జగమెరిగిన జర్నలిస్టుగా, రచయితగా, పాత్రికేయ గురువుగా సుప్రసిద్ధులు డాక్టర్ గోవిందరాజు చక్రధర్. జర్నలిజంలో సుదీర్ఘ, బహుముఖ ప్రస్థానం ఆయనది. కొండను అద్దంలో చూపినట్టుగా.. సుదీర్ఘ జీవితాన్ని సంక్షిప్తంగా వివరించే చిన్న ఆత్మకథ లాంటిది ఈ వ్యాసం. రెండో భాగం.. ఆదర్శిని పాఠకుల కోసం..
రచయితగా మొదలైన ఆసక్తికి మెరుగులద్దుకుంటూ, పాత్రికేయుడిగా అడుగులు వేసి.. ప్రచురణ కర్తగా, జర్నలిజం గురువుగా మారిన సంపూర్ణమైన పాత్రికేయ ప్రస్థానం ఇది..
ప్రచురణ కర్తగా..
మీడియా హౌస్ పబ్లికేషన్ప్ ను నా పుస్తకాల ప్రచురణకే పరిమితం చేయకుండా మిత్రులు, సీనియర్ జర్నలిస్టుల పుస్తకాలనూ వెలువరించాను. పొత్తూరి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ వీక్లీ సంపాదకీయాలను వ్యాసప్రభ, చింతన, చిరస్మరణీయులు అనే మూడు పుస్తకాలుగా ప్రచురించాను. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ, బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ ‘విన్నంత కన్నంత’, అనువాద పాఠాలు, మంచి జర్నలిస్టు కావాలంటే, తెలుగు సంగతులు, మరవరాని మాటలు ప్రచురించే అవకాశం లభించింది. దుర్గెంపూడి చంద్రశేఖర్ రెడ్డి మన భాష, కాకాని చక్రపాణి కథలు కూడా మీడియా హౌస్ ద్వారా పాఠకులకు చేరాయి. సంస్థ తరపున నలభై పుస్తకాలు వెలుగు చూశాయి. మిత్రుల సహకారంతో వాసిగల పుస్తకాలను ప్రచురించానన్న తృప్తి ఉంది. మిత్రులెవరైనా సొంతంగా పుస్తకాలు ప్రచురిస్తుంటే వారికి నావంతు తోడ్పాటును అందిస్తూ వస్తున్నాను.
అనువాదంలో నా కృషి : కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జనప వెంకటరాజం, నేను ఒక బృందంగా అనేక పుస్తకాలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించాం. తెలుగువారి చరిత్రకు సంబంధించి ఇంగ్లీషులో ప్రముఖ చరిత్రకారులు రాసిన ప్రామాణిక గ్రంథాలను ప్రణాళిక ప్రకారం అనువాదం చేశాం. వాటిలో కొన్ని : నిజాం-బ్రిటిష్ సంబంధాలు, కాకతీయులు, రెడ్డి రాజుల చరిత్ర, హైదరాబాద్ జీవిత చరిత్ర, వేంగీ తూర్పు చాళుక్యులు, ముసునూరి నాయకులు, విస్తృత సామ్రాజ్యం విజయనగరం, తొలినాటి తెలుగు రాజవంశాలు, తెలుగువారి ప్రాచీన చరిత్ర, ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణ జీవితం, విజయ నగర చరిత్ర – మరికొన్ని ఆకరాలు, ఇవి కాకుండా చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు; నేను క్యాన్సర్ ను జయించాను పుస్తకాలను అనువదించాను. స్వతంత్రంగా అనువదించిన పుస్తకాలూ ఉన్నాయి.
