వైసీపీ అండతోనే రాజీవ్ నగర్ లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవవ్ నగర్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి వాటిని తిరిగి అప్పగిస్తామన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
శ్రీకాళహస్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజీవ్ నగర్ లో సుమారు రూ.300కోట్లు అక్రమాలు జరిగాయన్నారు. ఈ అక్రమాల్లో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యతో పాటు వీఆర్వో బాలమురళి కీలక పాత్ర పోషించారన్నారు. అల్లూరయ్య, వీఆర్వో బాలమురళి సహకారంలో ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్, సాధన మున్నా రాయల్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ప్రధాన అనుచరుడు సలీం మరికొందరు రాజీవ్ నగర్ లో ఇళ్ల స్థలాలు విక్రయిస్తూ రూ.కోట్లు గడించారని ఆయన ఆరోపించారు.
ఈ ముఠా చేస్తున్న అక్రమాలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డికి తెలిసినా వారిపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ నగర్ అక్రమాల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డికి కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారిస్తే అక్రమార్కుల విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. తన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ జరిపించి… అనర్హులకు ఇచ్చిన 2,700కు పైగా పట్టాలు రద్దు చేయించారన్నారు.
ఈ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాపాడారన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వీఆర్వో బాలమురళి సాయంతో అధికార పార్టీ నేతలు ఖాళీ స్థలాల వివరాలు తెలుసుకుని అమ్మకానికి పెట్టారన్నారు. ఈ ఖాళీ స్థలాలకు పురపాలక ఉద్యోగి అల్లూరయ్య, వీఆర్వో బాలమురళి పట్టాలు తయారు చేసి ఇస్తూ అధికార పార్టీ నేతలకు సాయం చేస్తూ వచ్చారన్నారు. అల్లూరయ్య అక్రమ మార్గంలో పురపాలకశాఖలో ఉద్యోగం పొందారన్నారు. అల్లూరయ్య తండ్రి ఆనందయ్య బతికి ఉండగానే ఆయన మరణ ధృవీకరణ పత్రం తీసుకు వచ్చి ఆయన జూనియర్ అసిస్టెంటు ఉద్యోగం పొందారన్నారు. అల్లూరయ్య తండ్రి ఆనందయ్య నేటికీ బతికే ఉన్నారని… ఆయన చెన్నైలో నివాసం ఉన్నట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు.
అల్లూరయ్య అక్రమ మార్గంలో సంపాదిస్తూ రూ.కోట్లకు పడగలెత్తారని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా వీఆర్వో బాలమురళి రాజీవ్ నగర్ లో విద్యుత్ కనెక్షన్ కు రూ.30వేలు వసూలు చేస్తున్నారని… ఖాళీ స్థలాలను ఒక్కొక్కటి రూ.5లక్షల వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తొట్టంబేడు తహసీల్దారుగా పని చేసిన పరమేశ్వరస్వామి, వీఆర్వో బాలమురళి సాయంతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి తన అనుచరులకు రాజీవ్ నగర్ లో సుమారు 300 పట్టాలు ఇప్పించారన్నారు.
ఈ పట్టాల మంజూరుపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని ఆయన డిమాండు చేశారు. అల్లూరయ్య నుంచి 1600కు పైగా పట్టాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆయనపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ నగర్ లో అక్రమాలకు పాల్పడిన వీఆర్వో బాలమురళి, ధర్మకర్తల మండలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్, సాధన మున్నారాయల్, ఎమ్మెల్యే బియ్యపు మధు ప్రధాన అనుచరుడు సలీంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.
సొంత ఇంటిని సరిదిద్దుకో మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి సొంత ఇంటి సమస్యలు సరిదిద్దుకుని ఇతరులు గురించి మాట్లాడాలని టీడీపీ నేత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హితవు పలికారు. తన చిన్నాన్న బొజ్జల హరినాథరెడ్డి మరణంపై విచారణ జరిపిస్తానని బియ్యపు మధు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తన చిన్నాన్న బొజ్జల హరినాథరెడ్డి ఎలా తుదిశ్వాస విడిచారో అందరికీ తెలుసన్నారు. అయితే బియ్యపు మధు దిగజారి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీ తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిన్నాన్న బొజ్జల హరినాథరెడ్డి ప్రథమ వర్ధంతి ముగిసిన తరువాత తన సోదరుడు బొజ్జల సురేష్ రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడతామన్నారు.
బియ్యపు మధు తన సొంత బావ మరిది సామాను శ్రీధర్ రెడ్డికి ఎలా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. సామాను శ్రీధర్ రెడ్డికి ఆహారంలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నించినట్లు ఆయనే స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గుర్తు చేశారు.
ఇలాంటి వ్యక్తిత్వం గల బియ్యపు మధుసూదనరెడ్డి తమ కుటుంబం గురించి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈయనకు ప్రజలే తగు సమయంలో బుద్ది చెబుతారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.