ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. సంపూర్ణంగా చేయాలి. మొక్కుబడిగా చేయడం వల్ల కూడా ఆ పని పూర్తి కావచ్చు. కానీ.. ఆ పని చేయడంలో ఉండే ఆనందాన్ని మనం ఎన్నటికీ ఆస్వాదించలేం. ఫలితం మీద మాత్రమే దృష్టి ఉంటే మనస్ఫూర్తిగా చేయడం కూడా సాధ్యం కాదు.
ఒక పని అనుకున్నప్పుడు.. దానికి ఒక ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఫలితం కోసమే పని చేస్తాం. కానీ.. ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు.. ఆ ఫలితం దక్కితే చాలు అనుకునే వాళ్లు కూడా ఉంటారు. చాలా సార్లు అది నిజమే కదా అనిపిస్తుంది. అది నిజమేనా?
ఈ సందేహావస్థను తొలగించేలా.. ఒక సుభాషితం చిన్న మార్గం చూపిస్తుంది.
అవ్యాకరణ మధీతం భింద్రోణ్యా తరగిణీతరణమ్
భేషజమపథ్య సహితం త్రయమిదం అకృతమ్ వరం న కృతం
వ్యాకరణం తెలియకుండా భాష నేర్చుకోవడం అంటే మౌలికమైన సంగతులు విస్మరించి ఏ పనినైనా పైపైనే నేర్చుకోవడం, రంధ్రం పడిన పడవలో నదిని దాటే ప్రయత్నం చేయడం, డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా వైద్యుడి సలహా లేకుండా మందులను వాడడం ఈ మూడు పనులనూ ఏదో ఒక విధంగా చేసేద్దాం అనుకునే కంటే.. చేయకుండా ఉండడమే మంచిది. .. అనేది శ్లోకభావం.
ఈ సుభాషితం చెబుతున్న విషయాలకు అచ్చంగా రివర్సులో ఆలోచించినా కూడా సహేతుకంగా అనిపిస్తుంది. చాలా మంది అదే ధోరణితో ఉంటారు కూడా. మనం చెప్పదలచుకున్నది సరిగ్గా చెప్పగలిగామా లేదా అనేది ముఖ్యం గానీ.. వ్యాకరణం ఎందుకు? తీరం దాటామా లేదా అనేది ముఖ్యం గానీ.. పడవకు చిన్న రంధ్రం ఉంటే మాత్రం ఏమిటి? రోగం తగ్గిందా లేదా చూడాలి గానీ.. డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకపోతే మాత్రం ఏమిటి? అని అడిగితే ఏం చెప్పగలం?
ఇష్టపడి పని చేయాలి అని మనం చాలా తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇష్టం అంటే ఏమిటి? ఆ పనిలో ఉండే ఫలితాన్ని కాకుండా పని చేయడంలో ఉండే రుచిని ఆస్వాదించడం. ఫలితం ఏమైనా కావొచ్చు గాక.. కానీ పని చేయడాన్ని ఇష్టపడే వాడు.. ఆ పనిని సమగ్రంగా, సంపూర్ణంగా, సౌందర్యాత్మకంగానే చేయాలనుకుంటాడు. పనిచేస్తూండే సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు.
వ్యాకరణయుక్తంగా భాషావిన్యాస చమక్కులతో రాసినప్పుడు కలిగే ఆనందం ఒకటి ఉంటుంది. రంధ్రం ఉంది.. అనే ఆందోళన లేకుండా పడవలో కూర్చుంటే గనుక.. ఆ పని నదిని దాటుతున్నట్లుగా కాకుండా నదీ విహారంలాగా ఉంటుంది. డాక్టరు ప్రిస్క్రిప్షనే గనుక ఉంటే మందు తీసుకోవడంలో రెండో చింత ఉండదు. తగ్గుతుందో లేదో.. ఎప్పటికి తగ్గుతుందో అనే గుంజాటన ఉండదు.
ఇది కూడా చదవండి : జగన్ మడమ తిప్పని నేత అంటారు గానీ.. మాట మార్చేసే నేత
జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం కరక్టేనా
మోడీ, చంద్రబాబు.. ‘ఈ జన్మలో చూడలేం’ అనుకున్నది చూపించారు
చట్టాలు తయారు చేసే స్థానంలో ఉంటూ బండబూతులు తిట్టుకునే సిగ్గుమాలిన రాజకీయం
ఆ రకంగా ఏదోలా చేసేద్దాం అనుకోకుండా పరిపూర్ణంగా చేయాలని అనుకోవడమే జీవిత మధురిమ. ఈ సిద్ధాంతాన్ని మనం జీవితంలో చేసే ప్రతి పనికీ అన్వయించుకోవచ్చు. దాని లోతు బోధపడుతుంది. భగవద్గీత చెప్పినట్టుగా నిష్కామకర్మలాగా చేయడం అది. అలా పనిచేయడంలో ఉండే తీయదనం కూడా మనకు స్వానుభవం అవుతుంది.
శుభోదయం.
.

Discussion about this post