చిత్తూరు జిల్లాపై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 24గంటల వ్యవధిలో 607 మందికి కరోనా సోకడమే ఇందుకు నిదర్శనం. అంతకు మునుపటి రోజు 467 కేసులు నమోదు కాగా… ఒక రోజు వ్యవధిలోనే 140 కేసులు పెరగడం విశేషం.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సగటు పాజిటివిటీ రేటు 10.96శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు ఏకంగా 23.37 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.16శాతం ఉంది. జిల్లాలొ ఇప్పటి వరకు 2,50,373 మంది కొవిడ్ బారిన పడగా… అందులో 1,959 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే.
అధికారిక లెక్కల్లో లేనివి ఇంకా వందల సంఖ్యలోనే ఉన్నాయి. కొవిడ్ కేసుల్లో ప్రస్తుతం చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. అయినా ప్రభుత్వ యంత్రాంగం నివారణకు నామమాత్రపు చర్యలు తీసుకుంటోంది.
చిత్తూరు జిల్లాలో కొవిడ్ మూడవ దశ ప్రారంభమైంది. ఇందుకు వైధ్యశాఖ గణాంకాలే సాక్ష్యాలు. పది రోజుల కిందట వరకు రోజువారీ కేసులు పదుల సంఖ్యలోనే నమోదయ్యేవి. అయితే థర్డ్ వేవ్ కారణంగా రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతున్నాయి.
ఈ నెల 4న 55 కేసులు నమోదు కాగా… 7వ తేదీన 150 కేసులు నమోదయ్యాయి. 9న 250 కేసులు నమోదవగా… 11న ఈ కేసుల సంఖ్య 467కి చేరింది. బుధవారం ఏకంగా ఈ కేసులు 607కు చేరాయి. చిత్తూరు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నాటికి క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య 228 మాత్రమే. అదే బుధవారం ఉదయం గంటలకు ఈ క్రియాశీల కేసుల సంఖ్య 2,156కు చేరింది. అంటే ఎనిమిది రోజుల వ్యవధిలో 1,928 క్రియాశీలక కేసులు పెరిగాయి. రమారమి రెండు వేలు అన్నమాట. అదీ నామమాత్రంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే బయట పడ్డ కేసులు మాత్రమే ఇవి.
అధికారులు అంకిత భావంతో పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైద్యశాఖ అధికారిక గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో తిరుపతిలో 171, చిత్తూరులో 113, మదనపల్లెలో 30, పుత్తూరులో 27, శ్రీకాళహస్తిలో 10, నగరిలో 5, పుంగనూరులో 5వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు పరిశీలిస్తే… తిరుపతిలో 26.31, చిత్తూరులో 26.28, మదనపల్లెలో 25.42, పుత్తూరులో 28.42, శ్రీకాళహస్తిలో 12.20, నగరిలో 7.94, పుంగనూరులో 18.52శాతం ఉంది. పలమనేరులో మాత్రం కొవిడ్ కేసులు లేవని అధికారులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో 1,545 మందికి పరీక్షలు నిర్వహించగా… అందులో 361 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 3,991మందికి పరీక్షలు చేయగా…అందులో 246 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. జిల్లాలో 66 మండలాలు ఉండగా… మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో బైరెడ్డిపల్లె, బంగారుపాళెం, గంగవరం, కార్వేటినగరం, నిమ్మనపల్లె, నిండ్ర, పాలసముద్రం, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, పెద్దపంజాణి, రామకుప్పం, వెదురుకుప్పం, వి.కోట తప్ప మిగిలిన అన్ని మండలాల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
క్షేత్ర స్థాయిలో ఫీవర్ సర్వే నామమాత్రంగా జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు సక్రమంగా చేయడం లేదు. వాస్తవానికి ప్రతి సచివాలయం పరిధిలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని… జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు గుర్తించాలి. వారు ఇచ్చే నివేదికల ఆదారంగా వైద్యాధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఫీవర్ సర్వేకు స్వస్తి చెప్పేశారు. ఇలా చేయడం వలన కొవిడ్ బాధితులను గుర్తించడం చాలా కష్టం. వారి కారణంగా ఇతరులు కూడా కొవిడ్ బారిన పడే అవకాశం ఉంది. గత అనుభవాలను దృషిలో ఉంచుకుని అధికారులు ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాల్పి ఉంది. పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి తేవాలి. లేదంటే రెండవ దశలో జరిగినట్లే జరుగుతుందని జనం భయపడుతున్నారు.
.

Discussion about this post