మతాంతర ప్రేమ వివాహాలు తెలుగు సినిమాకు కొత్త కాదు. మిస్సమ్మ దగ్గర నుండి సీతాకోక చిలుక వరకు ఈ అంశం పై వచ్చిన ఎన్నో తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అదే కోవలో వచ్చిన సినిమా అంటే సుందరానికి… అసలు విషయాన్ని వదిలేసి, వేరే అంశాల్లో వెళ్ళడం వల్ల మూడు గంటల సినిమా అయింది.
కథ విషయానికి వస్తే ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం, ఒక ఆర్థోడాక్స్ క్రైస్తవ కుటుంబం మధ్య నడిచే ప్రేమ కథ ఇది. హీరో, హీరోయిన్లల మధ్య రొమాంటిక్ లవ్ కంటే స్కూల్ రోజుల్లో సాన్నిహిత్యం మీద దృష్టి పెట్టడం వెరైటీ గా అనిపిస్తుంది.
సుందర ప్రసాద్ (నాని), లీలా ధామస్ (నాజ్రియ ఫాహిద్) లు నిజానికి ప్రేమలో పడరు. కానీ వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలను కుంటారు. దానికి వారు తమ కుటుంబాలకు వేరు వేరు అబద్ధాలు చెబుతారు. చివరకు కథ సుఖాంతం అవుతుంది చాలా మలుపులు తర్వాత.
కథలో సబ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. అవి ఏమి ప్రధాన కథకు బలం చేకూర్చలేకపోయాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు మహా వెంకటేష్, మానేజర్ విష్ణు వర్ధన్ పాత్రల వల్ల కథకు ఉపయోగం జరగకపోగా సంక్లిష్టంగా మారింది.
ఒక చక్కని ప్రేమకథలో పాట్లు పడి తల్లితండ్రులను ఒప్పించి, పెళ్లి చేసుకుంటే మనకు ఒక చక్కని ఎమోషన్ మిగులుతుంది. అటువంటి ఫీల్ గుగుడ్ ప్రేమ కథలను మనం ఆస్వాదించడం జరిగింది. అయితే మతం విధించే ఆంక్షలు, లింగ వివక్ష లాంటి అంశాలను కలిపి దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాని కలగాపులగం చేసేశాడు. తథాస్తు దేవతలు, యజ్ఞాలు, అమెరికా, మెడికల్ సమస్యలు ఇలాగే అనేక అంశాలను కలిపి స్క్రిప్ట్ ను పాడుచేశారు.
శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ లో కూడా ఆ తప్పు జరిగింది. అయితే ఆకర్షణీయమైన పాటలు, నృత్యాలు ఉండటం వల్ల లవ్ స్టోరీ బాగా ఆడింది.
కానీ అంటే సుందరానికి సినిమాలో వచ్చేవన్ని సందర్భోచిత పాటలు. అవి ఎంత వరకు ఆకట్టుకుంటాయి అనేది అనుమానమే. బ్రోచేవారేవరురా.. సినిమాలో ఒక రియలిజం, ఒక ఉద్విగ్నత వుంటుంది. ఈ సినిమాలో అది మిస్ అయింది. ట్విస్టులు ఎక్కువ అయ్యాయి. హర్షవర్ధన్ లాంటి మంచి నటుడును ఆ కన్ఫ్యూజన్ పెంచడానికి వాడుకున్నారు.
వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బావున్నా కథాగమనం ఎగుడు దిగుడుగా సాగడం వల్ల మనసుకు పట్టదు. ఛాయాగ్రహణం గొప్పగా లేదు. స్క్రీన్ ప్లే లో లోపాలు వుండటం వల్ల ఎడిటర్ ఏమి చేయలేక పోయాడు.
హీరో, హీరోయిన్ల కుటుంబాలు ఎక్కడ వుంటాయో ఎస్టాబ్లిష్ అవలేదు. నాని ఉద్యోగం ఏమిటో సరిగా చెప్పలేదు. ఫ్లాష్ బ్యాక్ లు ఎక్కువ అయ్యాయి. నజ్రియా ఫోటోగ్రాఫర్ అవడం ఆసక్తికరంగా లేదు. నాన్ లీనీ యర్ విధానంలో కథ చెప్పినప్పుడు సన్నివేశాలలో ఉండవలసిన బలం లేక ప్రేక్షకులకు ఆసహనం కలుగుతుంది.
నాని, నరేష్, హర్ష వర్ధన్ లు కొన్ని నవ్వులు తెప్పించినా వారి పాత్రలకు ఒక డైరెక్షన్ లేదు.
హీరో, హీరోయిన్ల చిన్నప్పటి స్కూల్ సన్నివేశాలు ఆసక్తికరంగా వున్నా,
అవి ప్రధాన కథకు సరిగా కలప లేకపోయారు. పదే పదే స్కూల్ రోజులకు వెళ్ళడం విసుగు తెప్పిస్తుంది. నిజానికి శేఖర్ మాస్టర్ కొడుకు, ఇంకో బాలనటి చాలా బాగా నటించారు. శేఖర్ మాస్టర్ కొడుకు చిరంజీవి ను గుర్తుకు తెచ్చారు తన డాన్స్ మూవ్మెంట్స్ తో.
నాని, నరేష్, రోహిణి తదితరులు తన నటన ప్రతిభతో కథను బాగా నడిపాడు.మిగతావారు కూడా గొప్పగా నటించారు. నజ్రియా బాగా నటించినా, ఆమె డబ్బింగ్ బాగోలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకోదు. పదికి పైగా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒక్క పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.
ఒక మంచి ప్రయత్నం వృధా అయ్యింది. అయితే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ నుంచి భవిష్యత్తులో మంచి సినిమాలు ఆశించవచ్చు. అతని రాసుకున్న మాటలు బావున్నాయి. తీసుకున్న కథ లోనే లోపాలు ఎక్కువ.
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
Discussion about this post