్గా స్పందించి ముందు వారిని అరెస్టు చేసి, కోర్టులో పెట్టడం, రిమాండుకు పంపడం అనేది ఇవాళ్టి రోజుల్లో చాలా మామూలు ఆట అయిపోయింది. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని ఒక సెక్షన్.. నేరం నిజంగానే జరిగిఉన్నా సరే.. పోలీసులు అరెస్టు చేసి రిమాండుకింద జైల్లో పెట్టేయకుండా రక్షణ కల్పిస్తుంది. ఇంతకూ ఆ సెక్షన్ ఏమిటి? అది నేరం చేసిన వారికి కూడా ఎలా రక్షణ కల్పిస్తుంది. ఇంతకూ ఇప్పుడు ఆ సెక్షన్ ఎలా చర్చనీయాంశం అవుతోంది?
తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు సభలో మాట్లాడుతూ.. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిన తన ఇష్టమొచ్చిన రీతిగా తూలనాడారు. దీనిమీద చాలా రాద్ధాంతం జరిగింది. అయ్యన్న పాత్రుడుపై చాలా చోట్ల వేర్వేరు వ్యక్తులు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. ఖచ్చితంగా అరెస్టు అయి తీరవలసిన కేసులు ఇవి. సరిగ్గా ఇక్కడే, ఈ సిఆర్‌పిసి సెక్షన్ 41(ఎ) తెరపైకి వచ్చింది. తన అరెస్టు జరగకముందే.. అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. 41 ఏ ప్రకారం వ్యవహరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దాంతో ఆయన తక్షణ అరెస్టు జరగలేదు.
రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని అయ్యన్నపాత్రుడు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వారి వాదనలో నిజానిజాలుపక్కన పెడితే.. ఇటీవలి కాలంలో చాలా సందర్భాలలో విపక్ష నాయకుల మీద కేసులు నమోదు అయితే చాలు.. తక్షణం వారి అరెస్టులు జరగడం రివాజు అయిపోయింది. నాయకులైనా, సోషల్ మీడియాలో అడ్డగోలుగా చెలరేగిపోయే వారైనా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడితే కేసులు, అరెస్టులు సాధారణం అయిపోయాయి. ఆ నేపథ్యంలో అయ్యన్న కోర్టు నుంచి రక్షణ కోరి, అరెస్టును తప్పించుకోవడంతో.. 41(ఎ) సెక్షన్ ఆసక్తి కరం అయింది.
సిఆర్‌పిసి సెక్షన్ 41(ఎ) ఏం చెబుతుందంటే..
41ఎ అనే సెక్షన్ పోలీసు అధికారి ముందు హాజరు కావడం గురించి నోటీసు ఇవ్వడానికి సంబంధించిన సెక్షన్. ఇందులోని అంశాలు ఈ విధంగా ఉంటాయి.
(1) ఎవరిమీదనైతే సక్రమమైన ఫిర్యాదు చేయబడి ఉన్నదో, విశ్వసనీయమైన సమాచారం అందిఉన్నదో, విచారణార్హమైన నేరానికి పాల్పడినట్టు సహేతుకమైన అనుమానం ఉన్నదో.. అలాంటి వారికి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు ఇవ్వాలి. అరెస్టు చేయడానికి తగిన కేసుల విషయంలో ఇది వర్తిస్తుంది.
(2) అలాంటి నోటీసు ఏ వ్యక్తికైనా ఇవ్వడం జరిగితే.. నోటీసులో పేర్కొన్న నిబంధనల కు అనుగుణంగా ఆ వ్యక్తి నడుచుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
100 శాతం ప్రక్షాళన జగన్ కు సాధ్యమేనా?
ఫిరాయింపు మరకలను కడుక్కునే ప్రయత్నం!
Good Morning : ప్రేమ ఎంత గొప్పది? ఎందుకు?
సజ్జలకు పిచ్చి పట్టిందంటున్న సైకాలజిస్ట్!
(3) నోటీసులోని అంశాలకు అనుగుణంగా ఆ వ్యక్తి నడుచుకున్నంత వరకు, నోటీసులో పేర్కొన్న ఫిర్యాదుకు సంబంధించి అతడిని అరెస్టు చేయడానికి వీల్లేదు. తప్పనిసరిగా అతడిని అరెస్టు చేయాల్సిందే అని విచారణాధికారి భావిస్తే గనుక.. ఆ అభిప్రాయానికి రావడానికి సంబంధించిన కారణాలను రికార్డు చేయాల్సి ఉంటుంది.
(4) నోటీసులోని నియమాలకు విరుద్ధంగా, విచారణకు సహకరించకుండా ఆ వ్యక్తి వ్యవహరిస్తే గనుక అరెస్టు చేయవచ్చు.
నోటీసుకు సహకరించినంత వరకు ఎవ్వరినీ అరెస్టు చేయడానికి వీల్లేదని ఈ సెక్షన్ చెబుతుంది. ఒకవేళ అరెస్టు చేయాలంటే.. విచారణాధికారి అందుకు కారణాలను విధిగా రికార్డు చేయాల్సిందే. తను ఎందుకలా అరెస్టు అవసరమని భావించాడో కోర్టుకు చెప్పుకోవాల్సి వస్తుంది. అనవసరమైన ప్రతి సందర్భంలోనూ పోలీసులు అంత సాహసం చేయకపోవచ్చు. అందుకే సెక్షన్ 41(ఎ) అనేది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
ఇవాళ్టి రోజుల్లో కేవలం విపక్ష రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికగా తమ సొంతగళం, ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న అందరికీ కూడా ఈ సెక్షన్ 41(ఎ) గురించిన అవగాహన ఉండడం అవసరం. వారికిదే రక్షణ కవచం.
Discussion about this post