06రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం నానాటికీ ముదురుతోంది. ఈ వివాదం లో ఒక్కొక్క విషయం కొత్తగా బయటకు వస్తున్న కొద్దీ.. భాజపా పుట్టి మునుగుతుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మీద ఫోకస్ పెట్టి ప్రత్యర్థులు విపరీతంగా విమర్శలు కురిపిస్తున్నారు. భాజపా నాయకులు రాఫెల్ కుంభకోణాన్ని సమర్థించుకుంటున్న తీరు వారిని కాపాడే విధంగా కనిపించడం లేదు.
ప్రతిపక్షాలేమీ మోడీ రాజీనామాను కోరలేదు. ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని మాత్రమే కోరాయి. ప్రధాని నరేంద్రమోడీ రాజీనామాను కోరి ఉన్నా సరే.. అందుకు భాజపా నానా యాగీ చేసి ఉన్నా అర్థముండేది. కానీ జేపీసీ వేయడానికి కూడా వారు ధైర్యంగా ముందుకు రాకుండా.. గోల చేస్తుండడం.. అనుమానాలను పెంచేదే తప్ప.. తుంచేది కాదు.
బోఫోర్స్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం అప్పట్లో కాంగ్రెస్ ఉసురు తీసింది. ఇప్పుడు భాజపా సర్కారుకు ఉరి వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క నరేంద్రమోడీకే కాదు కదా.. భాజపా భవిష్యత్తు మీదనే రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారం ప్రభావం చూపేలా ఉంది.
నాలుగున్నరేళ్ల పాలనలో తమమీద అవినీతి మరక లేదంటూ.. భాజపా సర్కారు చాలా ఘనంగా డప్పు కొట్టుకుంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఎన్ని ప్రజాకంటక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ప్రజలు కేవలం అవినీతి లేదన్న నమ్మకంతోనే మోడీ సర్కారును క్షమిస్తూ వచ్చారు. కానీ.. తాజా పరిస్థితులను గమనిస్తోంటే… నీతిమయపాలన అనేది కూడా డొల్ల అనిపిస్తోంది. జేపీసీ కి కూడా వెనుకాడితే.. రాజీవ్ కు బోఫోర్స్ లాగా… మోడీకి రాఫెల్ తయారవుతుందనడంలో సందేహం లేదు.
.
Discussion about this post