తిరుపతి రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు అదృష్టం తలుపు తట్టింది. చిత్తూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల విభాగంలో సిపాయికి శాసనమండలి సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు శాసనమండలి పదవి దక్కడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు జయాపజయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆ పార్టీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సిపాయికి 20వేలు పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సిసాయి ఓటమి చూశారు. అయినా చిరంజీవి వెంటే ప్రజారాజ్యంలో కొనసాగారు.
అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి… ప్రజారాజ్యం పార్టీని రద్దు చేయడంతో సిపాయి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పోరేషన్ అధ్యక్షులుగా నియమించారు. వాస్తవానికి సిపాయి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేక పోయినా తెలుగుదేశం పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది.
2019లో టీడీపీ అధికారం కోల్పోయాక కూడా సిపాయికి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ సిపాయి టీడీపీలో ఉన్నంత కాలం ఏనాడూ అసమ్మతి గళం వినిపించలేదు. గత నెల 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రలో కూడా సిపాయి పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన వన్నెకుల క్షత్రియ నేతల సమావేశంలో కూడా ఈయన పాల్గొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సిపాయి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీని వీడతారని ఎవరూ ఊహించలేదు. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు సత్రవాడ మునిరామయ్య, ఆయన తనయులు సత్రవాడ ప్రవీణ్ వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో… అదే సామాజిక వర్గానికి చెందిన సిపాయికి వైసీపీ నేతలు గాలం వేశారు. వైసీపీలో చేరితే శాసనమండలి పదవి ఇస్తామని ఆశ చూపారు. ఇందుకు అంగీకరించిన సిపాయి సుబ్రహ్మణ్యం ఇటీవల తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి… తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ సమయంలో తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించలేదు. తన సామాజిక వర్గ నేతలతో కానీ… అనుచరులతో కనీసం ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. వైసీపీలో చేరతానని కూడా చెప్పలేదు. పక్కా ప్రణాళికతో వైసీపీ నేతలతో రహస్యంగా చర్చలు జరిపి… శాసనమండలి పదవి ఇచ్చే విధంగా ఆయన హామీ తీసుకున్నారు. ఇందుకు వారు కూడా అంగీకరించడంతో సోమవారం తాడేపల్లెకు వెళ్లి వైసీపీ అదినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ కొద్ది సేపటికే సిపాయి సుబ్రహ్మణ్యంకు శాసనమండలి సభ్యులుగా పదవి ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ ప్రకటనతో సిపాయి అనుచరుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఆవిర్బావం నుంచి ఎంతో క్రియాశీలకంగా పని చేసినా… పార్టీ కోసం ఆస్తులు పొగొట్టుకున్నా… అధిష్టానం తమను గుర్తించకుండా పార్టీ మారిన నేతకు గంటల వ్యవధిలో శాసనమండలి పదవి ఇవ్వడం ఎంత వరకు సబబని… ఇదెలా సామాజిక న్యాయం అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వీరిని వైసీపీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో వేచి చూడాలి.
.