మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు హీరో! చాలామంది తెలుగు సినీప్రియులకు ఆరాధ్య దైవం. మెగాస్టార్ గా ఆయన కీర్తి పరిమళాలు తెలుగునేలకు మాత్రమే పరిమితం. అయితే మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల పరిమళాలు దేశవ్యాప్తం. దానికి మరింత వన్నె తెచ్చేలా.. ఏకంగా 25 భాషల్లో ఈ ట్రస్టు వెబ్‌సైట్ ను ఆవిష్కరించడం కూడా అపూర్వం. కానీ..
ఈ వెబ్ సైట్ చిరంజీవి పరువు తీసేలా ఉన్నదన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. వెబ్ సైట్ లో విపరీతమైన భాషాదోషాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. తెలుగులో భాషను స్పష్టంగా పలకగలిగిన, భాష మీద స్పష్టమైన పట్టు ఉన్న కొద్ది మంది సీనియర్ నటుల్లో చిరంజీవి కూడా ఒకరు. అలాంటిది. ఆయన పేరిట ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లోనే విపరీతమైన భాషాదోషాలు ఉండడం పట్ల అభిమానులు కించిత్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సైట్ రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలు మొత్తం చూసుకున్న, చిరంజీవి వెబ్ సైట్ ను ఆవిష్కరించిన రామ్ చరణ్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేకపోయారే అనే విమర్శలు వస్తున్నాయి.
ఏదైనా పని హడావుడిగా సంకల్పించి.. అతి తక్కువ వ్యవధిలో, ఒక డెడ్ లైన్ కోసం పూర్తి చేసినప్పుడు.. అందులో కొన్ని పొరబాట్లు దొర్లితే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి అత్యవసర సందర్భం ఏమీ లేదు. అక్టోబరు 18వ తేదీన చిరంజీవి వెబ్ సైట్ ను రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఏకంగా 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని కూడా చెప్పారు. అయితే భాషకు సంబంధించి ప్రాథమిక జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం అనేది చిరంజీవి ఇమేజ్ ని పలచన చేసేలా ఉంది.
25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు వెబ్‌సైట్
చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీనికోసం వెబ్‌సైట్ ప్రారంభించినట్లు రాంచరణ్ తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కెరీర్, సినీ జీవితాన్ని ఆవిష్కరించేలాగా.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించిలో తెలియజేసేలాగా www.kchiranjeevi.com ను చరణ్ ప్రారంభించారు.
ఇందులో చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శక నిర్మాతలతో అనుబంధాలు మాత్రమే కాదు.. చిరంజీవి రాజకీయ జీవితం గురించిన సమాచారం కూడా ఉంది.
https://www.kchiranjeevi.com/ వెబ్ సైట్ లో భాష చిరంజీవి పరువును పలుచన చేసేలా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. అంతటి మెగాస్టార్ పేరుతో నిజానికి ఎంతో ఆలస్యంగా రూపొందిన వెబ్‌సైట్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. టెక్నికల్ గా కూడా ఈ వెబ్ సైట్ చాలా తక్కువస్థాయిలో ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాషా దోషాలను సరిదిద్దితే బాగుంటుంది. అనేక తప్పుల సంగతి ఎలా ఉన్నా.. చిరంజీవి నటించిన సినిమా పేర్లను కూడా తప్పుగా పేర్కొనడం దారుణం.
.