తిరుమలేశుని ఐడియా ఫాలో కావచ్చు!

140

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి మంచి ఆలోచన చేసింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే దైవదర్శనాలను పునరుద్ధరించడానికి అదే సమయంలో.. సోషల్ డిస్టెన్స్ ను సమర్థంగా పాటించడానికి వీరి కొత్త ఐడియా బాగుంది. ఇదే ఐడియాను దేశంలోని అన్ని ఆలయాలు కూడా పాటించడానికి అనువుగానే ఉంది. నిజానికి ఆలయాలు తెరిచినప్పటికీ.. ఇప్పుడు కరోనా పరిస్థితులు, రవాణా అననుకూలతలను అధిగమించి.. దర్శనాలకి వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది. టీటీడీ ఆలోచన కూడా దానికి తగ్గట్లుగానే ఉంది. 

లాక్ డౌన్ తర్వాత.. టీటీడీ ఆలయాన్ని తెరిస్తే.. రోజుకు ఏడు వేల మంది భక్తులకు మాత్రమే దైవదర్శన అవకాశం కల్పించేలా బోర్డు నిర్ణయించింది. రోజుకు 14 గంటలు మాత్రమే దైవదర్శనాలను అనుమతించనున్నారు. అది కూడా ఒక గంటలో కేవలం 500 మంది మాత్రమే దైవదర్శనం చేసుకోగలిగేలా సోషల్ డిస్టెన్స్ ను పాటించేలా చూడనున్నారు. మొత్తంగా కలిపి ఒక రోజులో ఏడు వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం దక్కుతుంది. 

ప్రయోగాత్మకంగా ఆలయానికి భక్తులను అనుమతించిన తొలి మూడు రోజులు కేవలం టీటీడీ ఉద్యోగుల కుటుంబాలను, ఆ తర్వాత తిరుపతి స్థానికులను 15 రోజుల పాటు అనుమతిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఇవన్నీ ముగిసిన తర్వాతే ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి ఉంటుంది. దర్శనవేళల్ని ఆన్ లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ లను ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటూ ప్రజారవాణా అంత వెంటనే ప్రారంభం కావడం లేదు కాబట్టి.. సొంత రవాణా ఏర్పాట్లతో రాగలిగేవారు మాత్రమే  కొన్ని రోజుల పాటూ తిరుమలకు వస్తారు. 

టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి టోల్ గేట్ వద్ద తిరుమల వెళ్లడానికి అనుమతిస్తారు. కాటేజీలను కూడా ఇద్దరికి మాత్రమే ఉండేలా కేటాయిస్తారు. ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

అన్ని ఆలయాలు దీనిని అనుసరించవచ్చు

సోషల్ డిస్టెన్సింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. దర్శానాలను అనుమతించడానికి టీటీడీ చేసిన ఆలోచన చాలా బాగుంది. దేశంలో ప్రస్తుతం మూతపడి ఉన్న అనేక ఇతర ఆలయాలు కూడా ఇదే పద్ధతిని పాటించినా బాగుంటుంది. ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా ఆలయాలు మూతపడి ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను చాలా చాలా అంశాల పరంగా సడలించిన నేపథ్యంలో ఆలయాల్లో దర్శనాలను కూడా పునరుద్ధరించడం మంచిదనే ఆలోచన వ్యక్తం అవుతోంది. రోజుకు ఏడు వేల మంది భక్తులను అనుమతించే ఏర్పాటు చాలా ఆలయాలకు ఒత్తిడి కూడా కాకపోవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

Facebook Comments