ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై , చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆయన డాన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులు బరితెగింపు రాజకీయాలకు పరాకాష్టగా కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఆలయ దాడుల నిందితుల్ని కాపాడటమే జగన్ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వక్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గొరిల్లా దాడుల్లో ఆరితేరిన వారే గొరిల్లా ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులన్నింటినీ తెలుగుదేశం పార్టీ జాబితా రూపొందించింది. ఏయే ఆలయాలపై ఏయే రోజుల్లో దాడులు జరిగాయో.. వాటికి సంబంధించి నేరస్తుల్ని పట్టుకోవడంలో ఇప్పటిదాకా సాధించిన పురోగతి ఏమిటో తెలుగుదేశం ప్రజలముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది. ఆ నేపథ్యంలో.. రాష్ట్రంలో 136 హిందూ ఆలయాలపై జరిగిన దాడుల నిందితులను కాపాడటమే లక్ష్యంగా సిఎం జగన్ రెడ్డి పెట్టుకున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. తన చేతగాని తనాన్ని కప్పిపెట్టుకోడానికే తమ మీద ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ మాటలకు, పచ్చి అబద్దాలకు, గాలి కబుర్లకు నిదర్శనం అన్నారు. దేవాలయాలపై దాడుల్లో జగన్ రెడ్డి దొంగని దేశం మొత్తం నిలదీస్తుంటే, అంశాన్ని టీడీపీ కు ముడిపెట్టడం సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు.
నేరాలు చేయడం, నేరగాళ్లకు వత్తాసు పలకడం, నిలదీసిన వాళ్ళపై ఎదురు కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలకు నిదర్శనంగా చంద్రబాబు పేర్కొన్నారు. రామతీర్ధంలో జరిగిన విధ్వంసం చూడటానికి వెళ్లిన తనతో సహా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. పేకాటలో తన అనుచరులు ఉంటే తప్పేంటి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సిఎం జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడాలంటూ దెప్పిపొడిచారు. పేకాట రాయుళ్లు, గేంబ్లర్లు మంత్రులుగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని, పేకాట క్లబ్బుల నిర్వహణలో మంత్రులు మునిగి తేలుతున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో డాన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని, వైకాపా పాపాలు పండాయి. జగన్మోహన్ రెడ్డి పాపాలు పరాకాష్టకు చేరాయని ఆయన అన్నారు.
Discussion about this post