శాశ్వతంగా నిలిచి పేరును నిలిపేవి పుస్తకాలేనని గట్టిగా నమ్మిన నేను 58 ఏళ్లకు రిటైరయ్యాక మరింకెక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయకుండా రచనా వ్యాసంగంలోనే నిమగ్నమై ఉన్నాను. నేను మాత్రమే చెప్పగలిగిన విషయాలు మరీ ముఖ్యంగా జర్నలిజంలో ఉన్నాయని నమ్ముతున్నాను. జర్నలిజం, సృజనాత్మక రచనలపై కొన్ని పుస్తకాలను రాసే ప్రణాళిక ఉంది. కొన్ని పిల్లల నవలలకూ ఇతి వృత్తాలు సిధ్దంగా ఉన్నాయి. రాయటం మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. వీటికి తోడు స్వీయ చరిత్ర ఉండనే ఉంది.

రచయితగా బలాలు: ఇప్పటికీ అచ్చులో పేరు చూసుకోవడం మహదానందం కలిగిస్తుంది. పత్రికలో వ్యాసం వస్తే ఆరోజు మూడ్ ఉల్లాసంగా మారిపోతుంది. ఒకటి రెండు సార్లు వ్యాసాన్ని తనివితీరా చదువుకుంటేగానీ తృప్తి ఉండదు. పుస్తకం ప్రెస్ నుండి వచ్చినా ఇంతే. బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ సామెతను పొడిగించి పుస్తకం ఇంటికి వచ్చిన వేళ అని కూడా జత చేశాను. చిన్న ఆలోచనపై ఫోకస్ పెట్టి పెంచి రాయగల శక్తి ఉందని నమ్మకం. ఏ ఇంగ్లీషు పుస్తకంలోనో రెండు వాక్యాలు చదివి దాని ఆధారంగా గంటన్నరపాఠాన్ని తయారు చేసి చెప్పగలను. భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి. సమాజంలో జరిగే విషయాలపై మనసు తల్లడిల్లే సందర్భాలూ ఎక్కువే. ఇవి ప్రశాంతంగా కూచోనివ్వవు. ఒక చక్కటి వాక్యం ఎవరు రాసినాసరే, చదివితే ఆనందంతో కళ్లు చెమరుస్తాయి. ఈ గాఢ భావోద్వేగాలు ఒక్కోసారి సున్నితత్వంగా మారి ఆత్మీయులకు చాదస్తంగా కన్పించి ఇబ్బంది పెడతాయి. ‘ప్రతిదాన్నీ అంతగా అతిగా ఆలోచిస్తే బతకలేం’ అని నచ్చచెప్తుంటారు నాకు.
ఒక్కోసారి భావాలు జలపాతాల్లా దూకుతాయి. రాతలో వెనకబడతాను. మరికొన్నిసార్లు ఎంత గింజుకున్నా అక్షరమ్ముక్క ముందుకు సాగదు. కాగితాలు పక్కన పెట్టేస్తాను.
నేను ఏ భావజాలపు చట్రంలో ఇమడని ప్రొఫెషనల్ ని. కానీ చాలామంది నాపై ఏదో ముద్ర వేయాలని చూస్తుంటారు. నేను చేయగలిగిందేమీ లేదు.
బలహీనతలు : జర్నలిస్టు అంటేనే జనరలిస్టు. వాళ్లకు అక్కరలేని విషయమంటూ లేదు. అమెరికా నుంచి ఆవకాయదాకా, అంతరిక్షం నుంచి అందాలపోటీ దాకా అన్ని విషయాలూ రాయాల్సి రావచ్చు. నాకు చాలా విషయాలమీద ఆసక్తులు ఉన్నాయి. ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పేపర్ ను చదువుతాను. మిగిలిన పత్రికలను ఆన్ లైన్ లో దొర్లించేస్తాను. పత్రికలు చదివేటప్పుడు కొత్త ఆలోచనలనేకం పుట్టుకొస్తుంటాయి. ఆయా వార్తలను కత్తిరించి భద్రపరుస్తుంటాను. ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితం కానందున ఏ ఒక్క అంశం పైనా పూర్తి పట్టు, సాధికారికత లేకపోవటం లోపంగానే భావిస్తాను. చాలా సందర్భాల్లో మూలాల్లోకి వెళ్లి అక్కడినుంచి తెలుసుకుని రాయవలసి రావడంతో ఎక్కువగా ప్రయాస పడుతుంటాను.
