జీవితంలో ప్రతి ఒక్కరూ హాయిగా, సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో తను ఆశించే హాయిని, సుఖాన్ని పొందుతారు. కానీ ఒక్కోసారి తనకు ఎదురయ్యే సంఘటనల వల్ల, తన చుట్టూ ఉండే మనుషుల వల్ల తను అనుభవించే హాయికి, సుఖానికి విఘాతం కలుగుతుంది.
ఉదాహరణకు: రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తన పిల్లవాడికి చాక్లెట్ తెచ్చివ్వడం ఒక తండ్రికి అలవాటు. ఏ కారణం చేతనో ఓరోజు ఆ తండ్రి చాక్లెట్ తీసుకురావడం మర్చిపోయాడు. కానీ ఆ పిల్లవాడు తన తండ్రి ఇంటికి రాగానే పరుగెడుతూ పోయి ఆశగా చాక్లెట్ అడినప్పుడు “రేయ్ బుజ్జీ! ఈరోజు చాక్లెట్ తేవడం మర్చిపోయాను. రేపు తెచ్చిస్తాలే”అన్నప్పుడు ఆ పిల్లాడు నిరాశకు లోనై..”నాన్నా! నాకు ఇప్పుడే కావాలి” అని మారాం చేస్తాడు. అప్పుడు తండ్రి అసహనానికి లోనై పిల్లవాడి మీద కోపం ప్రదర్శిస్తాడు. అప్పుడు తండ్రీకొడుకులు ఇద్దరూ అశాంతికి గురవుతారు.
ఇంకొక ఉదాహరణ: భర్త తన భార్యతో “ఈరోజు మధ్యాహ్నానికి వంకాయ కూర చేయవోయ్” అని అర్డర్ చేసి బజారుకు వెళ్తాడు. రోజూ వీధిలోకి వచ్చే కూరగాయల బండాయన ఆరోజు వంకాయలు తీసుకురాకపోవడంచేతనో, ఆవిడకు ఒంట్లో నలతగా ఉండడంచేతనో అతని భార్య వంకాయకూర బదులు వేరుశనగ కాయల పచ్చడి చేసుంటుంది. మధ్యాహ్నానికి భోజనానికి వచ్చిన భర్త వంకాయకూర బదులుగా వేరుశనగ కాయల పచ్చడి చూసి, తను చెప్పింది చేయలేదని అసహనానికి గురై తన భార్య ఎందుకు అలా చేసిందని ఆరా తీయకుండా ఆమె మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు ఇద్దరూ అశాంతికి గురవుతారు.
దీనికంతటికీ కారణం తనకు నచ్చినట్లు ఇతరులు ఉండకపోవడం, తను అనుకున్నట్లే అన్నీ జరగకపోవడం. ఇలా జరగడం సహజమే అయినప్పటికీ దానిని మనస్సు అంగీకరించదు. అప్పుడు అశాంతి, చికాకు, కోపం, ద్వేషం, అసూయ వంటి అవలక్షణాలు తనకు తెలియకుండానే తనలోకి ప్రవేశించి అలజడి సృష్టించడం వల్ల అప్పటివరకు అనుభవించే హాయి, సుఖం ఎండమావులు అవుతాయి.
also read: శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం లక్ష్మీదేవి స్తనం నుంచి పుట్టిందని మీకు తెలుసా?
మరి ఈ హాయి, సుఖం చిరకాలం ఉండాలంటే.. మనం ఏంచెయ్యాలి?
- తనకు నచ్చినట్లు ఇతరులు ఉండాలనే అజ్ఞానపు ఆలోచనను మనలోంచి పూర్తిగా తొలగించుకోవాలి.
- ప్రతిదీ తనకు అనుకూలంగా జరగాలనే అత్యాశను మన అంతరంగంలోంచి తుడిచివేయాలి.
ఇవి ఆచరించడం కష్టమే అయినప్పటికీ సుఖంగా, హాయిగా ఉండాలంటే పాటించక తప్పదు. వేరే మార్గమే లేదు.
సారాంశం:
లోకంలో జరిగే ఏ విషయాన్ని ఆక్షేపించకుండా, సమర్థించకుండా ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించి, అన్నింటికీ సాక్షిగా ఉండడమే ఏ మనిషికైనా శ్రేయస్కరం.
..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.