ప్రతిక, టీవీ, యూట్యూబ్, వెబ్‌సైట్ ఇలా మాధ్యమం ఏదైనా చదువరులు, వీక్షకులు తమ విలువైన కాలాన్ని వెచ్చించి చుట్టూ జరిగే విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. ఇది సహజసిద్ధమైన ఆసక్తి. మనం ఒక సమాజంలో ఉంటున్నాం కనుక ఆ సమాజంలో జరిగే విషయాలు వర్తమాన పోకడల గురించి అవగాహన లేకుంటే మనం ఆ సమాజం కంటే వెనకబడిపోతాం.
మరీ ముఖ్యంగా సినిమా, రాజకీయ ప్రముఖులతో ముడివడిన విశేషాలకు ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తినే పెట్టుబడిగా మలుచుకుని వ్యూస్ ను పెంచుకోవాలని చాలా మాధ్యమాల నిర్వాహకులు ఆరాటపడుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలేమీ విషయం లేకున్నా గాలి పోగేసి పేరాల కొద్దీ వెబ్ సైట్లలో పత్రికల్లో రాసినా, యూట్యూబుల్లో, టీవీల్లో విన్పించినా ఎవరికీ రవ్వంత ఉపయోగం ఉండదు.
ఏ మాధ్యమానికైనా విశ్వసనీయత ముఖ్యం. ఈ మౌలిక సూత్రమే కొరవడితే మాస్ మీడియాకు అస్తిత్వమే ఉండదు. అరుగుల మీద కూచుని ఉబుసుపోక చెప్పుకునే కబుర్లకూ, మాధ్యమాల రాతలకూ తేడా ఉండదు.
పులి-మేక కథలో పిల్లవాడు ఆట పట్టించడానికి చెప్పిన అసత్యాలు చివరకు అతడి ప్రాణాలకే ముప్పుగా మారినట్లు మాధ్యమాలు కూడా ఇదే ధోరణి కొనసాగిస్తే పూర్తిగా ప్రజాదరణ కోల్పోయి అంతరించిపోతాయి.
ఒకానొక వెబ్ సైట్ లో వచ్చిన ఈ పోస్ట్ చూడండి;
‘‘సింగర్ సునీతకు మళ్లీ కష్టాలు.. రెండో వివాహంతోనూ ఇబ్బందులే.. విడాకుల దిశగా సునీత..!’’
ఇదీ శీర్షిక. సునీత రంగుల ఫోటోతో సహా అల్లిన కథనంలో శీర్షికలో చెప్పిన విషయానికి మించి రవ్వంత అదనపు సమాచారం లేదు.
సునీత పరిచయంతో కథనం మొదలుపెట్టారు. సునీత గాయకురాలే గాక ఆమె అందం కారణంగా క్రేజ్ కూడా ఉందట. ఆ తర్వాత మొదటి పెళ్లి, అది విడాకులకు దారి తీయటం, రెండో పెళ్లి చేసుకోవటం, ఇంతవరకు తెలియని విషయమేదీ లేదు.
‘‘రెండో భర్త రామ్‌తో కూడా మనస్పర్ధలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఇద్దరూ దూరమవుతున్నారనే వార్త నెట్టింటిలో వైరల్ అవుతోంది.’’ అని రాసుకొచ్చారు.
read also : పెద్దిరెడ్డి కుటుంబానికే కొరుకుడు పడలేదే.. ఎవరీ మద్దిరెడ్డి కొండ్రెడ్డి?
నెట్టింట వైరల్ ఎందుకు అవుతుంది? వైరల్ కావడమే ఆ వార్త సత్యసంధతకు ప్రమాణం కాదు కదా!
నిజానికి ఎవరి వైవాహిక జీవితమైనా అది పూర్తిగా వారి వ్యక్తిగతం. వారు కలిసి ఉన్నా, విడిపోయినా జనాలకు వచ్చే లాభనష్టాలు ఉండవు. కాకుంటే ఇక్కడ సెలబ్రిటీలతో ముడిపడిన వ్యక్తిగత విషయం కనుక సహజంగానే కుతూహలాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం నిస్సిగ్గుగా జరుగుతోంది.
read also : పరువు పాయె.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్
సునీత, రామ్ ల వైవాహిక జీవితమూ సంతోషంగా సాగటం లేదని చెప్పేటపుడు ఎంతో కొంత కారణాలు చూపాలి కదా! బలమైన ఆధారాలు అందించాలి కదా!
సునీత, రామ్ లు చిన్నపిల్లలేం కాదు. బాధ్యతగల వృత్తుల్లో వ్యాపకాల్లో ఉన్నవారు. ఇరు కుటుంబాలకు సమాజంలో స్టేటస్ ఉంది. వారిదేమీ టీనేజీ లవ్వు కూడా కాదు. ఏదో ప్రేమ మాయలో పడి తొందరపడి పెళ్లి చేసుకున్నాం, పెళ్లయ్యాక ఆ మోహావేశం చల్లారి లొసుగులు బయటపడ్డాయి కనుక అంతే త్వరగా విడిపోతున్నారనటానికి సమంజస పునాది కన్పించటం లేదు.
రామ్‌తో కలిసి ఉండకుండా, సునీత తన పిల్లల దగ్గరకు వచ్చేసిందా? అలా వచ్చినా దాన్ని వారి మధ్య వైమనస్యాలకు కారణంగా చూపలేం. కొత్త సంవత్సరంలో కొన్నాళ్లు పిల్లలతో గడపాలని అనుకోవచ్చు. సునీత, రామ్ ల సన్నిహితులతో మాట్లాడి వారి పేర్లు రాయకున్నా.. వారు చెప్పిన విశేషాలను కథనంలో జోడించారా? అంటే అదీ లేదు.
read also : జగనన్న కలవదలచుకుంటే మధ్యలో వాళ్లెవరు?
క్షేత్రస్థాయిలో ఎవరితో మాట్లాడకపోయినా ఫోను ద్వారానైనా కొంత కూపీ లాగే ప్రయత్నం చేశారా? అంటే అదీ లేదు. ఏ సునీతతోనో రామ్ తోనో మాట కలిపి విషయం రాబట్టే చొరవగానీ ధైర్యం గానీ చేశారా? అంటే అదీ లేదు.
మేం మాకు తోచిన వాళ్ల మీద బురద చల్లుతూ పోతాం, ఆ బురదను మీరే కడుక్కోండి అనే మీడియా ధోరణితో జుగుప్స కలుగుతోంది ప్రజాజీవితంలో ఉన్నవారికి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
తమ గురించి మీడియాలో వస్తున్న గాసిప్పులన్నింటికీ సమాధానాలు చెప్తూ పోతే మొత్తం జీవితకాలమంతా ఖండనలకే వెచ్చించాలి. ఇక తమ వృత్తి వ్యాసంగాలకు వ్యవధే చిక్కదు.
కాలు కదపకుండా, ఎవరితో మాట్లాడకుండా ఊహాజనిత కట్టుకథలు వండివార్చటం వల్ల ఇటు ప్రజలకూ అటు సెలబ్రిటీలకు కలిగే ప్రయోజనాలేమీ లేకపోగా ఆ మీడియానే పలచబడుతుంది.
మేక -పులి కథ చందంగా చివరకు వారు తీసుకున్న గోతిలో వారే పడతారు.
మరీ ముఖ్యంగా వెబ్‌సైట్, యూట్యూబ్ ల నిర్వాహకులు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పరిణతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
Discussion about this post