కారణాలు ఏవైనా కావొచ్చు గానీ… జగన్మోహనరెడ్డి పరిపాలన మొదలైన తర్వాత.. రాష్ట్రంలో ఐటీరంగం కుదేలైన మాట వాస్తవం. అయితే అందుకు సరైన మూలకారణాల్ని అన్వేషించి, అవి తమ ప్రభుత్వం వల్ల కాదని ప్రజలు నమ్మేలా చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. దానితో పాటూ.. ఐటీ కంపెనీలు ఏమైనా ఆందోళనకు గురవుతుంటే గనుక.. తమ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో లేదని నమ్మించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అలాంటి ప్రయత్నాలు చేయకుండా.. కేవలం చంద్రబాబునాయుడు సాగిస్తున్న దుష్ప్రచారం మీద నెపం వేసి తప్పించుకుంటాం అంటే కుదర్దు. కానీ మంత్రులు అదే పని చేస్తున్నారు.
విశాఖలోని ఐటీహిల్స్ ఇన్నోవేషన్ సెంటర్ లో ఐటీ సంస్థల సీఈవోలతో ఒక సమావేశం జరిగింది. ఐటీ మంత్రి గౌతం రెడ్డి, మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. ఐటీ సంస్థలు ఎక్కడకూ తరలిపోవాల్సిన అవసరం లేదంటూ ఈ సమావేశంలో సీఈవోలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వ అధికారులు ఐటీ కంపెనీలలో ఉద్యోగుల సంఖ్యపై వివరాలు సేకరించే ప్రయత్నం చేశారే తప్ప.. ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. మధ్యలో చంద్రబాబునాయుడు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం చేస్తున్న అసత్య ప్రచారాలతో ఐటీ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ … నెపం వారి మీద నెట్టడానికి గౌతం రెడ్డి ప్రయత్నించారు. ఐటీ కంపెనీలు విశాఖనుంచి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు చెప్పడం అనేది రాష్ట్ర వ్యవహారాల్ని వాణిజ్యాన్ని దెబ్బతీసిందనేది ఆయన ఆరోపణ. ఇలాంటి మాటలు ప్రభుత్వ పలాయనవాదం తప్ప మరొకటి కాదు.
కేవలం చంద్రబాబు ఒక్కడు చెప్పడం వల్ల.. వాణిజ్యం మొత్తం దెబ్బతిన్నదంటే.. ఆ మేరకు ఆయన మాటకు మాత్రమే వ్యాపార, పారిశ్రామికవేత్తలో ఇంకా నమ్మకం ప్రబలంగా ఉన్నట్టే కదా? ఆయన మాటకు మించి ప్రభుత్వం వ్యాపారవేత్తల్లో నమ్మకాన్ని పొందలేకపోతున్నదనే కదా అర్థం!! ఆ విషయం గౌతంరెడ్డి గుర్తించడం లేదు. చంద్రబాబు మీద నెపం వేయడం అంటే.. పరోక్షంగా తమ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతున్నదని ఒప్పుకోవడమే. తమ ప్రభుత్వ దుర్బలత్వాన్ని ఒప్పుకోవడమే.
విశాఖలోని ఐటీ కంపెనీల సీఈవోలతో ఇద్దరు మంత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారంటేనే దాని అర్థం.. ఐటీ రంగంలో భయం చెలామణీ అవుతున్నదని! ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అలాంటి భయాలతో పని లేదని, తమ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి మునుపటి ఎక్కువగా కట్టుబడి ఉంటుందని భరోసా ఇస్తే చాలు. ఆ భరోసా ఇవ్వడం అనేది, చంద్రబాబు మీద ఆరోపణల, మాటల రూపంలో కాకుండా, తమ ప్రభుత్వ చేతల రూపంలో ఉండాలని మంత్రులు గ్రహించాలి.
.