పోలీసులు డ్రగ్స్ పెద్ద మోతాదులో స్వాధీనం చేసుకుంటే.. ప్రజలు నివ్వెరపోవడం మానేసి చాలాకాలం అయింది. ప్రభుత్వ యంత్రాంగాల రకరకాల లోపాలు, లోపాయికారీ తనాలు.. తప్పుడు పనులు చేసేవారికి నేతల దన్ను అన్నీ కలిసి.. మనదేశంలో డ్రగ్స్ దందా పుష్కలంగానే వర్ధిల్లుతోంది.
అయితే, చాటుమాటుగా డ్రగ్స్ దందా నడిపించడం సంగతి అటుంచి. ఆఫ్గనిస్తాన్ నుంచి ఏకంగా షిప్ లలో కంటైనర్లలో డ్రగ్స్ రావడం గమనిస్తే ఎవ్వరైనా అవాక్కు కావాల్సిందే. డ్రగ్స్ పట్టివేత, విచారణలో కేసులు తేలకపోవడం వంటి వార్తల్ని చదివి విసిగిపోయిన వారు కూడా, 9 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ అయి, విజయవాడకు వస్తున్నాయనే సంగతి తెలుసుకుని నివ్వెరపోయారు.
అందుకే ఇప్పుడు బెజవాడ మీద దేశం మొత్తం దృష్టి పడింది. ఆఫ్గనిస్తాన్ నుంచి టాల్కం పౌడర్ రూపంలో కంటైనర్లలో బందరు పోర్టుకు వస్తున్న సరుకును గుజరాత్ లోని ముంద్రా పోర్టులో అధికారులు సీజ్ చేశారు. మొత్తం 9వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. ప్రపంచంలోనే ఇది ఇప్పటిదాకా నమోదు అయినా అతిపెద్ద డ్రగ్ రాకెట్ దందాగా పేర్కొంటున్నారు.
డ్రగ్స్ అనేవి.. గుట్టు చప్పుడు కాకుండా.. చాలాచాలా రహస్యంగా దాచి గ్రాముల వంతున దేశాలు దాటిస్తుంటేనే చాలా పెద్ద పెద్ద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అలాంటిది.. ఏకంగా కంటైనర్ల కొద్దీ హెరాయిన్ షిప్ లలో తరలుతుండే సరికి తనిఖీ, నిఘా అధికారులే నివ్వెరపోయారు. మొత్తం 2988 కిలోల హెరాయిన్ ఇరాన్ కు చెందిన షిప్ లలో రవాణా అయింది.
సరుకు బెజవాడలోని ఆశి ట్రేడింగ్ కంపెనీ అనే చిరునామాకు రవాణా అవుతోంది. అక్కడ తనిఖీలు చేసి.. కేవలం ఒక డాబా ఇంటిని గుర్తించారు. అంతకు మించి పెద్దగా వివరాలు తెలియలేదు.
ఎవరీ గోవిందరాజు? ఎవరీ సుధాకర్?
జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన వివిధ విభాగాల అధికారులు విజయవాడలో ఉన్న చిరునామాపై దాడులు నిర్వహించినా రాబట్టిన వివరాలు మాత్రం తక్కువే. రాకెట్ ను పూర్తిగా ఛేదించలేకపోయారు. గోవిందరాజు అనే వ్యక్తిని మాత్రం అరెస్టు చేశారు. ఈ గోవిందరాజు ఎవరు? అతని నేపథ్యం ఏంటి? నేరచరిత్ర ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియలేదు.
ఆశి ట్రేడింగ్ కంపెనీ అనేది పెద్ద మాయ గా కనిపిస్తోంది. సోలార్ ప్లేట్ల ఏర్పాటు పనులకు సంబంధించిన సంస్థగా ఈ కంపెనీని మాచవరం సుధాకర్ అనే వ్యక్తి ప్రారంభించినట్లు గుర్తించారు. అయితే సదరు మాచవరం సుధాకర్ ను కనిపెట్టలేదు.
కంపెనీ బెజవాడలో ఉన్నప్పటికీ.. సుధాకర్ ఈ డ్రగ్స్ దందాను మొత్తం చెన్నై కేంద్రంగా నడిపిస్తున్నారనే అధికారులు భావిస్తున్నారు. అందుకే అనుమానం ఉన్న చోట్ల దర్యాప్తులు సాగుతున్నాయి.
ఇక్కడే ఎందుకు? ఎవరి ఆశీస్సులున్నాయి?
మాచవరం సుధాకర్ చెన్నైకు చెందిన డ్రగ్ మాఫియా డాన్ అనుకుంటే.. చెన్నై పోర్టుకు తెప్పించుకోకుండా.. బందరు పోర్టుకు ఎందుకు తెప్పిస్తున్నట్టు? బెజవాడ కేంద్రంగా కంపెనీ ఎందుకు రిజిస్టరు చేసినట్టు? ఏపీలో, బెజవాడలో, బందరులో ఏ పెద్దల ఆశీస్సులూ లేకుండానే.. ఇక్కడి నుంచి డ్రగ్ దందా నడిపించే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏకంగా 2988 కిలోల హెరాయిన్ అంటే.. యావత్ సౌత్ ఇండియాకు బెజవాడ డ్రగ్ అడ్డాగా మారిపోయిందా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఇక్కడినుంచే అన్ని ప్రాంతాలకూ డ్రగ్ రవాణా ఒక సాధారణ కృత్యం అయిపోతోందా? అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
మరి దర్యాప్తు సంస్థలు ఈ డ్రగ్ రాకెట్ ను ఎప్పటికి నిగ్గు తేలుస్తారో.? డ్రగ్ మాఫియాలో బెజవాడ పాత్ర ఎంతనేది? తెరవెనుక పెద్దలు ఎవరనేది? ఎప్పటికి తేలుస్తారో చూడాలి.
.

Discussion about this post