శాసనసభకు స్పీకర్ స్థానం చాలా ఉన్నతమైనది. ఆ పదవిలో ఉండేవారు రాజకీయ పార్టీలపై ప్రేమాభిమానాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అంతటి విలువలను ఆశించే రోజులు ఎప్పుడో పోయాయి గానీ.. కనీసం నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నియమాలను అనుసరించే విషయంలో ఇప్పుడు ఏపీ శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం ఎదుట ఒక పెద్ద సవాలు ఉంది. ఆ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిని బట్టి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి.
చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్న రోజున శాసనసభలో జరిగిన రగడ అందరికీ తెలుసు. తన భార్యను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేశారనేది చంద్రబాబు ఆరోపణ. అసలు తాము ఆమె పేరే ఎత్తలేదని, చంద్రబాబే కల్పిత ఆరోపణలు చేస్తూ, తానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారనేది వైసీపీ వారి మాట. నిజం ఏమిటో సామాన్యులకు తెలియదు. పార్టీల మీద ఉండే అభిమానాలను బట్టి.. ఎవరికి వారు రెచ్చిపోతూ చర్చించుకుంటున్నారు.
అయితే సభలో జరిగిన చర్చ ఏమిటో, ఆరోజు ఏం జరిగిందో.. పూర్తి వీడియోను బయట పెట్టాల్సిందిగా ఇప్పుడు స్పీకరుకు ఒక విజ్ఞప్తి అందింది. అడిగినది- సామాన్యులుగానీ, మీడియావాళ్లు గానీ కాదు. శాసనసభ వ్యవహారాలపై వీడియోను , సీసీ టీవీ ఫుటేజిని అడగడానికి హక్కున్న ఎమ్మెల్యే! రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. ఈ మేరకు టీవీ కవరేజీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా స్పీకరుకు లేఖ రాశారు. ఆరోజు ఏం జరిగిందో ఎవరు నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్ధం చెబుతున్నారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
also read : ‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’
ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం అనేది స్పీకరు తమ్మినేనికి కత్తిమీద సాము అనాల్సిందే. వీడియో ఫుటేజీ బయటకు వెళితే గనుక.. వైసీపీ ఎమ్మెల్యేల దుందుడుకు మాటలు బయటకు వచ్చేస్తాయి. ప్రభుత్వానికి నిందలుతప్పవు.. అనే భయం ఆయనను వెన్నాడుతూ ఉండవచ్చు. ఒకవేళ.. వైసీపీ నేతల తప్పుగా పరిగణించదగిన మాటలు ఏవీ లేకపోతే గనుక.. ఆయన నిస్సంకోచంగా ఫుటేజీ బయటపెట్టవచ్చు. తద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కడిగిన ముత్యాలే అని చాటిచెప్పవచ్చు. టీడీపీ అసత్య ఆరోపణలతో ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని దుమ్మెత్తిపోయవచ్చు.
also read : కన్నీళ్లు చంద్రబాబుకు ప్లస్సా? మైనస్సా?
అదే సమయంలో వీడియో విడుదల చేయడానికి, బయటపెట్టడానికి స్పీకరు అంగీకరించకపోతే గనుక.. అందులో ఏదో మర్మం ఉందని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ్మినేని సీతారాం తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబునాయుడు కాదని, తొలుత ఎన్టీ రామారావు భిక్ష పెట్టారని, తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని ప్రకటించి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అలాంటి తమ్మినేని ఎంతగా నియమాలను అనుసరించి ప్రవర్తిస్తారో చూడాలి. శాసనసభ సభ్యుడే ఫుటేజీ అడుగుతున్నాడు గనుక.. ఇవ్వడం ధర్మం. అలాగని.. ఇచ్చి తీరాలని రూల్లేదు. అది ఆయన విచక్షణమీద ఆధారపడి ఉంటుంది. ఆ విచక్షణను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయవచ్చు.
also read : వరదకన్నీళ్లు తుడవడానికి చంద్రబాబు రెడీ
కట్టుబాటుకు లోబడి.. ఫుటేజీ బయటపెట్టడానికి స్పీకరు ఒప్పుకుంటే గనుక.. జగన్మోహన రెడ్డి సర్కారు పరువుపోతుందని పలువురు అనుకుంటున్నారు.
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాసిన లేఖ పూర్తి పాఠం :
బహిరంగ లేఖ
21.11.2021, అమరావతి.
గౌరవనీయులైన, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి.
అమరావతి, ఆంధ్రప్రదేశ్
విషయం : ఈనెల 19వ తేదీన శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలని కోరుతూ…
ప్రజా సంక్షేమానికి అవసరమైన ప్రతి పనిని శాసనాలుగా రూపొందించి, వాటి అమలు, తీరు తెన్నులు, ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలకు వివరించే గొప్పవేదిక శాసనసభ. ఎందరో మహానుభావులు, ఉద్దండుల నుండి వెలువడే ప్రసంగాలకు నిలయంగా భావిస్తారు. ఎలాంటి అసత్య ఆరోపణలకు, అబద్ధాలకు తావుండనిది. అలాంటి పవిత్రమైన స్థలం, ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పరిగణించే చోట.. గత రెండున్నర సంవత్సరాలుగా వ్యక్తిగత దూషణలు, విమర్శలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. స్త్రీ, పురుష అన్న బేధం లేకుండా సభకు పరిచయం లేని వ్యక్తులను కూడా దూషనల్లోకి లాగుతున్నారు. తాజాగా.. నిండు శాసన సభలో ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అధికారపార్టీ శాసన సభ్యులు, మంత్రులు వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 19వ తేదీన శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు, వాదోపవాదాలు రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రజాసమస్యల మీద చర్చిస్తే ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందన్న భయంతో అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ దూషణల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్తుపోయేలా చేసింది.
సభలో లేని, సభకు సంబంధంలేని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అర్ధాంగి, తెలుగు ప్రజల ఆరాద్యదైవం శ్రీ నందమూరి తారక రామారావుగారి కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వరి గారిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపరిచినట్లు అయింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని మహిళా లోకానికి చీకటి రోజు. కానీ ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి గారి పట్ల ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బుకాయిస్తోంది. అందుకే.. 19వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలు అన్నీ సభాసాంప్రదాయం ప్రకారం రికార్డు చేయబడతాయి. ఆ రికార్డులన్నింటినీ ఎటువంటి వీడియో, ఆడియో ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నాము. సభాపతిగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, రాజ్యాంగబద్ధంగా మీకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆడియో, వీడియోలను ఎటువంటి తొలగింపులు లేకుండా రికార్డు అయిన అన్ని విషయాలను ప్రజాక్షేత్రంలో ప్రవేశపెట్టి స్పీకర్ స్థానానికి ఉండే గౌరవాన్ని కాపాడవలసినదిగా కోరుతున్నాం.
ఇట్లు,
తమ విధేయులు,
అనగాని సత్యప్రసాద్,
రేపల్లె, శాసనసభ్యులు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post