జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్లు పెట్టొద్దని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి లోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పి.హేమలత అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ… వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ రద్దు చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ సంస్కరణల లో భాగంగా రైతు లకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కు మంగళం పాడాలని నిర్ణయించి…ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలి చూస్తున్నారని తెలిపారు.
రైతులు సంఘటితంగా మీటర్ల విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మీటర్లు పెడితే విద్యుత్ కు ఇచ్చే సబ్సిడీ మంజూరు చేసే లోపు రైతుల సర్వీసులను అధికారులు కట్ చేస్తారని తెలిపారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ముందస్తు రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతుందన్నారు.
ఈ విధానం వలన రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి పడతారని జనార్ధన్ తెలిపారు. ఇక తూర్పు మండలాల్లో వరి పంటను రైతులు కోస్తున్నందున ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి కోతలు జరుగుతున్న కూడా ఇంతవరకూ ప్రభుత్వం కొనుగోలు ఊసే లేదని విమర్శించారు.
ఇక రైతు సంఘం జిల్లా అధ్యక్షురాలు హేమలత, మాజీ కార్యదర్శి అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో చెరుకు రైతుల బకాయిలు గత మూడు సంవత్సరాల నుంచి చెల్లించని యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆస్తులు వేలం వేసి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రైతులకు రావాల్సిన బకాయిలను తక్షణం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు, నిర్లక్ష్యం చేస్తే ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ గ్రామాన రైతు సంఘం నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.రంగయ్య, కౌలు రైతు జిల్లా నాయకులు టి.బాల గురవయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పి. గురవయ్య, గంధం మణి, నాగరాజు, ముని శంకర్, జె కే రమణయ్య, పి. శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
.