రచయితగా ఎదురీత : జర్నలిస్టుగా, రచయితగా మొదటినుంచీ ఎదురీత తప్పటంలేదు. జర్నలిస్టుగా ఉద్యోగ భద్రత ఉండేది కాదు. జీతాలూ అంతంత మాత్రమే. రచయితగా, ప్రచురణ కర్తగా నిర్విరామంగా పట్టుపడుతున్నా ఆర్థికంగా కుదురుకున్నదేమీ లేదు. ఇదొక విషాదం.
నేనే కాదు, ప్రతి రచయిత పరిస్థితీ ఇదే. స్మార్ట్ ఫోన్ల రాకతో పుస్తకాలు చదివేవారు తగ్గిపోతున్నారు. తెలుగువారి సంఖ్య కోట్లలోనే ఉన్నా ఒక పుస్తకాన్ని కనీసం వేయి కాపీలు అమ్ముకోలేని దుస్థితి, చాలామంది రెండు, మూడు వందల కాపీలతో సరిపెట్టుకుంటున్నారు. వీటికితోడు పిడిఎఫ్ కాపీల బెడద. ఇది పబ్లిషర్లు, రచయితల పట్ల శాపంగా మారింది. ప్రతివారూ పిడిఎఫ్ కాపీని షేర్ చేయమనేవారేగానీ పుస్తకాన్ని కొనటానికి ముందుకు రావడంలేదు. కొన్ని దుకాణాలవారు పుస్తకాలు అమ్మినా డబ్బు ఇవ్వరు.
యుద్ధంలో ఓటమి ఖాయమని తెలిసీ ప్రతిసారీ యుద్ధానికి సన్నద్ధం కావటం అంత సామాన్య విషయం కాదు. ఇప్పుడు రచయితలు ఫలితం కోసం ఎదురు చూడని నిష్కామ కర్మ యోగుల్లా తమ పని తాము చేసుకు వెళుతున్నారు. ఇంటా బయటా ప్రతికూలతలను, నిరుత్సాహపరిచే మాటలను దిగమింగి కలాలకు పదును పెడుతూనే ఉన్నారు.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
గీతాకారుడు ఒకే ఒక అర్జునుడికి మాత్రమే మార్గాన్ని ఉపదేశించాడు. ‘‘నన్నయ తాటికమ్మలను ఎంతమంది చదివి ఉంటారు? కానీ నన్నయ్య ఇప్పటికీ సజీవంగా ఉంటూ అంకితం పుచ్చుకున్న రాజరాజ నరేంద్రుణ్ని కూడా సజీవంగా ఉంచగలిగాడు. అక్షరం శక్తిని చాటాడు.
ఒక్క రచయితలకు మాత్రమే అనేక జన్మలు, అనుభవాలుంటాయి. వారు సృష్టించే ప్రతి పాత్రలో వారు జీవిస్తారు. వారి రచనల ద్వారా మరణానంతరమూ చిరంజీవులుగా నిలుస్తారు. రాయటమంటే ఒక యోగం. అదొక యాగం. ఈ మహత్తర కార్యంలో యోగిపుంగవుల్లా తలమునకలై తరిస్తున్న రచయితలందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
ఇది నా కథ, ఇది మీ కథ, ఇది మన అందరి కథ. రచయితలందరి కథ.
(సాహిత్యంతో నా సహవాసం శీర్షికన మాడభూషి సాహిత్య, కళా పరిషత్ 17-10-2021న జరిపిన జూమ్ సమావేశంలో మాటలకు అక్షర రూపం)
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం గురువు

.

Discussion about this post