మౌనం చాలా సందర్భాల్లో మనకు రక్షణ కవచం. మౌనం మనల్ని కాపాడుతూ ఉంటుంది. మాట జారితే వెనక్కు తీసుకోలేం గనుక.. ఆలోచించి మాట్లాడడం ఒక పద్ధతి. కానీ.. ఆ ఆలోచన సాగేంత వరకు మౌనం మాత్రమే కాపాడుతుంది.
ఆవేశం వచ్చినప్పుడు మౌనం పాటించడం చాలా రకాలుగా మనల్ని కాపాడుతుందని కూడా కొందరి అనుభవాలు చెబుతుంటాయి. ఇదంతా మానవ సంబంధాల విషయంలో మౌనం ఎలాంటి మేలు చేస్తుందనేది. కానీ జ్ఞానర్జన విషయంలోను మౌనం చాలా ఉపయోగపడుతుంది.
knowledge is knowing of what we dont know అని ఒక నానుడి ఉంటుంది. ‘మనకు ఏం తెలియదో- ఆ అవగాహన కలిగి ఉండడమే జ్ఞానం’! ఒక నిర్దిష్టమైన విషయం గురించి మనకు తెలియనప్పుడు.. ‘తెలియదు’ అనే సంగతి మనకు అవగాహన ఉండాలి. అది లేనప్పుడు తెలిసీ తెలియక వాగడం ఎక్కువగా ఉంటుంది. అలా వాగే కొద్దీ మన అజ్ఞానం బయటపడిపోతుంది.
ఏ విషయం గురించి అయినా.. కొత్తగా కొన్ని సంగతులు తెలుసుకున్నప్పుడు.. మనకు చాలా జ్ఞానం వచ్చేసిందని అనుకుంటాం. నిజానికి నిన్నటి వరకు ఆ విషయంలో మనం పూర్తి అజ్ఞానులం గనుక.. ఒకటిరెండు శాతం సంగతులు తెలియగానే.. జ్ఞానం వచ్చేసినట్టు మురిసిపోతాం.
కానీ ఆ నిర్దిష్టమైన విషయం గురించి కిందటి రోజు వరకు మనకు ఏమీ తెలియదు గను.. ఇంకా 90 శాతం సంగతులు మనకు తెలియకుండా మిగిలే ఉన్నాయనే విషయం కూడా తెలియదు. దాంతో మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతుంటాం. కానీ ఆ విషయంలో వంద శాతం పరిజ్ఞానం ఉన్నవాడు తారసపడినప్పుడు.. మనకు అసలు సంగతి బోధపడుతుంది. అప్పటిదాకా ఎంత అజ్ఞానంలో మగ్గిపోయామో కూడా అర్థమవుతుంది.
జ్ఞానానికి అంతూ దరీ ఉండదు. మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా సరే.. ఆ జ్ఞానానికి చెల్లుబాటు.. మనకంటె ఎక్కువ విషయాలు తెలిసిన వ్యక్తి తారసపడేంత వరకు మాత్రమే. ఆ స్పృహ కలిగి ఉంటే.. జ్ఞానానికి సంబంధించి ఎలాంటి గర్వమూ మన తలకెక్కకుండా ఉంటుంది.
ఇదే విషయాన్ని భర్తృహరి తన నీతిశతకంలో ప్రస్తావిస్తాడు.
యదా కించిద్‌జ్ఞో-హం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞో-స్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖో-స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥
నాకేమి తెలియనప్పుడు అంతా తెలుసని సర్వజ్ఞుడిలాగా భావించుకొని మదగజములా విర్రవీగాను. ఆ తర్వాత ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నాను. దాంతో, నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని అర్థమైంది. జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలిపోయింది. సుఖపడ్డాను. అని ఈ శ్లోక భావం.
మౌనమే జ్ఞానదాయిని
అందుకే ఎవరిైనా కలిసినప్పుడు మౌనంగా ఉంటే చాలు. మన అజ్ఞానం బయటపడకుండా ఉంటుంది. ఎదుటివారు చెప్పే విషయాలను వింటూ మన జ్ఞానం మెరుగుపడుతుంది. అన్నీ తెలిసినట్టుగా, వదరుబోతులాగా మాట్లాడడం మొదలెడితే.. ఎప్పటికీ బుద్ధి వికసించడం అనేదే జరగదు.
ఇవి కూడా చదవండి :
బీజేపీతో తెగతెంపులు చేసుకోడానికి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారా?
టికెట్లు ఆన్‌లైన్లో అమ్మినా నిర్మాతల దోపిడీ ఆగదు
‘సౌతిండియా డ్రగ్ కేపిటల్’ విజయవాడ అవుతుందా?
జ్ఞానం అనే పదార్థం యొక్క అసలైన స్వరూపం, ఒడ్డూ పొడుగూ విషయాల్లో పూర్తి అవగాహన లేనప్పుడు.. అప్పటికి తెలిసి ఉన్నదే సమస్తం అని మనకు అనిపిస్తుంది. అదే గర్వంగా పొగరుగా మారుతుంది. అదే జ్ఞానం గురించి ఒక్కొక్క సంగతి తెలుస్తున్న కొద్దీ.. నిన్నటిదాకా తెలుసు అనుకున్నది.. ఎంత పరిమితమైన విషయమో అర్థమవుతుంది. కళ్లు తెరచుకుంటాయి. గర్వం దిగిపోతుంది. భర్తృహరి చెప్పనట్టుగా.. జ్వరం పోయినట్టుగా పోతుంది.
జ్ఞానం సహస్రాంశమైనా మనలో ఉన్నదంటే.. దాని అర్థం.. గర్వరహితంగా ఉండడమే.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే
జ్ఞానం ఉన్నచోట గర్వం ఉండదు.
‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగేకొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది’ అంటూ ఓ సినిమా పాట మనకు వ్యక్తిత్వ పాఠం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎదుగుతున్న సమయంలో మొక్క మౌనంగా ఉంటుందా.. లేదా, మౌనంగా ఉండడం వల్ల మాత్రమే అది ఎదుగుతుందా? అనే మీమాంస వేరు. మౌనంగా ఉండడం తప్ప, ఎదిగే మొక్కకు వేరే ఆప్షన్ లేదు. కానీ మనం మనుషులం.. ఆప్షన్ లు అనేకం ఉన్నా సరే.. ప్రయత్నపూర్వకంగా మౌనం పాటించినప్పుడు మాత్రమే మనం ఎదుగుతాం.
శుభోదయం
.

Discussion about this post