బొత్స సత్యనారాయణ మాటలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో చేరుతుందనే అభిప్రాయాలు ప్రజల్లో బలపడుతున్నాయి. జగన్మోహన రెడ్డి మంతనాలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. ఎన్డీయేలో చేరడం తప్పేమీ కాదు.. పాపంగా ఎంచవలసిన అవసరం లేదు. ఏ పార్టీ రాజకీయ వ్యూహాలు, అవసరాలను బట్టి కేంద్రంలోని కూటముల్లో చేరడమూ, దూరంగా ఉండడమూ జరుగుతుంటుంది. అయితే.. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంతవరకు.. వారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడ్డానికి కూటముల్లో చేరుతున్నారా? పణంగా పెట్టి కూటముల్లో చేరుతున్నారా? అనేది మాత్రమే చర్చనీయాంశం.
ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సంగతి తేలకుండా.. ఎన్డీయేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరడం అనేది పెద్ద తప్పిదమే అవుతుంది. గతంలో అత్యుత్సాహంతో చంద్రబాబునాయుడు చేసిన తప్పునే జగన్మోహన రెడ్డి కూడా మళ్లీ చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రత్యేకహోదా రాబట్టాలి అనేది మన డిమాండ్ కాదు.. ఆ సంగతి ఏదో ఒకటి తేల్చేయాలి.
చంద్రబాబు గతంలో ఎన్డీయేలో చేరి మంత్రి పదవులు తీసుకుని.. హోదాను తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు అయిదేళ్లు కాకుండా, పదేళ్లు హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన భాజపా నేతలు, స్వయంగా హోదా తప్పకుండా ఇస్తాం అని మాట ఇచ్చిన ప్రధాని అందరూ గద్దె ఎక్కిన తర్వాత తుస్సుమనిపించారు. మొహమాటం లేకుండా మాట తప్పారు. వారికి తగ్గట్టుగా చంద్రబాబు హోదా డిమాండ్ ను కాలరాచి.. వారికి వంత పాడుతూ.. నీరసింపజేశారు. చివర్లో.. కొన్నాళ్లో హోదా పోరాటాలు అంటూ ధర్మపోరాట దీక్షలు నిష్ప్రయోజనకరంగా నడిపించారు. ఇప్పుడు మళ్లీ జగన్ వంతు వచ్చింది. జగన్ తమకు ప్రత్యేకహోదా కావాలంటూ.. కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. కేంద్రంలోని పెద్దల్ని కలిసినప్పుడు వినతిపత్రాలు ఇచ్చినట్టుగా మీడియాకు వెల్లడిస్తున్నారు.
నిజంగా జగన్ గనుక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంటే గనుక.. అది వచ్చే దాకా ఎన్డీయేలో చేరకపోవడం అనేది రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి అనిపించుకుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.. మోడీ అనే నాయకుడు మోనార్క్ గా మారి తాను తలచిందే చట్టం, చేసిందే న్యాయం అని అనుకుంటున్న తరుణంలో.. రాష్ట్రానికి హోదా రావడం అనేది అసాధ్యం. పరవాలేదు.. రాష్ట్ర ప్రజలు కూడా.. ఆ మోసానికి సిద్ధపడే ఉన్నారు. కానీ జగన్మోహనరెడ్డి హోదాకోసం వినతిపత్రాలు ఇస్తున్నా అంటూ మరో కొత్త అంకానికి తెరతీయకుండా.. వస్తుందా రాదా కేంద్రంతో మాట్లాడి తేల్చేయాలి. హోదా వచ్చే అవకాశం లేదు.. అని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. హోదా ఇవ్వనందుకు ప్రత్యామ్నాయంగా (గతంలో చంద్రబాబు జమానాలో కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ లాగా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏం కొత్త వరాలు ఇస్తుందో తేల్చాలి. వాటి గురించి కూడా ప్రజలకు వివరించి చెప్పాలి. హోదా రాకపోయినా పర్లేదు గానీ, ఆ సంగతి తేల్చిన తర్వాత మాత్రమే ఎన్డీయేలో చేరాలి. అప్పుడే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు నిరూపణ అవుతుంది.
హోదా విషయంలో చంద్రబాబు ముందు ఒక మాట.. తర్వాత ఒక మాట.. ఆ తర్వాత మళ్లీ ఒక మాట మాట్లాడుతూ.. ప్రజల్లో తన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. అదే తప్పు జగన్మోహన రెడ్డి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటిదాకా ఆయన సూటిగా పనిచేసుకుపోయే నాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. అమరావతిని నాడు ఆమోదించారు.. అనేది ప్రత్యర్థుల విమర్శ మాత్రమే. సరిగ్గా ఎన్నికల ప్రచారవేళ.. జగన్ గెలిస్తే.. రాజధాని అమరావతిలో ఉండదంటూ తెదేపా తీవ్రంగా ప్రచారం చేసింది. ఆ రకంగా గుంటూరు జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. అమరావతి ప్రాంతంలో వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల నుంచి.. జగన్ మీద ఒత్తిడి వచ్చింది. గుంటూరు జిల్లాలో నిర్వహించే ప్రచార సభలో.. రాజధాని అమరావతిలోనే ఉంటుంది.. ఎక్కడికీ తరలిపోదు.. అనే ప్రకటన చేయాల్సిందిగా లోకల్ కేండిడేట్స్ కోరారు. అయినాసరే.. జగన్ ఆ మాట పొరబాట్న కూడా అనలేదు. అంటే మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు!
మాట మీద నిలిచే నాయకుడని ఆ పార్టీ వారు చెప్పుకునే మాటల్ని, ఆ రకమైన కీర్తిని కలకాలం కాపాడుకోవాలంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతి అటో ఇటో తేల్చేసిన తర్వాతనే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్డీయేలో భాగస్వామి అయితే వారికే మంచిది.
.