పిల్లల ఇష్టం, లక్ష్యాలు ప్రేరణకు పునాదులుగా మారుతాయని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా, మంగళవారం స్థానిక భవానీనగర్ లోని గీతం స్కూల్ లో జరిగిన ప్రేరణ కార్యక్రమంలో మాట్లాడారు.
బాల్యం నుంచే పిల్లల్లో సంపూర్ణ వికాసం కల్పించాలని సూచించారు. కేవలం ఉపన్యాసాలు, మాటలతోనే పిల్లలను మార్చలేమని చెప్పారు. వారిలోని ఆసక్తిని గమనించి, సామర్థ్యాలను గుర్తించి తగిన విధంగా స్ఫూర్తి కలిగించాలని చెప్పారు. పిల్లలను మైదానాలలో ఆడిస్తే సెల్ ఫోన్ వ్యసనం తగ్గిపోతుందని చెప్పారు.
బాల్యం నుంచే పిల్లల ఆహారం, ఆరోగ్యం, ఎదుగుదల, మానసిక స్థితి పట్ల తల్లి తండ్రులు శ్రధ్ధ చూపాలని సూచించారు. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, పోషకాహార లేమి వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గి పోతుందని తెలిపారు. ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే మానసిక రుగ్మతల బారిన పడవలసి వస్తుందన్నారు.
కాగా గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళ గలము తప్ప నీళ్లు తాగించ లేమన్న ఆలోచన విద్యా బోధనలో తప్పని చెప్పారు. గుర్రాన్ని దౌడు తీయించినా, అహారం లేదా ఉప్పు తినిపించినా దప్పిక వేసి నీళ్ళు తాగుతుందని తెలిపారు.
అలాగే పిల్లల్లోని సామర్ధ్యాలు, నైపుణ్యాలను గుర్తించి అనుగుణంగా బోధిస్తే ప్రేరణ పొంది చదువులో రాణిస్తారని చెప్పారు. అలాగే తగిన లక్ష్యాలను ఎంచుకునేలా మార్గ దర్శనం చేస్తే విజయం సాధిస్తారని తెలిపారు.
అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ కిన్నెర శ్రీదేవి, టీచర్లు సుధాకర్ రెడ్డిని సన్మానించారు.

.

Discussion about this post