ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. జీవో నెంబర్ 35ను రద్దు చేసింది. సినిమా టికెట్ల విక్రయాన్ని ఆన్ లైన్ విధానంలోకి మారుస్తూ ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లను కూడా పూర్తి స్థాయిలో సవరించింది. నగరాలకు, పట్టణాలకు పంచాయతీలకు రకరకాలుగా ధరలను ప్రభుత్వమే నిర్ణయించింది.
అలాగే టికెట్ల రేట్లుపెంచుకునే అవకాశాన్ని కూడా సినిమా డిస్ట్రిబ్యూటర్లకే అప్పగించేలా కోర్టు నిర్ణయం తీసుకుంది.
దీంతో ఒకే జీవోకు సంబంధించి జగన్ ప్రభుత్వానికి రెండు రకాలుగా ఎదురుదెబ్బ తగిలినట్టు లెక్క.
కోర్టు తీర్పు ప్రకారం పాత రేట్ల మాత్రమే వర్తిస్తాయిన తెలుస్తోంది.
హైకోర్టు తీర్పుపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.
హైకోర్టు తీర్పు పట్ల సినిమా పరిశ్రమలో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వానికి ఎదురుదెబ్బే
సినిమా టకెట్ల ధరలను పూర్తిగా ప్రభుత్వమే శాసించేలా నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సినిమా పరిశ్రమలో గగ్గోలు మొదలైంది. సినిమా టికెట్ ధరను నిర్ణయించుకునే అవకాశం తమకే ఉండాలని కూడా సినిమా పరిశ్రమ నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ప్రభుత్వం తీరుమీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన మీద కక్ష సాధించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే గనుక.. తనకు పంతం వస్తే రాష్ట్రంలో తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. అసలు సినిమా టకెట్ ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందంటూ పరిశ్రమ నుంచి పలువురు హైకోర్టను ఆశ్రయించారు.
దీనిపై వాదప్రతివాదాల అనంతరం హైకోర్టు జీవో నెంబర్ 35 ను రద్దు చేసింది. టికెట్ల ధరలు పాతవే వర్తిస్తాయని స్పష్టం చేసింది. టికెట్ల ధరలను సినిమాను బట్టి పెంచుకునే అవకాశం, అధికారం డిస్ట్రిబ్యూటర్లకే ఉంటుందని కూడా హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వ జీవోలో లోపాలు..
టికెట్ ధరలను ప్రభుత్వ నిర్ణయిస్తూ జీవో తేవడం ఒక ఎత్తు అయినప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాలు,.. ఈ జీవో నిర్ణయాన్ని హాస్యాస్పదంగా మార్చివేశాయి. పంచాయతీలలో సినిమా టికెట్ 5రూపాయలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలలో పేరుకు పంచాయతీలే అయినప్పటికీ.. లక్షకు పైగా జనాభా ఉండేవాళ్లు, నగరాలను మించి సినిమాలు ఆడే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఊళ్లలో 5 రూపాయలకు సినిమా టికెట్ ఉండాలనడం.. కామెడీ నిర్ణయంగా మారింది.
5 రూపాయలకు టీ కూడా బజార్లో దొరకని ఈ రోజుల్లో సినిమా టికెట్ ధర 5 రూపాయలు ఉండాలనడం వంటి నిర్ణయాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. మొత్తానికి అసలు ఈ జీవో 35 నే రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం విశేషం.
.