చేతికర్రపై చర్యకు
చెయ్యి ఉపకరించేనా?
ఉస్కో మని అనగానే
తన అనుజుల కరిచేనా?
నర్తించే ఖాకీలకు
వర్తించే సంగీతమేది?
వారి దురుసు పోకడలకు
గీత గీయు వాత ఏది?
అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న రైతులు, స్థానికులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారి ఆందోళనలను అణచివేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఇదంతా కూడా ప్రతిరోజూ వివాదాస్పదం అవుతూనే ఉంది.
అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుంది. ఈనాడు పత్రికలో కథనాల్ని, ఫోటోలను సూమోటోగా స్వీకరించింది. ఫోటోల్లో మహిళల పట్ల మగ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూశారా.. నవ్వులాటగా ఉందా? పౌరులను నిరసన తెలియజేయనివ్వండి.. అంటూ ఆగ్రహించింది. 144వ సెక్షన్ విధించడాన్ని కూడా తప్పుపట్టింది.
తమాషా ఏంటంటే.. పోలీసులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం. సాధారణంగా పోలీసులు ప్రభుత్వ నిర్ణయం లేదా ఆలోచనలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. ప్రత్యేకించి ఇలాంటి సందర్భాల్లో పోలీసులు కేవలం టూల్స్ మాత్రమే అవుతారు. వారి చేతలను నడిపించేది రాజకీయ నిర్ణయాలే అయి ఉంటాయి. అయితే ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులు ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపించి, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడమే చిత్రంగా ఉంది.
ఇలాంటి తీర్పుల వల్ల.. ఏం జరుగుతుంది? పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వేచిచూడాలి.
Discussion about this post